Saturday, October 2, 2010

మది చీల్చుకు వచ్చిన మాట


సాక్షి ఫ్యామిలీలో జిందగీ కాలమ్ కోసం రాసిన ఆర్టికల్.



Wednesday, September 29, 2010

నా లిస్టులో చేరిన మరో మంచి సినిమా!


దాసరి నారాయణరావు...  నా నా అభిమాన దర్శకుడు అని చెప్పేస్తే సరిపోదు. ఎందుకంటే నాలాంటి అభిమానులు వందల్లో, వేళల్లో వుంటారు. అద్భుతమైన సినిమాలను సృష్టించిన ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. బలిపీఠం, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి,  మేఘసందేశం, ప్రేమాభిషేకం, శివరంజని... ఒకటా రెండా.. చెప్పుకుంటూ పోతే లెక్క తెగనన్ని చిత్ర రాజాలు మన కళ్ళముందు ఠీవిగా వచ్చి నిలబడతాయి. అలాంటి ఒక చిత్రాన్ని ఈరోజు ఉదయం తేజ టీవిలో చూసాను. అదే ధర్మపీఠం దద్దరిల్లింది. శోభన్ బాబు, జయసుధ, కైకాల సత్యనారాయణ తదితరులు నటించిన ఈ చిత్రం.. దర్శకరత్నమన తెలుగు ప్రేక్షకులకు ఇచ్చిన మరో మంచి చిత్రం.
                మామూలుగానే శోభన్ బాబు అంటే పడి చచ్చే నేను, ఈ సినిమాలో ఆయన నటన చూసి రెప్ప వేయటం కూడా మర్చిపోయాను. ఆ ఠీవి, ఆ నడక, ఆ డైలాగ్ డెలివరీ... ఓహ్.. ఆ పాత్రలో ఆయన జీవించారు. తన బిడ్డలను దేశానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలనే వున్నతమైన ఆలోచనతో ఒకడిని డాక్టర్ని, ఒకడిని ఇంజినీర్ని, ఒకడిని లాయర్ని చేస్తాడు తండ్రి. కానీ వాళ్ళు అవినీతికి కొమ్ము కాసేవాళ్ళుగా, లంచాలకు న్యాయాన్ని తాకట్టు పెట్టేవాల్లుగా తయారవుతారు. ఒక కొడుకు చేసిన దుర్మార్గాన్ని చూసిన తల్లి దానిని బయటపెట్టబోతున్న తల్లిని, ముగ్గురు కొడుకులూ కలిసి  పిచ్చిదానిలా చిత్రీకరిస్తారు. ఒక సమయంలో భర్తకు నిజం చెప్పి కన్ను మూస్తుంది ఆమె. సాయం చేయమని వచ్చిన తన స్నేహితునికి సైతం డబ్బుకు ఆశపడి తన కొడుకులు అన్యాయం చేయడాన్ని జీర్నిన్చుకోలేకపోతాడు తండ్రి. వాళ్ళు బతికుంటే సమాజాన్ని నాశనం చేస్తారన్న ఉద్దేశంతో తన ముగ్గురు కొడుకుల్నీ చంపేస్తాడు. న్యాయస్థానం అతనికి ఉరిశిక్షను విధించగానే, కోర్టులోనే కుప్పకూలిపోతాడు.
             కధ ఆసాంతం ఆసక్తికరంగా సాగుతుంది. అందరూ ఎవరి పాత్రలకు వాళ్ళు న్యాయం చేసారు. అయితే శోభన్ నటన మాత్రం అద్వితీయం. ముఖ్యంగా క్లైమాక్స్లోని  కోర్టు సీన్లో ఆయన హావభావాలు, డైలాగ్స్ చెప్పేటప్పుడు ఖంగుమనే స్వరం అమేజింగ్. శోభన్ బాబు సినిమా కదా అని చూడటం మొదలుపెట్టాను కానీ, ఆ కధ, కధన శైలి నన్ను కదలనివ్వలేదు. హాట్సాఫ్ టు దాసరి అండ్ శోభన్ బాబు!

న్యాయం గెలిచిందా ఓడిందా?

సుదీర్ఘ విచారణలు, వివాదాల తరువాత ఆయేషా మీరా హత్య కేసులో తీర్పు వెలువడింది. నిందితుడికి యావజ్జీవ శిక్ష పడింది. అయితే శిక్ష పడింది నేరం చేసినవాడికేనా? చేసాడని అనుకుంటున్న వాడికా?


       ఆ రోజు ఉదయం పేపర్లో ఆయేషా హత్య గురించి చదివి నేను కదలిపోయాను. మనుషుల్లో ఇంత పైశాచికత్వం, ఇంత రాక్షసత్వం ఉంటాయా అని హడాలిపోయాను. అభం శుభం తెలియని ఒక ఆడపిల్లని ఇంత క్రూరంగా చంపిన మానవ మృగాన్ని ఏమి చేసినా పాపం లేదని అనుకున్నాను. కాని నేను కోరుకున్నట్టు వాడిని ఎవరూ ఏమీ చేయలేదు. ఒక పసిమొగ్గ రాలిపోయింది. ఎవరూ పట్టించుకున్నట్టు కనిపించలేదు. ఒక కన్నతల్లి కన్నీరు ఏరయ్యింది. ఆమెకు ఎవరూ ఓదార్పు కలిగించలేదు. న్యాయం చేయలేదు. సాక్ష్యాలు తారుమారయ్యాయి. వాస్తవాలు మారిపోయాయి. 
          ఆయేషా హత్య జరిగిన రోజు ఆమె ఉంటున్న హాస్టల్ ఎదురుగా ఉన్న టీ కొట్టులో టీ తాగుతూ, హాస్టల్ వద్దనే సత్యంబాబు తచ్చాడటం ఒక వ్యక్తి చూశాడు. అంతకుమించిన ప్రత్యక్ష ఆధారాలు లేవు. అయినా అతన్ని అరెస్ట్ చేసారు. రకరకాలుగా విచారణ చేసారు. అతను నేరాన్ని అంగీకరించాడు. ఇప్పుడు శిక్షకీ తల వంచాడు. కానీ అతడు నేరస్తుడు కాదని, అసలు నేరస్తులు వేరే వున్నారని ఆయేషా తల్లి బల్ల గుద్ది చెప్పారు. మరి ఆ మాటలను ఎవరూ ఎందుకు పట్టించుకోలేదో, కనీసం హాస్టల్ వార్డెన్ని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదో ఎవరికీ తెలియదు. ఇప్పటికీ అర్ధం కాని, సమాధానం దొరకని ప్రశ్నలే. అయితే ఈ ప్రశ్నలు తీర్పు ఇచ్చే జడ్గి మనసులో రేకేత్తకపోతయా, వాళ్ళని కూడా హాజరుపరచమని ఆదేశాలు ఇవ్వకపోతాడా అని చివరి క్షణం వరకూ ఆశగా చూసాను. కాని నేనూ అనుకున్నది జరగలేదు.  అనుమానాలు నివృత్తి కానేలేదు. కేసు మాత్రం పూర్తయింది. న్యాయమే గెలిచిందో అన్యాయమో గెలిచిందో తెలియదు కానీ ఆయేషా హత్యోదంతానికి శాశ్వతంగా తెర పడింది.
          ఎందుకో తెలియదు కాని, ఈ తీర్పు నాకు సంతృప్తిని కలిగించలేదు. సత్యం అసలు నేరస్తుడు కాదని అందరిలాగే నేనూ నమ్మటం వల్లనా లేక ఒక అమాయక ఆడపిల్లను నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్న క్రూరునికి ఆ శిక్ష సరిపోదనా? ఏమో... ఏమీ తెలియటం లేదు. ఒకటి మాత్రం అనిపిస్తోంది. ఈ సమాజంలో ఆడపిల్లకు ఇప్పటికీ రక్షణ కరువే... పేదవాడికి ఎప్పటికి న్యాయం కరువే.

Friday, August 20, 2010

చిన్నవాళ్ళ పెద్ద మనసు


దేనికోసమో ఇంటర్నెట్ ను తవ్వుతుంటే ఈ అద్భుత దృశ్యం కంటబడింది. మనిషికి మనిషి చేయగలిగిన సాయం చేయడానికి కూడా ముందుకు రాని ఈ రోజుల్లో, ఆడుతూ పాడుతూ తిరిగే ఈ పసివాళ్ళు ఒక మూగ ప్రాణిని కాపాడటం కోసం పడిన తపన నన్ను కదిలించింది. స్వార్ధంతో మన సుఖం మన సంతోషం తప్ప, సాటి మనిషి గురించి కనీసం పట్టించుకోని మనకు పిల్లలు నేర్పుతున్న పాఠం ఇది!   



Friday, August 13, 2010

నీవు మరపు'రావు'


నేడు రావు గోపాలరావు వర్ధంతి.

ఆహార్యం, వాచకం, అభినయం... అన్నింట్లోనూ ఆయనది ఒక ప్రత్యేక శైలి. ఆయన కామెడీ చేస్తే నవ్వలేక పొట్టలు పగిలిపోతాయి. ఆయన విలనిజం చూపితే భయంతో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 'ఊరికి మొనగాడు' నుంచి 'ఆ ఒక్కటి అడక్కు' వరకు తన నటనా కౌశలంతో తెలుగు ప్రజానీకాన్ని ఉర్రూతలూగించిన రావు గోపాలరావు వర్ధంతి నేడు. తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ దగ్గరలోని గంగనపల్లిలో జన్మించిన రావు గోపాలరావు, దేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగారు. తన అద్బుత నటనతో అందరి మనస్సులో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు.
               నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రావు గోపాలరావు సినిమాలు చూస్తూనే వున్నాను. సాధారణంగా ఆయన పేరు చెప్పగానే అందరూ ముత్యాలముగ్గు గురించి మాట్లాడతారు. కానీ నాకు మాత్రం మల్లెపువ్వు సినిమాలో నటన ఇష్టం. ఇప్పటికీ ఆ సినిమా 22 సార్లు చూసాను. శోభన్ బాబు నటన,  కధ, కధనం, పాటలు... వీటన్నిటితో పాటు రావు గోపాలరావు నటన అమితంగా నచ్చటమే  అందుకు కారణం. ఇంటిగుట్టులో పాత్ర కూడా మనసుకు హత్తుకుంటుంది. అంత ఉదాత్తమైన పాత్రలో గుండెను తాకేలా ఆయన ప్రదర్శించిన నటన కంటతడి పెట్టిస్తుంది. దేవాలయం, బొబ్బిలి పులి, దొంగ మొగుడు, చాలెంజ్, గ్యాంగ్ లీడర్ తదితర చిత్రాల్లో విలన్ రావు గోపాలరావుని, ఘరానా మొగుడు, అల్లరి అల్లుడు, ఆ ఒక్కటి అడక్కు తదితర చిత్రాల్లోని సాత్వికుడైన రావు గోపాలరావుని మరచిపోవటం అంత తేలిక కాదు. అందుకేగా చనిపోయి పదహారేళ్ళు అవుతున్న ఇప్పటికీ ఆయనను మన మనసుల్లో సజీవంగా నిలుపుకుని కొనియాడుతున్నాం! 
              మన అభిమాన నట రారాజు ఆత్మకు శాంతి కలగాలని మనసారా ప్రార్ధిద్దాం!


  


Friday, July 23, 2010

పాలబుగ్గలపై కన్నీటి చారికలా?

మొన్న పేపర్ చదువుతుంటే ఒక వార్త... పన్నెండేళ్ళ బాలికపై అత్యాచారం.
నిన్న మరో వార్త... ప్రేమించలేదంటూ పద్నాలుగేళ్ళ బాలికపై యాసిడ్ దాడి.
ఇవాళ ఇంకో వార్త... తుపాకీతో బెదిరించి మైనారిటీ తీరని పిల్లలపై అత్యాచారం చేస్తున్న స్కూల్ కరస్పాండెంట్.
ఏమిటిదంతా?
పై వార్తలు చదివినప్పుడు నా మనసులో ఉత్పన్నమైన ప్రశ్న.
ఆడదాని దౌర్భల్యం. స్త్రీజాతి దురదృష్టం. మహిళల నిస్సహాయత.
నాకు నేను చెప్పుకున్న సమాధానం.
చిన్ననాటి నుండీ వింటున్న ఒక రొటీన్ సమాధానం.
ఏమిటీ దౌర్భాగ్యం?
ఆడదాన్ని చూడగానే తప్పుడు ఆలోచనలే ఎందుకు కలుగుతున్నాయీ  మగాళ్ళకి?
చిన్న పెద్ద తేడా కూడా చూడకుండా కామంతో మూసుకుపోయిన చూపులు వెంటాడుతుంటే ఎలా బతుకుతుంది ఆడది ఈ మగాళ్ళ లోకంలో?
ఇంటర్వ్యూకి సిటీకి వచ్చిన ఒక వివాహితను, ఆటో డ్రైవర్ తన స్నేహితులతో కలిసి రేప్ చేసాడు.
చుట్టపు చూపు చూడటానికి వచ్చి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆరేళ్ళ చిన్ని పాపపై పశువులా పడ్డాడో ముదుసలి.
పొరపాటున తన బావతో హోటల్ గదిలో దొరికినందుకు, సెల్ ఫోనులో ఫోటోలు తీసి, వాటి ద్వారా బెదిరించి ఒక అమ్మాయిపై నాలుగు నెలలపాటు అత్యాచారం జరిపారు పోలీసులు.
ఎన్ని అకృత్యాలు? ఎన్ని దుర్మార్గాలు? ఎన్నెన్ని దారుణాలు?
టెన్నిస్ నేర్చుకోడానికి వెళ్ళిన రుచిక పరిస్తితి ఏమయ్యింది?
ఐజీ పదవిలో వున్న రాక్షసుడు పద్నాలుగేళ్ళ ఆ పాపపై అక్రుత్యానికి ఒడిగట్టాడు. న్యాయం కోసం పోరాడీ పోరాడీ అలసిపోయిన ఆ పసి మనసు ముక్కలైపోయింది. మలినమైన తనువుతో బతకలేక మరణంతో తన కధకు ముగింపు పలికింది.
చదువుకోవాలనే ఆశతో హాస్టల్లో చేరిన ఆయేషాకు జరిగిన అన్యాయం తెలియనిదెవరికి?
మృగంలా ఒక మగాడు ఆమె తనువును చీల్చేస్తుంటే, ఆ చిట్టితల్లి పెట్టిన కేకలు ఏ గాలిలో కలిసిపోయాయో?
ప్రత్యూష చావు వెనుక వున్న రహస్యాలను బయటపెట్టేది ఎవరు?
పల్లెల్లో.. పట్టణాల్లో.. మహిళలపై ఇలాంటి అత్యాచారాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.
అంతమైపోయిన ఆ జీవితాలను చూసి ఈ లోకం ఒక చిన్న కన్నీటి బొట్టు విడుస్తుంది.
రాలిపోయిన ఆ లేలేత కుసుమాల కోసం ఒక నిమిషం మౌనం పాటిస్తోంది.
ఆ తరువాత వాళ్ళ కధలు కాగితాల్లో మిగిలిపోతాయి.
వాళ్లకు జరిగిన అన్యాయం కాలగర్భంలో కలిసిపోతుంది.
ఇంతేనా?
నెలల పిల్లల్ని సైతం ఎవరి చేతుల్లోనూ పెట్టలేని భయం ఎందుకు మనకి?
పిల్లల్ని స్కూలుకి పంపి, వాళ్ళు తిరిగి వచ్చేవరకూ ప్రశాంతంగా ఉండలేని దౌర్భాగ్యం ఏమిటి మనకి?
ఆడపిల్లని కనటమే పాపమా?
అలాగే వుంది పరిస్తితి.
ఆడపిల్లని పెంచటం, పెళ్లి చేయటం కాదు, వాళ్ళని కామాంధుల కళ్ళల్లో పడకుండా కాపాడుకోవటమే కష్టమైన పని నేటి తల్లిదండ్రులకి.
ఇలాగైతే ఆడపిల్లలకి రక్షణ కలిగేదేప్పుడు?
ఈ సమాజంలో వాళ్ళు ధైర్యంగా తిరిగేదేప్పుడు?
అత్యాచారాలు, లైంగిక వేధింపుల పట్ల మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు ఆందోళన చేస్తాయి గాని కాలగమనంలో వారి ఆందోళనలు మరుగునపడిపోతున్నాయి. ఒక కేసులో తీర్పు వచ్చేలోపు మరో కేసు. ఆ కేసును పరిసీలించేలోపు మరోటి. సంఘటనలు జరగటమే తప్ప సమస్యకు అంతం కనిపించటం లేదు. ఏళ్ళ తరబడి కేసులు వాయిదాలు.. యీలోపు సాక్షులను, సాక్ష్యాధారాలను తారుమారు చేయటం.. కేసును తమకు అనుకూలంగా మలచుకోవడం.. పైకోర్టుకు అప్పీలు.. తర్వాత కేసు మాఫీ…
ఇంతకు మించి జరిగేదేమిటి?
వున్న దరిద్రం చాలక అత్యాచారం జరగడానికి స్త్రీ కూడా కారణమని వాదిస్తున్నారు కొందరు ప్రబుద్దులు. స్త్రీలు శరీర భాగాలు కనపడేలా దుస్తులు ధరిస్తే మగాడు ఊరుకుంటాడా? ఆ మధ్య ఒక మగ మహారాజు వేసిన ప్రశ్న ఇది.
అందరు ఆడవాళ్ళు అమాయకులు,  మగాళ్ళంతా దుర్మార్గులు అని నేను వాదించను. అందరు ఆడవాళ్ళూ అమాయకులు కాకపోవచ్చు. అందరు మగాళ్ళూ కీచకులు కాకపోవచ్చు. కానీ సమాజంలో జురుగుతున్న దారుణాలను చూసిన తరువాత ఆడదానికి మగాడి నుంచి ఎదురవుతున్న సమస్యలు చూసిన తరువాత ఇలా మాట్లాడాల్సి వస్తోంది. ఆడదానికి అన్యాయం చేస్తున్న మగాళ్ళ గురించే మనం మాట్లాడాలి.
ఆడది సరైన బట్టలు వేసుకోకపోవటం వల్ల మగాడికి కోరిక పుడుతోందా? ఎంత నీచమైన వాదన ఇది! నెలల పసికందులపై, పదేళ్లలోపు పిల్లలపై కూడా దారుణాలకు ఒడిగడుతున్నారు. మరి వాళ్ళు కూడా ఈ కోవలోకే వస్తారా? పొట్టి దుస్తులు మాత్రమే కాదు, చీర కట్టుకున్న ఆడది కూడా బలవుతోంది. దానికేమంటారో సదరు పెద్దమనిషి!
రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ దుస్తితికి బాధపడకుండా, ఇలాంటి అర్ధం పర్దం లేని కామెంట్లు చేసేవాళ్ళకు వేయాలి ముందు శిక్ష.
మనిషిలో పెరిగిపోతున్న పశు ప్రవ్రుత్తి, మంటగలిసిపోతున్న మానవీయ విలువలు ఈ దారుణాలకు కారణమని తెలిసి కూడా ఆడదానిపై నిందలు మోపి, తమ రాక్షసత్వాన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్న మగ మహారాజులకు నాదో మనవి.
దయ చేసి మీ రాక్షస క్రీడకు పాలబుగ్గల పసివాళ్ళను బలి చేయకండి.
మానవత్వాన్ని మర్చిపోయి లేలేత కుసుమాలను నిర్దాక్షిణ్యంగా నలిపి పారేయకండి.
అంకుల్, అన్నయ్యా, సార్ అంటూ అమాయకంగా పిలిచే ఆ చిట్టి తల్లుల్లకు చితి పేర్చకండి.
పరాయివాళ్ళ పిల్లల పట్ల అలాంటి ఆలోచన కలిగితే... మీ కడుపున పుట్టిన బిడ్డను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.
మహానుభావులు కానక్కర్లేదు, కనీసం మనుషుల్లా ప్రవర్తించండి.

Thursday, July 8, 2010

మనసున్న మారాజు

జనుల మనసెరిగిన రాజు
మమతకు అర్ధం చెప్పిన మనసున్న మారాజు
ప్రజల శ్రేయస్సే పరమావధిగా పాలించిన రారాజు
ప్రతిఫలమాశించక ప్రేమను పంచిన మహారాజు

ఆయన లేకున్నా అయన జ్ఞాపకాలు మనలను విడిచిపోవు.
అయన వెళ్ళిపోయినా ఆయన పంచిన వెలుగులో బతుకుతున్న జీవితాలు ఆయనను మరచిపోవు.

మదిమదిలో కొలువైన మహా మనీషికి వందనం
మరువలేని, మరపురాని మహానుభావునికి అభివందనం







Monday, June 28, 2010

'చెత్త' హోటల్!

(సాక్షి ఫండే మ్యాగజైన్ కోసం రాసిన ఆర్టికల్)

Saturday, June 26, 2010

కేక పెట్టించే కేకులు!

కేకు పేరు చెబితే లోట్టలేయని వారుండరు. కానీ ఈ కేకులను చూస్తే మాత్రం కేక పెట్టకుండా వుండరు. ఒక వంటగాడు తన సృజనాత్మకతను ఇలా ప్రదర్శించి చూపాడు. క్రియేటివిటీ సంగతేమో కానీ... వీటిని చూసాక పిల్లలు కేకు పేరు చెబితేనే జడుసుకోవటం ఖాయం. కావాలంటే మీరూ చూడండి!




Thursday, June 24, 2010

విలన్ ఏమంటున్నాడు?


నటీనటులు: విక్రమ్, ఐశ్వర్యారాయ్, పృథ్విరాజ్, కార్తీక్, ప్రభు, ప్రియమణి తదితరులు.
కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మణిరత్నం
నిర్మాతలు: మణిరత్నం, శారద త్రిలోక్
సంగీతం: రెహమాన్
మాటలు: శ్రీరామకృష్ణ
పాటలు: వేటూరి
సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్, మణికండన్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
ఆర్ట్: సమీర్ చంద్ర

మణిరత్నం సినిమా అనగానే ఆత్రుతగా ఎదురుచూసే ప్రేక్షకుల ఆశలపై నీళ్ళు చల్లేసింది రావన్ సినిమా. అద్భుతమైన నటనా పటిమను ప్రదర్శించే విక్రమ్, అందాలరాశి ఐశ్వర్యా రాయ్ కాంబినేషన్, నంబర్ వన్ దర్శకుడు మణిరత్నం, సంగీత సామ్రాట్ రెహ్మాన్... ఇవేవీ రావణుడి వోటమిని ఆపలేకపోయాయి. తెలుగులో విలన్ గా విడుదలైన ఈ చిత్రం అభిమానుల తిరస్కారానికి గురయ్యింది. క్లారిటీ లేని కధనం, కధకు ఏమాత్రం బలం చేకూర్చలేకపోయిన మాటలు, ఎంతమాత్రం ఇంపుగా లేని సంగీతం... అన్నీ కలిసి సినిమాని చతికిలబదేలా  చేసాయి.
            అటవీ ప్రాంతాల్లో ఉండే సంఘ విద్రోహ శక్తి వీర (విక్రమ్‌). ఆ అటవీ ప్రాంతంలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతుంటాడు. పోలీసులను సజీవ దహనం చేయడం, ఎదురు తిరిగితే ఉప్పు పాతరెయ్యడం వంటివి చేస్తుంటాడు. (ఈ పాత్ర కాస్త వీరప్పన్ ను తలపోస్తుంది.) ఆ ప్రాంతానికి వచ్చిన సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ దేవ్‌ (పృథ్విరాజ్‌) వీరను చంపడమే లక్ష్యం గా పెట్టుకుంటాడు. పోలీస్‌ల కారణంగా వీర చెల్లెలి (ప్రియమణి) జీవితం నాశనం అవుతుంది. ఆ పగతో రగిలిపోతున్న వీర... దానికి ప్రతిగా దేవ్‌ భార్య రాగిణి (ఐశ్వర్య)ని కిడ్నాప్‌ చేసి తన స్థావరానికి తీసుకొస్తాడు. 14 రోజులు రాగిణిని బంధించి పోలీసులతో యుద్ధానికి దిగుతాడు. తర్వాత ఏం జరిగిందన్నది మిగతా కథ.
           రామాయణాన్ని ఆధునకరీస్తూ రావణుడిని హైలెట్ చేస్తూ వచ్చిన ఈ చిత్రంలో పాత్రల గాఢత అంతగా కనపడదు. దానికి కారణం పాత్రలను వాటి వాటి నేఫద్యాల్లో ఎస్టాబ్లిష్ చేయకపోవటమే. ఇంటర్వెల్ అయ్యేదాకా విక్రమ్ అస్సలు ఐశ్వర్య రాయ్ ని ఎందుకు కిడ్నాప్ చేసాడు...ఆమె ద్వారా అతను ఏం సాధిద్దామనుకున్నాడు...అతను ఏం నష్టపోయాడు..ఏం లాభం పొందుదామనుకున్నాడనేది స్పష్టం కాదు. సినిమాలో ఎంటర్‌టైనర్‌మెంట్‌ పూర్తిగా లోపించింది. పాత్రల్లో ఎమోషన్‌ శృతి మించింది. నటీనటుల నటనాకౌశలం చూపడం కోసమే సినిమా తీసినట్టుంది. సంభాషణలు చాలా చాలా  పేలవంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్: వీరయ్య పాత్రలో విక్రమ్ అద్భుతంగా రాణించాడు. అతని హావబావాలు అమితంగా ఆకట్టుకుంటాయి. ఐశ్వర్యారాయ్ తన పాత్రకు నూరు శాతం న్యాయం చేసింది. కాస్త డీ గ్లామరైజ్డ్ గా వున్న ఎంతో అందంగా కనిపించింది.  ఆమె అందం చిత్రానికి నిండుదన్నాన్నించింది. ప్రభు, కార్తీక్ కీలకమైన పాత్రల్లో బాగా చేశారు. ప్రియమణి కూడా తన వంతు మెప్పించింది. పృథ్విరాజ్ కూడా పరవాలేదనిపించాడు. ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ప్రాణం. అడవుల చిత్రీకరణ అద్భుతంగా వుంది. పచ్చని ప్రకృతిని తెచ్చి స్క్రీన్ మీద పరిచినట్టుగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో రీ రికార్డింగ్ కూడా చాలా బాగుంది.

మైనస్ పాయింట్స్: సినిమాకి అతి పెద్ద మైనస్ డైలాగ్స్. నటీనటుల పెదవుల కదలికకు, సంభాషణలకు సంబంధం వుండదు. దానితో అసలు ఏమి మాట్లాడుకుంటున్నారో అర్ధం కానీ పరిస్తితి. ఇది చాలా విసుగు తెప్పిస్తుంది. ఎక్కడా పంచ్ డైలాగులు కానీ, ప్రేక్షకులకు ఉత్సాహాన్ని కలిగించే మాటలు కానీ లేవు. ఏదో మాట్లాడుతున్నారులే అనుకోవాలి. పాటలు కూడా వినసొంపుగా లేవు. రెహ్మాన్ సంగీతం సినిమాకు ఏ విధంగానూ ఉపయోగపడలేదు. మొత్తంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంతా బోర్.  హీరోయిన్ తప్పించుకోవలనుకోవటం, విలన్ కి దొరికిపోవటం తప్ప ఏమి కధ వుండదు. సెకెండ్ హాఫ్ కాస్త పరవాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు. ప్రేక్షకుడిని మళ్ళీ మళ్ళీ థియేటర్ కి రాప్పించనూ లేదు. 

Thursday, June 10, 2010

రాతిని తొలిచి... రమ్యంగా మలిచి...

శిలను చెక్కి శిల్పాన్ని చేయటం పాత కళ. శిలను తొలిచి ఇంటిని చేయటం కొత్త కళ. ఈ కళలో టర్కీ వాళ్ళు సిద్ధహస్తులు. వాళ్ళు పెద్ద పెద్ద rallanu  సైతం అవలీలగా తొలిచేస్తున్నారు. వాటిలో నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. మనలాంటి వాళ్ళెవరికైనా ఆసక్తి కలిగి అక్కడికి వెల్తామేమోనని ఒక హోటల్ని కూడా కట్టారు. ఆ హోటల్ పేరు  'యునాక్ ఎల్వరీ హోటల్'.
         టర్కీలోని వుర్గప్ అనే ప్రాంతంలో ఈ హోటల్ వుంది. ఒక పెద్ద కొండను తవ్వి, ఈ విలాసవంతమైన హోటల్ కట్టారు. చక్కని బెడ్ రూములు, అటాచ్డ్ బాత్రూములు, రరకాల వంటలను రుచిగా అందించే రెస్టారెంట్, స్విమ్మింగ్ పూల్, గోడలకు ఖరీదయిన పెయింటింగులు... ఇలా అన్నీ హంగులతో అత్యాధునికంగా ఉంటుందా హోటల్. ఇందులో మొత్తం 30 గదులున్నాయి. వీటిలో కొన్ని మామూలు గదులు, కొన్ని డీలక్స్, మరికొన్ని సూట్స్. సింగిల్ రూముకి 85 యూరోలు (సుమారుగా 4745 రూపాయలు) , డబుల్ రూముకి 110 యూరోలు (సుమారుగా 6140 రూపాయలు), డీలక్స్ రూముకి 130 యూరోలు (సుమారుగా 7257 రూపాయలు), సూట్ కి 170 యూరోలు (సుమారుగా 9490 రూపాయలు) చెల్లించాల్సి వుంటుంది.
      ఆ మొత్తం పెద్ద ఖర్చు కాదనుకునేవారు హ్యాపీ గా వెళ్లి, ఎల్వరీ హోటల్లో చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు. ముఖ్యంగా ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి, హనీమూన్ కి వెళ్ళేవాళ్ళు రొటీన్ గా ఏ ఊటీనో, కొడైకేనాలో వెళ్ళకుండా టర్కీ వెళ్లి, ఎల్వరీ హోటల్లో హాయిగా స్పెండ్ చేయవచ్చు.  ఒక అద్భుతాని చూసినట్టూ వుంటుంది, ఒక మధురమైన అనుభూతిని సొంతం చేసుకున్నట్టూ వుంటుంది!
రాత్రిపూట హోటల్ అందాలు


విలాసవంతమైన పడక గది

డైనింగ్ హాల్

సాయంత్రంపూట ఇలా ఆరుబయట కూర్చుని కబుర్లాడుకుంటే ఆ ఆనందమే వేరు


Friday, June 4, 2010

గాన గంధర్వా... జోహార్లు!


గాన గంధర్వుడు, నా అభిమాన గాయకుడు బాలుకి జన్మదిన శుభాకాంక్షలు

పరవశిస్తుంది. ఆయన స్వరం కూర్చితే ఆ పాటలోని మాధుర్యం మనసులను పులకింప చేస్తుంది. నటుల హావభావాలకు అనుగుణంగా పాటలు పాడే విలక్షణత ఆయనకు మాత్రమే సొంతం. అందుకే ఆయన పాట పామరులను సయితం ఉర్రూతలూగించింది. 40 ఏళ్ళ సినీప్రస్తానంలో 11 భాషలలో, 40 వేలకు పైగా పాటలు పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి అరుదయిన రికార్డు సృష్టించారు బాలు. తెలుగు, తమిళం, కన్నడ బాషలలో కూడా ఆయన పాడిన పాటలకి జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా , నటుడిగా, సంగీత దర్శకుడిగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆయా విభాగాలలో 29 సార్లు నంది పురస్కారాన్ని అందుకున్న భాహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు.


                  ఒకటా రెండా... అయన గళం నుండి జాలువారిన అమృతపు చినుకులు ఎన్నని! ఆ అమృత జల్లుల్లో తడిసి ముద్దయిన అభిమాన హృదయాలు ఎన్నని! తెలుగు ప్రజానీకం ఏ పుణ్యం చేసుకుందో ఆ మధుర స్వరాన్ని విని తరించటానికి! తెలుగు సినిమా ఏమి అదృష్టం అదృష్టం చేసుకుందో... ఆ మహనీయుని తనలో ఇముడ్చుకోటానికి!



         బాలు పాడిన పాటల్లో నాకిష్టమైన పాటలను వెలికి తీయటమంటే, సాగర గర్భంలో ఆణిముత్యాన్ని వెతికే సాహసం చేయటమే. ఆకాశాన్ని జల్లెడ పట్టి చుక్కల్ని లెక్కపెట్టే ప్రయత్నం చేయతమంతా పిచ్చితనమే. అయినా నాకు నచ్చిన, నేను మరీ మరీ వినే కొన్ని పాటల్ని వుటంకించకుండా  ఉండలేను.  
* నెలరాజా పరుగిడకు (అమరగీతం)
* మధుమాస వేళలో (అందమె ఆనందం)
* సిరిమల్లె నీవే, ఎడారిలో కోయిల  (పంతులమ్మ)
* మల్లెలు పూచే (ఇంటింటి రామాయణం)
* చుట్టూ చెంగావి చీర (తూరుపు వెళ్ళే రైలు)
* కళకే కళ నీ అందమూ (అమావాస్య చంద్రుడు)
* కీరవాణి చిలకల కొలికిలో (అన్వేషణ)
* చక్కనైన ఓ చిరుగాలి (ప్రేమ సాగరం)
* విధాత తలపున (సిరివెన్నెల) 
* ఆవేసమంతా ఆలాపనేలే (ఆలాపన)
* రేగుతున్నదొక రాగం (డాన్స్ మాస్టర్)
* ప్రియతమా నా హృదయమా (ప్రేమ)
* మాటేరాని చిన్నదాని (ఓ పాపా లాలి)
* చెలీ రావా వరాలీవా (మౌనరాగం)
* ఓ పాపా లాలి (గీతాంజలి)
* కమ్మని ఈ ప్రమలేఖని (గుణ)
* పూ లతలే పూచెనమ్మా (హృదయం)
* సుమం ప్రతిసుమం సుమం (మహర్షి)
* ప్రియతమా ప్రియతమా (ప్రియతమా)
* పువ్వై పుట్టి పూజే చేసి (రాగమాలిక)
* తరలిరాద తనే వసంతం, చుట్టూ పక్కల చూడరా (రుద్రవీణ)
* నిను తలచి మైమరచా (విచిత్ర సోదరులు)
* కధగా కల్పనగా, యీలోకం అతి పచ్చన (వసంత కోకిల)
* పచ్చ పచ్చాని కల వేసే బంగారు వల (తూర్పు సింధూరం)
* ప్రేమ లేదనీ (అభినందన)
* నాగమల్లి తోటలలో ఈ వలపు పాటలలో (అనురాగ సంగమం)
 
             ఇక ఈ సాహసాన్ని కట్టి పెట్టటం మంచిదని నాకనిపిస్తోంది. ఆకాశాన్ని కొలవటం, సముద్రంలోని నీతిని తోడటం, సూర్యుని చేతితో తాకటం సాధ్యపడిన నాడు, బహుశా బాలు పాటల్లో నాకిష్టమైన వాటిని ఎంచటం కూడా సాధ్యపడుతుందేమో!

Thursday, June 3, 2010

సంగీత నిధి... ఇళయరాజా!

            స్వరాలను ఏరి కూర్చి రాగమాలికలను అల్లే స్వరాల రారాజు ఇళయరాజా పుట్టినరోజు జూన్ 2న.

నాకు తెలిసి పాటంటే ఇళయరాజా కట్టినది. మనసు పొరలను తడిమే ఆయన పాట వినని రోజు ఏదో వెలితి. నా జీవితంలో నాకున్న కోరిక ఒక్కటే... ఒకే ఒక్కసారి ఆ మహానుభావున్ని కళ్ళారా చూడాలని. ఒక్కసారయినా ఆ మహనీయుని కాళ్ళకు నమస్కరించాలని.
        సంగీత సాగరాన్ని మధించి, అమృతతుల్యమయిన పాటలను అందించిన మేధావి ఇళయరాజా, 1943వ సంవత్సరం జూన్ 2వ తేదీన తమిళనాడులో ఒక నిరు పేదకుటుంబంలో జన్మించారు.  మొదట్లో చెన్నైలో శుభకార్యాలకు, సభలకు సంగీత ప్రదర్శనలిచ్చే బృందంలో సభ్యునిగా సంగీత జీవితాన్ని ప్రారంభించారు ఇళయరాజా. సలీల్ చౌదరి వంటి సంగీత దర్శకుల దగ్గర గిటారిస్టుగా, కీ బోర్డు కళాకారుడిగా పని చేసారు. తర్వాత కన్నడ సంగీత దర్శకుడైన జి.కె.వెంకటేష్ దగ్గర సహాయకుడిగా చేరడంతో చలన చిత్ర పరిశ్రమతో అనుబంధం ప్రారంభమైంది. ఈ సంగీత దర్శకుని దగ్గరే దాదాపు 200 సినిమాలకు సహాయకుడిగా పని చేసారు. కొన్నాళ్ళకు పంజు అరుణాచలం అనే తమిళ నిర్మాత అన్నక్కలి అనే సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం ఇవ్వడంతో 1976 లో ఇళయరాజా పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా అవతరించాడు. 1976లో విడుదలైన జయప్రద నటించిన 'భద్రకాళి అనే తెలుగు చిత్రంలోని ‘చిన్ని చిన్ని కన్నయ్య’ అనే పాటకు సంగీతాన్ని అందించి మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు  సినీరంగ ప్రవేశం చేసారు. అయితే ఎన్టీఆర్‌ నటించిన 'యుగంధర్‌' మొదట విడుదలయింది. ఆ రోజునుంచి ఈరోజు వరకూ వెనుదిరిగి చూసుకోలేదయన. మూడు సార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్న ఘనత ఆయనది. ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారంతో పాటు పద్మభూషణ్ అవార్డును అందుకున్న విశిష్టత ఆయనది.
    సంగీతానికి కొత్త ఒరవడిని నేర్పాడాయన. స్వరాల జల్లుల్లో సర్వ మానవాళినీ తడిపి ముద్ద చేసాడాయన. ఆయన చేయని ప్రయోగం లేదు. ఆయన లేకపోతే సినిమా సంగీతమే లేదు. ఆయన ఒక స్వరసాగరం. సినీ సంగీత చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఓ స్వర్ణాక్షరం.
       సుమనోహర స్వరాలతో మదిమదినీ పులకింప చేసిన స్వరబ్రహ్మకు వందనం. రసరమ్యమైన రాగాలతో ప్రతి హృదినీ పరవశింప చేసిన సంగీత నిధికి అభివందనం.

ఇళయరాజా అంటే ఏమిటో తెలిపే అమావాస్య చంద్రుడులోని ఈ అద్భుతమైన పాట నా ఆల్ టైం ఫేవరేట్.

సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో(2)

మలయజ మారుత శీకరమో, మనసిజ రాగ వశీకరమో
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో


ఆనందాలే భోగాలైతే, హంసానంది రాగాలైతే
నవ వసంత గానాలేవో సాగేనులే, సురవీణ నాదాలెన్నో మొగేనులే
వేకువలో వెన్నెలలో చుక్కలు చూడని కన్నులలో
 మావుల కొమ్మల ఊగిన కోయిల వేణువు లూడిన గీతికలు
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో

అందాలన్నీ అందే వేళ, బంధాలన్నీ పొందే వేళ

కన్నుల్లో గంగా యమునా పొంగేనులే, కౌగిట్లో సంగమమేదో సాగేనులే
కోరికలే సారికలై ఆడిన పాడిన సందడిలో
మల్లెల తావుల పిల్లన గ్రోవులు పల్లవి పాడిన పందిరిలో
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో
          
      ఇంత టిపికల్ కంపోజిషన్ నా జీవితంలో నేనెప్పుడూ వినలేదు. హ్యాట్సాఫ్ టు ఇళయరాజా! నాకు తెలిసినవి, విన్న ప్రతిసారీ  మైమరచిపోయే కొన్ని పాటలు ఇవి...

* చెలీ రావా వరాలీవా (మౌనరాగం)
* ఆవేసమంతా ఆలాపనేలే, ప్రియతమా తమ సంగీతం (ఆలాపన)
* ఏవేవో కలలు కన్నాను (జ్వాల)
* రేగుతున్నదొక రాగం (డాన్స్ మాస్టర్)
* పాటగా నాలో పరువాలు పలికే (క్షత్రియుడు)
* మిడిసిపడే దీపాలివి (ఆస్తులు-అంతస్తులు)
* ఆగిపో ఆగిపో కాలమా ఆగిపో (ఆరాధన)
* మూగైనా హృదయమా (ఆత్మబంధువు)
* ఏమనినే మది పాడుదునో (మంత్రిగారి వియ్యంకుడు)
* రాసలీల వేళ రాయబారమేల (ఆదిత్య 369 )
* సుందరీ నువ్వే నేనంట (దళపతి)
* కురిసెను విరిజల్లులే  (ఘర్షణ)
* సంధ్యారాగపు సరిగమలో (ఇంద్రుడు చంద్రుడు)
* ఆకాశం మేఘాలు మూసే వేళల్లో (కోకిల)
* ఏ ఊహలోనో తేలానేమో (శివ 2006)
* పచ్చా పచ్చని కల వేసే బంగారు వల (తూర్పు సింధూరం)
* ఏనాడు విడిపోని ముడి వేసెనే (శ్రీ కనక మహాలక్ష్మి డాన్స్ ట్రూప్)

ఇలా చెప్పుకుంటూ పోతే ఆ మధుర గీతాల లిస్టుకు అంతు వుండదు. ఇళయరాజాపై నాకున్న అభిమానానికి కొలమానమూ వుండదు.

Monday, May 31, 2010

పెళ్లి కళ ... ఎక్కడెలా?


పెళ్ళంటే... అంటుంది హీరోయిన్.
పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడే ముళ్ళు, ఏడే అడుగులు, మొత్తం కలిసి నూరేళ్ళు అని చెబుతాడు హీరో.
ఇది మన దేశంలో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లి. మనం ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి మనకు దీని గురించి తెలుసు. కానీ ఇతర దేశాల్లో వివాహ సంప్రదాయం ఎలా వుంటుంది! పొద్దున్న ఆఫీసుకి వస్తుంటే ఒక ఫంక్షన్ హాల్ దగ్గర పెళ్లి సందడి కనిపించింది. అప్పుడు వచ్చింది ఆ ఆలోచన. ఆఫీసుకి రాగానే వెంటనే ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూసా. వివాహ సంప్రదాయాల గురించి భలే ఆసక్తికరమైన విషయాలు కనిపించాయి. అవే ఇవి.  

మెక్సికో: పెళ్ళిలో వధూవరుల మెడచుట్టూ తెల్లటి రిబ్బన్ కడతారు.  పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి 13 బంగారు వెండి నాణాలు ఇస్తాడు. వీటిని ప్రీస్ట్ ప్రార్ధనలు జరిపి, ఆశీర్వదించి మరీ వరుడి చేతికి ఇస్తాడు. వరుడు వాటిని తీసుకెళ్ళి వధువు చేతిలో పెడతాడు. ఆమె ఆనందంగా స్వీకరిస్తుంది. ఒకరిపై ఒకరు నమ్మకం, ప్రేమ పెంచుకోటానికి, ఒకరికి ఒకరు కట్టుబడి ఉండటానికి సూచనగా దీన్ని భావిస్తారట!

ఇటలీ: ఇక్కడి వివాహాల్లో ప్రధాన పాత్ర వహించేది ఆహారం. వివాహ కార్యక్రమం ముగిసిపోయినదనిపించుకుని వధూవరులకు బాదాం పప్పుతో చేసిన చాక్లెట్లు వున్న బ్యాగ్స్ ఇస్తారు. ప్రత్యేకంగా తయారుచేసే ఈ చాక్లెట్లను కాన్ఫెట్టి అంటారు. జీవితమంతా తీయగా, ఆనందంగా సాగిపోవాలని దీవిస్తూ వీటిని ఇస్తారట. పెళ్ళికి హాజరైన అతిథులకు కూడా వీటిని ఇస్తారు. వధువుకు ఎలాంటి ఆభరణాలూ వేయరు. వేస్తే అసుభమని అనుకుంటారు. అంతేకాదు, పెళ్లి ఆదివారం జరిగితే మంచిదని భావిస్తారు.

శ్రీలంక: ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బౌద్ధ వివాహాల గురించి. వీటిని చూడటానికి రెండు చాలవని అంటారు. చెక్కతో చేసిన ప్రత్యేకమైన వేదికపై పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఈ వేదికలను వాళ్ళు మగల్ పొరు అంటారు.

మొరాకో: ఇక్కడ వధువు మెహందీ పెట్టుకోవడం తప్పనిసరి. అంతేకాదు, కాళ్ళమీద చేతుల మీద టాటూలు వేస్తారు. ఇవి అందానికే కాదు, అదృష్టాన్ని తెచ్చిపెడతాయని వాళ్ళు నమ్ముతారు.

చైనా: ఎరుపు రంగు వస్త్రాలకు ప్రాధాన్యమిస్తారు. ఆ రంగు జీవితంలో ఆనందాన్ని, ప్రేమను నింపుతుందని వారి విశ్వాసం. వధువు కేశాలంకరణకు చాల ప్రాధాన్యముంది. భర్త, బిడ్డలతో మంచి సంసార జీవితాన్ని గడుపుతున్న స్త్రీతో మాత్రమే వధువుకు కేశాలంకరణ చేయిస్తారు. అలా చేయిస్తే పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి జీవితం సుఖప్రదంగా ఉంటుందని నమ్ముతారు.  అంతేకాదు, వధువు కేశాలు నాలుగుసార్లు దువ్వాలనే ఆచారం కూడా వుంది. పెళ్లి జరిగిన తర్వాత కొత్త జంట పరస్పరం కర్చీఫులు బహుమతిగా ఇచ్చుకుంటారు. ఆ కర్చీఫులు ఎరుపు రంగులో వుంటాయి. వాటి మీద బాతుల బొమ్మలుంటాయి. బాతులు ఒకసారి జంట కడితే జీవితాంతం కలిసే ఉంటాయట. అందుకని ఆ బొమ్మలు ఉన్నవాటినే ఇచ్చి పుచ్చుకుంటారు.

ఐర్లాండ్: ఇక్కడ వధువు ధరించే గౌన్ ను హార్స్ షూ షేపులో తయారు చేస్తారు. హార్స్ షూ అంటే యు ఆకారంలో వుండే ఒక టూల్. ఆ ఆకారంలో వుండే దుస్తులను ధరిస్తే అదృష్టం వరిస్తుందని వారి నమ్మకం. వధువు చేతిలో ఉంచే పూలగుత్తిలో ఒక హార్స్ షూను కూడా ఉంచుతారు.

బ్రెజిల్: ఇక్కడ ఒక వింత ఆచారం వుంది. వధువును కావాలనే ఆలస్యంగా తీసుకొస్తారు. వివాహ కార్యక్రమం మొదలు కాకముందు వరుడు ఆమెను వివాహ వస్త్రాలలో చూడకూడదనేది వారి ఉద్దేశం.

జర్మనీ: ఇద్దరికి వివాహం జరిపించాలని నిర్ణయించిన తర్వాత, పెళ్ళికి కొన్ని రోజుల ముందు ఒక తంతు వుంటుంది. ఇద్దరినీ కూర్చోబెట్టి వారి ముందు బంధువులు పింగాణీ పాత్రలను నేలకేసి కొడతారు. ఇలా వాటిని విరగ్గొట్టడం వల్ల నూతన దంపతులకు శుభం చేకూరుతుందని వాళ్ళు నమ్ముతారు.

తైవాన్: పెళ్లిరోజు ఉదయం వరుడు వధువు ఇంటికి వెళ్తాడు. ఆమె తల్లిదండ్రుల ముందు మోకాళ్ళ మీద కూర్చుని 'మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను' అని వొట్టు వేసి, ఆమెను తనతో పంపించమని అడుగుతాడు. వాళ్ళు దానికి అంగీకరిస్తారు. అప్పుడతడు వధువును తీసుకుని పెళ్లి జరిగే చోటికి వెళతాడు. ఆ తర్వాత వివాహ కార్యక్రమం జరుగుతుంది.

టర్కీ: ఇక్కడొక వింత ఆచారం వుంది. పెళ్ళికూతురి చెప్పుల మీద పెళ్లి కానీ ఆమె స్నేహితురాళ్ళు తమ పేర్లు రాస్తారు. పెళ్లి జరిగిన తర్వాత చెప్పులు తీసి చూస్తారు. వాటి మీద ఎవరి పేరైనా చెరిగిపోతే ఆ అమ్మాయికి త్వరలోనే పెళ్లైపోతుందని నమ్ముతారు. ఇలాంటిదే కొరియాలో కూడా ఒకటుంది. వధువు తన చేతిలోని పూలగిత్తిని వెనక్కు విసురుతుంది. దానిని పట్టుకున్న అమ్మాయికి వెంటనే పెళ్లైపోతుందని అక్కడివాళ్ల విశ్వాసం.

ఇరాన్: పెళ్లి ముందురోజు రాత్రి నలుగురు పెళ్ళికాని అమ్మాయిలు వధువు ఇంటికి వెళ్తారు. వధువును పీట మీద కూర్చోబెట్టి, ఆమె తల మీదుగా ఒక తెల్ల వస్త్రాన్ని పట్టుకుంటారు. ఒక అమ్మాయి తిరగలిలో పంచదార వేసి నూరటం మొదలెడుతుంది. ఇలా చేయటం వల్ల దుష్ట శక్తులు దూరంగా పోయి, ఆమె వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుందని వారి నమ్మకం. అయితే పంచదార నూరే అమ్మయిని ప్రత్యేకంగా ఎంపిక చేస్తారు.  సంప్రదాయాలను గౌరవిస్తూ, మర్యాదగా నడచుకునే అమ్మయితోనే ఆ పని చేయిస్తారు.
    
          ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల వెడ్డింగ్ ట్రెడిషన్స్ వున్నాయి. ఎవరి ఆచారాలు వారివి... ఎవరి నమ్మకాలు వారివి.

Tuesday, May 25, 2010

మూగవోయిన మధురవీణ


సెంచరీలు కొట్టే వయస్సు మాది అంటూ పాట రాసిన ఆ మహాకవి డెభ్భై నాలుగేళ్ళకే తనువు చాలించాడు. తెలుగు సినిమా సాహిత్యసీమలో పాటల పూదోట విరబూయించిన ఆ మహనీయుడు పరలోకానికి పయనమయ్యాడు. అశేష ప్రజానీకాన్నీ తన అక్షరాల గుభాలింపుతో ముగ్ధుల్ని చేసిన వేటూరి భువిని విడిచి దివికి చేరిపోయాడు. కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా పాటను మన జీవితాల్లో ఒక భాగాన్ని చేసిన కలం కదలికలు శాశ్వతంగా ఆగిపోయాయి.

      ఆ కలం అమ్మలా జోల పాడింది. ఆ కలం నాన్నలా నీతిని నేర్పింది. ఆ కలం కన్నీళ్ళ కళ్ళాపి చల్లింది. ఆ కలం నవ్వుల జల్లు కురిపించింది. ఆ కలం కలల కవాటాలు తెరిచింది. ఆ కలం విషాదానికి విడిదిగా మారింది. ఏ భావాన్ని పలికించినా, ఏ రాగానికి అక్షరాలతో సొబగులు అద్దినా ప్రతి పదంలోనూ వేటూరి శైలి కదం తొక్కుతుంది. ప్రతి మాటలోనూ భాషకు సైతం అందని భావమేదో దోబూచులాడుతుంది. తెలుగు సినిమా సాహిత్య లోకంలోకి పిల్ల తెమ్మెరలా వచ్చి ప్రభంజనమై పోయాడు. అలతి అలతి పదాలతో అభిమానుల హృదయాల్లో పీట వేసుకుని కూర్చున్నాడు. అలసిన మనసులకు తన మాటలతో సేద తీర్చాడు. గాయపడిన హృదయాలకు పదాలతో వైద్యం చేసాడు. మండిన గుండెలకు తన అక్షరాలతో ఆవేశాన్ని ఆజ్యంగా పోసాడు. కలాన్ని కత్తిలా దూసాడు... సాహితీప్రియుల హృదయ సామ్రాజ్యాల్ని గెలుచుకున్నాడు.

       వింత వింత పద ప్రయోగాలతో తెలుగు బాషకు కొత్త సొబగులను అద్దిన వీరుడు వేటూరి. తన మాత్రుబాషకు జాతీయ హోదా ఇవ్వలేదన్న కోపంతో జాతీయ అవార్డును తోసిపుచ్చిన ధీరుడు వేటూరి. ఆయన కలం పదునుకు అక్షరాల కుత్తుకలు తెగిపడతాయి. భారమైన భావాల మడుగులో పడి ఊపిరాడక విలవిలలడతాయి. అయినా ఆయన జాలి చూపలేదు. తన అక్షర అస్త్రాన్ని శ్రోతల హృదయాలకు గురిపెట్టక మానలేదు. భువనానికి వేణువై వచ్చానన్నాడు. గగనానికి గాలిని పోతానన్నాడు. మనసును తుల్లిపడకంటూ వారించాడు. అతిగా ఆశపడకు అంటూ హితవు పలికాడు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అంటూ నిలదీశాడు. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే అంటూ వేదాంతాన్ని కుమ్మరించాడు. పిల్లనగ్రోవికి నిలువెల్లా గాయలేనంటూ బాధ పడిపోయాడు. ప్రతిరోజూ నీకొక పాఠమే తెలుసుకుంటూ పద అంటూ జ్ఞానబోధ చేసాడు. ఆమనీ పాడవే అంటూ ప్రకృతిని పలకరించి పులకరించాడు. నీ కబళం పడతా... నిను పట్టుకుపోతా అంటూ భయపెట్టి పరుగులెత్తించాడు. ఆకు చాటు పిందేను తడిపి అల్లరి పెట్టాడు. కాటుకలంటుకున్న కౌగిలింత లెంత హాయి అంటూ కుర్రకారుకు గిలిగింతలు పెట్టాడు. నవరసాలనూ తనదైన శైలిలో వొలికించాడు. ప్రతి శ్రోత పెదవిపై తన పదాలను పలికించాడు.  

      అక్షరాలతో మాలికలల్లి కళామతల్లి కంఠాన్నిఅలంకరించిన వేటూరి కళ్ళు శాస్వతంగా మూతబడ్డాయి. ఆయన సృష్టించిన అద్భుత సాహితీ సౌరభాన్ని ఎన్నో ఏళ్ళుగా ఆస్వాదిస్తోన్న అభిమానుల మనోవీణా తంత్రులు తెగిపోయాయి. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాదీ వెన్నెలమ్మ అన్నాడాయన. అలాగే ఎందఱో రచయితలు వస్తారు కానీ వేటూరి మాత్రం రారు. ఎప్పటికీ రారు.
 

Friday, May 21, 2010

ఎలా జరిగిందబ్బా!

కొన్ని సంఘటనలు యాదృచ్చికంగా జరిగిపోతూ వుంటాయి. అమితాశ్చర్యాన్ని కలుగజేస్తాయి. అలా ఎలా జరిగిందబ్బా అని జుట్టు పీక్కునేలా చేస్తాయి. అలాంటి కొన్ని సంఘటనలు ఇవి...

* అది 1893 వ సంవత్సరం. హెన్రీ జిగ్లాండ్ అనే వ్యక్తి తన గాళ్ ఫ్రెండ్ కి ఏదో కారణంతో గుడ్ బై చెప్పేసాడు. అది ఆమె తట్టుకోలేకపోయింది. అతను లేని జీవితం వద్దనుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలియగానే ఆమె అన్న, హెన్రీ ఇంటికి వెళ్ళాడు. గన్ తీసి గార్డెన్ లో కుర్చుని వున్న హెన్రీని షూట్ చేసాడు. అయితే హెన్రీ త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ తుపాకీ గుండు తిన్నగా వెళ్లి ఒక చెట్టులోకి చొచ్చుకుపోయింది.

         అది 1913 వ సంవత్సరం. తన గార్డెన్లో వున్న కొన్ని చెట్లను నరికి పారేయాలనుకున్నాడు హెన్రీ. ఒక పెద్ద చెట్టును కూల్చటానికి డైనమైటును అమర్చాడు. అది పేలింది. అంతే... ఒక్కసారిగా పెద్దగా అరిచి కుప్ప కూలిపోయాడు హెన్రీ. కారణం... ఇరవయ్యేళ్ళ క్రితం తన ప్రేయసి అన్న పేల్చిన తూటా అదే చెట్టులో ఇరుక్కుంది. ఇప్పుడు అది బయటికి వచ్చి హెన్రీ గుండెల్లోకి దూసుకుపోయింది. దేవుడు ఆ తూటా మీద హెన్రీ పేరు రాసి పారేసాడు కాబోలు. అందుకే ఇరవయ్యేళ్ళ తర్వాత అయినా అది తన బాధ్యత తను నెరవేర్చింది.

* 1960, డిసెంబర్ 5 ... ఫ్రాన్సులోని డోవర్ జలసంధిలో ఒక ఓడ మునిగిపోయింది. అందరూ చనిపోయారు, ఒక వ్యక్తి తప్ప. అతని పేరు హ్యూ విలియమ్స్.
1767 , డిసెంబర్ 5 ... అదే జలసంధిలో మళ్లీ ఒక ఓడ మునిగిపోయింది. 127 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తప్ప. ఆ ఒక్కరి పేరు హ్యూ విలియమ్స్.
1820 , ఆగష్టు 8 ... థేమ్స్ నదిలో ఒక పడవ మునిగిపోయింది. ప్రాణాలతో మిగిలిన ఒకే ఒక వ్యక్తి హ్యూ విలియమ్స్.
1940 , జూలై 10 ... జర్మన్ సైన్యం ఒక బ్రిటిష్ నౌకను నాశనం చేసింది. ఒక వ్యక్తి, అతని మేనల్లుడు మాత్రమే మిగిలారు. అదేం విచిత్రమో... ఆ ఇద్దరి పేరూ హ్యూ విలియమ్సే.

* 1996 ... ప్యారిస్...
అర్ధరాత్రి పోలీసులకు యాక్సిడెంట్ అయ్యిందని ఒక ఫోన్ వచ్చింది. పోలీసులు వెంటనే ఆ ప్రదేశానికి వెళ్లారు. రెండు కార్లు గుద్దుకుని తుక్కుతుక్కు అయిపోయాయి. డ్రైవ్ చేస్తున్న ఇద్దరూ చనిపోయారు. వారిలో ఒకరు ఆడ, ఒకరు మగ. ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళిద్దరూ భార్యాభర్తలని తేలింది. అంతకన్నా విచిత్రమయిన విషయం ఏమిటంటే, అప్పటికి ఎన్నో నెలల క్రితమే వాళ్ళిద్దరూ విడిపోయారట. అంతే ఇప్పుడు ఒకరికి తెలియకుండానే ఒకరు బయటకు వచ్చారు. ఒకరి కారును ఒకరు గుద్దుకుని చనిపోయారు. ఈ విషయం అర్ధమవగానే పోలీసులు చాలా ఆశ్చర్యపోయారట.
      పాపం... కలసి జీవించలేదు కానీ కలసి జీవితాన్ని చాలించారు కదూ!

* 1990 ... నార్త్ వేల్స్
పదిహేనేళ్ళ పిల్లాడు పదో తరగతి పరీక్ష రాయటానికి కూర్చున్నాడు.
ఆ పిల్లాడి పేరు... జేమ్స్ బాండ్.
అతని రోల్ నంబర్... 007

* ఈ సంఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది.
ఒక సభలో ప్రసంగించటానికి ఒక ప్రముఖ వ్యాపారవేత్త వచ్చాడు. అతని పేరు డేనీ డే. ఆరోజు అతను 'చావు ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి మనమే జాగ్రత్తగా వుండాలి' అనే టాపిక్ మీద అనర్గళంగా మాట్లాడాడు.
స్పీచ్ ముగిసింది. మాట్లాడి అలసిపోయిన డేనీ ఒక పెప్పర్ మింట్ తీసుకుని నోట్లో వేసుకున్నాడు. అది కంఠానికి అడ్డుపడి అక్కడికక్కడే చనిపోయాడు.

     చరిత్రను తవ్వడం మొదలు పెడితే ఇలాంటి విచిత్రాలు, నమ్మలేని నిజాలు ఎన్నో బయట పడతాయి. ఇంటర్నెట్ సాగరాన్ని మదిస్తున్నపుడు నాకు తెలిసిన, నన్నెంతో ఆశ్చర్యపరిచిన కొన్ని విషయాలివి.  

Thursday, May 20, 2010

బాబోయ్...ఇదేం క్యాండీ!


ఇదేమిటి... పొరపాటున క్యాండీ చేసేటప్పుడు తేలు అందులో ఉండిపోయింది అనుకుంటారు చూసినవాళ్లు. కానీ అది పొరపాటేమీ కాదు. కావాలనే అలా తేలుతో క్యాండీ చేసారు.



చైనాలో రకరకాల జంతువులను, పురుగులను తింటారని మనకు తెలుసు. అయితే అదంతా ఆరోగ్య పరిరక్షణలో భాగమని చాలామందికి తెలియదు. ఇప్పుడు వాళ్ళు తేళ్ళు తినటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దానికి కారణం కూడా వాళ్ళు చెబుతున్నారు. తేళ్ళలో ఆరోగ్యానికి పనికి వచ్చే అంశాలు  చాలా వున్నాయట. కొన్ని రకాల కాన్సర్లను నివారించటంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయతాయని అంటున్నారు. దానికోసం తేళ్ళను ప్రత్యేకంగా పెంచుతున్నారు. రకరకాలుగా తేళ్ళు తమ ఆహారంలో ఉండేలా చూసుకుంటున్నారు. ఆ క్రమంలో వచ్చినవే ఈ క్యాండీలు. వీటికి అక్కడ భలే గిరాకీ వుందట. ఈ క్యాండీలు తింటే దంతాలకు కూడా మంచిదట. అందుకే జనం ఎగబడి కొంటున్నారు. లొట్టలేసుకుంటూ క్యాండీలు స్వాహా చేసేస్తున్నారు. ఆరోగ్యానికి మంచిదయితే అయ్యింది కానీ మరీ తేళ్ళు తినటమంటే... అమ్మో... నావల్ల కాదు బాబూ!



Monday, May 17, 2010

నేను స్త్రీవాదిని కాను


ఆడదే ఆధారం, మన కధ ఆడనే ఆరంభం అంటూ పాటలు కట్టారు. వాటిని విని ఆనందించమన్నారు కానీ మనసులో నిలుపుకొమ్మని ఎవరూ చెప్పలేదా? ఆడవాళ్ళు పూజింపబడే చోట దేవతలు కొలువై ఉంటారని మాట వరుసకే అన్నారా? ఆ మాటలను దృష్టిలో ఉంచుకుని ఆడవాళ్ళను పూజించాల్సిన అవసరం లేదా? పోనీ పూజించాల్సిన అవసరం లేదు... కనీసం గౌరవిస్తే చాలు కదా! ఆ కాస్త గౌరవం కూడా దక్కటం లేదే ఆడదానికి! ముఖ్యంగా మన దేశంలో.
ఆడదానికి వేదాలలో చోటు దక్కింది కానీ మగాడి మనసులో దక్కటం లేదే. ఆడది మహామహులకు జన్మనిచ్చింది కానీ ఎన్ని జన్మలెత్తినా కనీసం మనిషిగానయినా మర్యాదను అందుకోవటం లేదే! స్త్రీ మగాడితో సమానంగా పదవులను అలంకరిస్తోంది, స్త్రీ అంతరిక్షంలో అడుగుపెట్టింది, స్త్రీ అన్నిటా ముందడుగు వేస్తోంది, నిజంగా మగాడు సహకరించకపోతే ఇవన్నీ సాధించగలిగేదా... ఈమధ్య ఒక మగ మహారాజు అన్న మాటలివి. అసలు ఆడది ఎదగటానికి మగాడి అనుమతి ఎందుకు కావాలట అన్నాను నేను. అంటే... అంతా మీ ఇష్టమేనా అన్నాడతను కినుకగా. నాకు నవ్వొచ్చింది. తండ్రిగా వున్నపుడు మగాడు బాగుంటున్నాడు. కూతురిని కొడుకులతో సమానంగా చదివిస్తున్నాడు. అన్నగా వున్నపుడు మగాడు బాగుంటున్నాడు. చెల్లెలికి అన్నిటా తోడుగా ఉంటున్నాడు. మగాడు స్నేహితునిగా వున్నపుడు బాగానే ఉంటున్నాడు. తన నేస్తం మీద ఎలాంటి నీలి నీడలూ పడకుండా కాపాడుకుంటున్నాడు. కానీ మగాడు భర్త స్థానంలోకి రాగానే ఎందుకు మారిపోతున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం నాకు తెలిసి ఏ మగాడూ చెప్పలేదు. దీనికి సమాధానం స్త్రీ దగ్గర మాత్రమే దొరుకుతుంది.
ఒక ఆడపిల్ల విషయంలో తండ్రి, అన్న, స్నేహితుడు తమకు బాధ్యత ఉందనుకుంటారు. కేవలం భర్త మాత్రమే ఆమెపై తనకు హక్కు వుందనుకుంటాడు. ఆమె తన సొత్తు అనుకుంటాడు. జీవితమంతా ఆమె తన దగ్గర వుండి తీరాలనుకుంటాడు. తను లేకపోతే ఆమెకు మనుగడ లేదనుకుంటాడు. తను కాదంటే ఆమెకు జీవితమే లేదనుకుంటాడు. తను మాత్రమే ఆమె ప్రపంచమనుకుంటాడు. ప్రపంచంలో తను తప్ప ఆమెకు మరే దిక్కూ లేదనుకుంటాడు. ఆమె ప్రపంచాన్ని తన కళ్ళతోనే చూడాలనుకుంటాడు. అక్కడే సమస్యంతా.
భార్య తనకు నచ్చిన కూర వండాలి. తనకు నచ్చిన చీర కట్టాలి. తనకు నచ్చినట్టు జడ వేయాలి. తనకు నచ్చిన వారితో మాట్లాడాలి. తనకు నచ్చితేనే వుద్యోగం చేయాలి. నా, నేను, నాకు... ఈ మూడు మాటలు మగాడే ఎందుకు ఎక్కువ వాడతాడు? ఆడది ఆ మాటలు వాడితే ఎందుకు ఆవేసపడతాడు? ఆడది అనుకునేముందు తను కూడా మనిషే అని ఒక్కసారి అనుకోవచ్చు కదా! నాకు ఇది ఇష్టం అని చెప్పినపుడు నీకేమి ఇష్టం అని అడగవచ్చు కదా! నువ్వు నాకు నచ్చినట్టు వుండు అని ఆజ్ఞలు జారీ చేసేటప్పుడు, ఆమెకు నచ్చినట్టు ఉండటానికి కాస్తయినా ప్రయత్నించవచ్చు కదా! ఇవన్నీ వాళ్లకు ఎలా అర్ధమవుతాయి?
భార్య శరీరంతో పాటు మనసును కూడా తడిమే ప్రయత్నం మగవాడు చేయడే? ఒక్కసారి ఆ ప్రయత్నం చేస్తే ఆడది జీవితమంతా అతని చేయి విడువదని వాళ్లకు ఎలా అర్ధమవుతుంది! బతుకంతా నీ మనసు తెలుసుకుని నడచుకుంటానని బాస చేస్తే, బానిసగానైనా బతికేంతగా ప్రేమించేస్తుందని ఎలా చెబితే తెలుస్తుంది! ఇష్టాలను గౌరవించకపోయినా, కనీసం కించపరచకుండా వుంటే... తన ఇష్టాలను సయితం మర్చిపోయి అతని ఇష్టాలు తీర్చటమే పరమావధిగా జీవిస్తుందని ఎలా అవగతమవుతుంది!
పిడికెడంత ప్రేమను పంచి పెడితే... మగాడిగా అతనిని గెలిపించటం కోసం ఆడదానిగా తను ఆనదంగా ఓడిపోతుందని ఎప్పుడు అర్ధమవుతుంది!
చిరునవ్వుతో చిన్న పలకరింపు... ఆప్యాయత నిండిన మెత్తని స్పర్శ... కన్నీరు చిందిన వెల అక్కున చేర్చుకునే అనురాగం... అలసిన వేళ ఆర్తిగా దగ్గరకు తీసుకునే చేతులు... ప్రపంచంలో దేనిని గుర్తు రానివ్వకుండా చేసే వేచని కౌగిలి... కోరుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఆమెతో పాటు నడిచే పాదాలు... ఆమె విజయం సాధించినప్పుడు గర్వంగా విచ్చుకునే పెదవులు... భార్యగా తనకు బాసటగా నిలిచిన ఆమె, వ్యక్తిగా కూడా ఎదిగితే చూడాలని తపించే కళ్ళు... ఇవన్నీ వున్న మగాడు ఈ భూమి మీద వున్నాడా? వుంటే అతనికి స్త్రీగా పాదాభివందనం చేస్తాను.
నా మాటలు చదివితే మగాళ్ళకు కోపం రావచ్చు. కానీ నా మాటల మాటున దాగి వున్న ఆవేదనను చదివే ప్రయత్నం చేస్తే కోపం రాదు. ఆడది ఎన్ని సాధించినా మగాడి దగ్గర బలహీనపడుతోంది. దానికి కారణం ప్రేమ. ప్రేమ కోసం స్త్రీ పురుషుడిని ఆశ్రయిస్తుంది. తను కోరుకున్న ప్రేమ అతని దగ్గర దొరుకుతుందన్న నమ్మకంతో తన నిండు జీవితాన్ని అతని చేతుల్లో పెడుతోంది. దానిని అర్ధం చేసుకుని ఆమెను అక్కున చేర్చుకునే మగవాళ్ళు వున్నారో లేదో తెలియదు కానీ, అహంకారంతో పువ్వులాంటి ఆమె మనసును నలిపి పారేస్తున్న మగవాళ్ళు చాలామందే వున్నారు. ఇప్పటికీ ఎంతోమంది స్త్రీలు అలాంటివారి చేతుల్లో వంచనకు గురవుతూనే వున్నారు. గుండెల్లో పొంగుతున్న ఆవేదన కళ్ళనుండి బయటకు దూకకుండా, కనురెప్పల ఆనకట్ట వేసి బంధించాలని ప్రయత్నిస్తూ, భారంగా బతుకీడుస్తున్నారు. వాళ్లకు ఆ పరిస్తితి తెచ్చిన మగాళ్ళ మీద మాత్రమే నా కోపం. అంతే తప్ప నేను పురుష ద్వేషిని కాను. స్త్రీవాదిని అంతకన్నా కాదు. 

Saturday, May 15, 2010

కాదేదీ కళకు అనర్హం



ఈ ఆకృతులను చూస్తే అబ్బ ఎంత బాగున్నాయో అనిపిస్తుంది. కానీ వీటిని  ఎలా చేసారో తెలిస్తే మాత్రం ఆశ్చర్యంతో గొంతు మూగబోతుంది. కాదేదీ కవితకు అనర్హం అని శ్రీశ్రీ అంటే, కాదేదీ కళకు అనర్హం అంటాడు ఫ్రాంకోయిస్ రాబర్ట్. అందుకే ఏకంగా మనిషి ఎముకలతోనే ఇలా కళారూపాలను తయారుచేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు ఈ ఫోటోగ్రాఫర్.
          1990 లో ఒక స్కూలువారు తమ పాత ఫర్నిచర్నిఅమ్మకానికి పెట్టారు. తను ఏమయినా కొనుక్కోవాలని అక్కడకు వెళ్ళాడు రాబర్ట్. మూడు బీరువాలు కొన్నాడు. అయితే వాటిని తెరిచినపుడు షాక్ తిన్నాడు. మొదటి రెండూ ఖాళీగానే వున్నాయి కానీ మూడో బీరువాలో ఒక మానవ అస్థిపంజరం వుంది. అతడు దాన్ని తన స్టూడియోకి తీసుకెళ్ళాడు. కానీ దానితో ఏమి చేయాలో అతనికి అర్ధం కాలేదు. దాంతో అది 2007 వరకు అతని దగ్గరే ఉండిపోయింది. నిజానికి రాబర్ట్ కి మానవ అవశేషాలు అంటే ఎంతో ఆసక్తి. ఎంతో కాలంగా పుర్రెలు, ఎముకలు సేకరిస్తున్నాడు కూడా. ఒకసారి అతను ఒక ప్రాజెక్టులో భాగంగా దాదాపు అయిదు వారల పాటు మానవ అవశేషాల చిత్రాలు తీస్తూ గడిపాడు. తర్వాత అతనికి తీరిక సమయం చిక్కింది. ఏమి చేయల అని ఆలోచనలో పడ్డాడు. అప్పుడే అతనికి తన దగ్గరున్న అస్తిపంజరం గుర్తొచ్చింది. దానితో కూడా ఏమైనా చేయాలనిపించింది. అప్పట్నుంచి దానితో ఏదైనా చేయాలని గంటలు గంటలు శ్రమించాడు. ఎముకలను విడదీసి వాటిని రకరకాలుగా అమర్చసాగాడు. అతని ఆలోచనలు క్రమంగా ఒక రూపాన్ని సంతరించుకోసాగాయి. అవి ఇలా అద్భుతమయిన ఆకృతులుగా రూపం దాల్చాయి. వాటికి ఒక సార్ధకత కల్పించాలనుకున్నాడు.  హింసను వ్యతిరేకించే దిశగా అడుగులు వేసాడు. విజయం సాధించాడు. మానవ అవశేషాలతో ఇంట చక్కని ఆకృతులను చేసి, వాటి ద్వారా 'స్టాప్ వయోలెన్స్' అంటూ ఒక మంచి సందేశాన్ని ఇస్తున్న రాబర్ట్ ని ప్రసంసించకుండా ఉండగలమా? హాట్సాఫ్ రాబర్ట్!

Thursday, May 13, 2010

నీకోసం

హ్యాట్సాఫ్ స్టీవీ!

మే 13.

చరిత్రలో ఈరోజు ఎన్నో విచిత్రాలు జరిగి వుంటాయి. వింతలు చోటు చేసుకుని వుంటాయి. అద్భుతాలూ సంభవించి వుంటాయి. అవన్నీ నాకు తెలియదు కాని, 1950 లో మాత్రం ఒక అద్భుతం జరిగింది. 1950, మే 13న మిచిగాన్లో ఒక పసివాడు ప్రాణం పోసుకున్నాడు. ముద్దులొలికే ఆ చిన్నారిని అతని తల్లి తనివి తీరా చూసుకుని మురిసిపోయింది. అయితే ఆనాడు ఆ తల్లికి కూడా తెలీదు, ఒకనాడు ఈ ప్రపంచం మొత్తం తన బిడ్డను కళ్ళు విప్పార్చి చూస్తుందని. ఆ తల్లి పేరు ల్యూలా. ఆ పసివాడి పేరు స్టీవీ హార్డవే జడ్కిన్స్.

పుట్టుకే విషాదం...

కాల్విన్ జడ్కిన్స్, ల్యూలా మే హార్డవే దంపతులకు ఆరుగురు సంతానం. అందులో మూడోవాడు స్టీవీ. అందరిలా కాకుండా మూడు వారాలు ముందుగానే పుట్టటంతో అతని రూపం పూర్తిగా రూపుదిద్దుకోలేదు. ముఖ్యంగా కాళ్ళ వెనుక భాగంలో ఉండే రక్తనాళాలు సరిగ్గా వృద్ధి చెందలేదు. దాంతో అతనికి కనుచూపు కరువయ్యింది. కానీ అంధత్వం అతని కనులకే కానీ మనసుకు కాదు. అందుకే మనసుతో ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టాడు. తనకెంతో ఇష్టమైన కళకోసం కళ్ళు లేవన్న విషయాన్నివిస్మరించాడు.

స్వరమే వరమై...

చూపు ఇవ్వక దేవుడు అన్యాయం చేసినా... అద్భుతమైన స్వరాన్ని వరంగా ఇచ్చాడు. దానితోనే స్టీవీ యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. చిన్ననాటి నుంచీ చర్చికి సంబంధించిన సంగీత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. పియానో, హార్మోనియం, జాజ్ తదితర సంగీత వాయిద్యాలను అలవోకగా వాయించేవాడు. అందరి ప్రశంసలనూ పొందేవాడు. అలా అతని ప్రతిభ మోటౌన్ రికార్డింగ్ కంపెనీకి చేరింది.
ఒక్కసారి అతని పాట వినగానే ఆ కంపెనీ సి.ఇ.ఒ. బెర్రీ గోర్డీ... "ఇతనిని ప్రపంచపు ఎనిమిదో వింత అని అనకుండా ఉండలేకపోతున్నాను" అన్నాడంటే, స్టీవీ ప్రతిభ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. పదమూడేళ్ల ప్రాయంలో 'ఫింగర్ టిప్స్' మ్యూజిక్ ఆల్బం... అందులో పాడటంతో పాటు పలు సంగీత పరికరాలను వాయించిన ప్రతిభాశాలిగా స్టీవీ ఒక్కసారిగా సెలెబ్రిటీ అయిపోయాడు. అందరి దృష్టీ అతనిమీద. ఏ నోట విన్నా అతని ప్రతిభే. మజిల్ బీచ్ పార్టీ, బికినీ బీచ్ ఆల్బం చేశాక అతను వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు.

అవార్డులకు కేరాఫ్ అడ్రస్...

అవార్డుల కోసం స్టీవీ ఆశపడడు. కానీ అవార్డులు అతన్ని వెతుక్కుంటూ వస్తాయి. ముప్ఫై కంటే ఎక్కువ టాప్ టెన్ హిట్స్ చేసిన రికార్డు అతనిది. చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా 22 గ్రామీ అవార్డులను సొంతం చేసుకున్న ఘనత అతనిది. లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు, అకాడమీ అవార్డు, పోలార్ మ్యూజిక్ అవార్డు, మాంట్రియల్ జాజ్ ఫెస్టివల్ స్పిరిట్ అవార్డు... ఇలా చెప్పుకుంటూ పోతే అతని ప్రతిభకు గీటురాళ్ళు ఎన్నో.
మనిషిగా పుట్టినందుకు ఏదైనా సాధించాలి. మన పేరు పదిమంది చెప్పుకునేలా బతకాలి. స్టీవీని చూస్తే అది నిజమనిపిస్తుంది. వైకల్యం అతనికి విజయాన్ని దూరం చేయలేదు. కంటిచూపు లేదే అని అతను కుంగిపోతూ కూర్చోలేదు. కళకు ప్రాణం పోయాలని కలలు కన్నాడు. ఆ కలను నిజం చేసుకోటానికి అనుక్షణం శ్రమించాడు. అనుకున్నది సాధించాడు. ఆశించిన తీరాలను అందుకున్నాడు. అందుకే స్టీవీ అంటే చాలా ఇష్టం. సింగర్ గా కాదు... ఒక వ్యక్తిగా, ఒక ధీశాలిగా, ఒక ఆదర్శప్రాయుడిగా.
స్టీవీ ఒక అద్భుతం. అన్ని సదుపాయాలు ఉన్నా ఎలాంటి లక్ష్యాలూ లేకుండా సమయాన్ని వృధా చేసే సోమరులకు అతని జీవితం ఓ గుణపాఠం.
తన సంగీత తరంగాలపై యావత్ ప్రపంచాన్నీ ఓలలాడించిన స్టీవీకు జన్మదిన శుభాకాంక్షలు.

Tuesday, May 11, 2010

ఆమ్మా... నీకేమి ఇవ్వగలను?

ఈ ప్రపంచంలో వేల కట్టలేనిది ఏదయినా వుంటే అది అమ్మ ప్రేమే.
ఇంతవరకూ కల్తీ కానిది ఏదయినా వుంటే అది అమ్మ ప్రేమే.
దేనికీ అమ్ముడు పోనిది ఏదయినా వుంటే అది అమ్మ ప్రేమే.
దేని కోసమూ మనకు దూరం కానిది అమ్మ ప్రేమే. 
అమ్మంటే ప్రేమకు ప్రతిరూపం. అమ్మంటే ఆప్యాయతకు మరో రూపం. 

ప్రతిఫలం కోరనిది... ప్రతిక్షణం పరితపించేది
అనురాగం పంచేది... అనుక్షణం ఆరాటపడేది
అమ్మ మాత్రమే.
అందుకేనేమో... అవతార పురుషుడైనా అమ్మ పేగు తెంచుకునే పుడతాడు...
అమ్మ ప్రేమ పంచుకునే అంతవాడు అవుతాడు అన్నాడో మహాకవి.

 నిజమే కదా!
అమ్మ కడుపులో తొమ్మిది నెలల పాటు ఊపిరి పోసుకుంటాం.
అమ్మ ఒడిలో పసితనమంతా సేద తీరుతాం.
అమ్మ గుండెల్లో బతుకంతా తల దాచుకుంటాం.
అమ్మ నేర్పిన మొదటి అడుగును ఆసరాగా చేసుకుని ఎంతటి ఎత్తుకయినా ఎదుగుతాం.
అమ్మ తెలిపిన జ్ఞానాన్ని అనుసరించి ఎంతటి ఘన కీర్తినయినా గర్వంగా మూట కట్టుకుంటాం.
తినటం నేర్పింది అమ్మ. తెలివిగా బతకటం నేర్పింది అమ్మ.
అడుగేయటం నేర్పింది అమ్మ. అడుగడుగునా అండగా నిలిచేది అమ్మ.
అమ్మ లేని ప్రపంచం లేదు. అమ్మ లేకుండా ప్రపంచంలో మన మనుగడ సాగదు.

అమ్మ గురించి మాట్లాడినప్పుడల్లా నాకో కధ గుర్తొస్తుంది.

ఒక పిల్లాడు రాత్రి పడుకోబోయేముందు తన తల్లి దగ్గరకు వచ్చి ఒక కాగితాన్ని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. అందులో ఇలా రాసి వుంది.
గడ్డి కోసినందుకు... 5 /-
ఇల్లు క్లీన్ చేసినందుకు... 10 /-
కిరాణా సామాను తెచినందుకు... 10 /-
చెత్త పారబోసినందుకు... 5 /-
చెల్లిని ఆడించినందుకు... 5 /-
మొత్తంగా నువ్వు నాకు బాకీ వున్నది... 35 /-

తర్వాత రోజు ఉదయం లేవగానే తల్లి తన కొడుకు చేతిలో ఒక కాగితాన్ని పెట్టింది. అందులో ఇలా వుంది.

నిన్ను తొమ్మిది నెలలు మోసినందుకు... వెల లేదు
నీకు జన్మనిచినందుకు... వెల లేదు
నీకు అన్నం తినిపించినందుకు... వెల లేదు
నువ్వు మరుగుకు వెళ్తే శుభ్రం చేసినందుకు... వెల లేదు
నీకు బట్టలు, చాక్లెట్లు, బొమ్మలు కొనిచినందుకు... వెల లేదు
నువ్వు జబ్బు పడితే సేవ చేసినందుకు... వెల లేదు

మొత్తంగా నువ్వు నాకు చెల్లించాల్సింది ఏమీ లేదు.

ఇది చదివేసరికి ఆ పిల్లాడి కళ్ళలో నీళ్ళు నిండిపోయాయి. ఏడుస్తూ వెళ్లి తల్లి కాళ్ళ మీద పడి ఇలా అన్నాడు...
"నువ్వు నాకేమి ఇవ్వక్కర్లేదమ్మా. నేనే నీకు బాకీ పడ్డాను. చాలా చాలా బాకీ పడ్డాను"

ఈ కధ గుర్తొస్తే నా మనసు భారమై పోతుంది. నిజమే కదా! ఏమి ఇచ్చి తల్లి ఋణం తీర్చుకోగలం!
  జన్మనిచ్చి, సేవచేసి, బుద్ధులు నేర్పి, ఇంతవాళ్ళను చేసిన అమ్మకు ఏమి ఇవ్వగలం?

ఇవ్వగలం. చాలా ఇవ్వగలం.

ఆమె ముసలిది అయిపోయి ఆశ్రయం కోరి వచ్చినపుడు మన ఇంట్లో తన కోసం ఒక గదిని కేటాయించలేమా?
ఆకలిగా వుందని అని ఆమె నోరు తెరచి అడిగేలోపే పట్టెడు ముద్దను ఆమెకు పెట్టలేమా?
కళ్ళజోడు పాతదై పోయిందని చెప్పేలోపే కొత్త కళ్ళజోడును కొనివ్వలేమా?
ముసలిదానికి ముచ్చటలు ఎందుకని ముతక చీర ముఖాన కొట్టకుండా... తనకు నచ్చిన రండు చీర తెచ్చి ఇవ్వలేమా?
పళ్ళు లేనిదానికి పసందులేమిట్లే అని సనుక్కోకుండా... ఆమెకెంతో ఇష్టమైన పాయసాన్ని చేసి తినిపించలేమా?
తనకు నచ్చిన భక్తి చానల్ చూస్తున్నపుడు క్రికెట్ కోసమో, చిరంజీవి సినిమా కోసమో చానల్ మార్చకుండా వుండలేమా?
సమయం లేదని వంకలు చెప్పకుండా, బిజీ అంటూ బడాయిలు పోకుండా రోజూ పడి నిముషాలు ఆమెతో కబుర్లు చెప్పలేమా?

చేయగలం. ఇవన్ని తనకోసం మనం చేయగలం. ఇంతకుమించి ఏవేవో చేయాలని తను మనలను కోరదు కూడా. ఒకవేళ కోరితే వాటిని తీర్చటం కోసం తన బిడ్డ ఎంత కష్టపడి పోతాడోనని ఆ మాతృ హృదయం ముందుగానే బెంగపడిపోతుంది. అందుకే అంతకు మించి ఏదీ ఆశించదు.

మనకోసం బతికినా అమ్మకి, మనం తప్ప వేరే ప్రపంచమే లేదనుకునే పిచ్చి తల్లికి, మనకోసం ఎన్నో కష్టనష్టాలకోర్చిన మాతృమూర్తికి మనం చేయగలిగింది కూడా చేయలేకపోతే మన జన్మ వృధా! అందుకే మాత్రుదినోత్సవాలు చేసుకోవటం కాదు, అమ్మ మనసు తెలుసుకుని నడచుకోవటం అలవాటు చేసుకోవాలి. అమ్మ మనకోసం చేసిన త్యాగాలను మరువకుండా మననం చేసుకోవాలి.
దానికి ప్రతిగా మనమేమి తన కోసం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు.
మనకు జన్మనిచ్చిన ఆ తల్లి పేగు బాధతో మెలికలు పడకుండా చూసుకుంటే చాలు.
బయటకు వెళ్ళిన మనం ఇంటికొచ్చే వరకు కళ్ళలో వొత్తులు వేసుకుని చూసిన ఆమె కళ్ళలో కన్నీటి తడి చేరకుండా చూసుకుంటే చాలు.
మనకు అన్నీ అమర్చి పెట్టటం కోసం పరుగులిడి అలసిన ఆమె పాదాలు పట్టు తప్పుతుంటే, కింద పడకుండా ఆమెను పొదివి పట్టుకుంటే చాలు.

ఇవి చాలు... ఆ తల్లి మనసు మురిసిపోతుంది. మరు జన్మలో సైతం మనల్ని తన కడుపున మోయాలని కలలు కంటూ ప్రసాంతంగా కన్ను మూస్తుంది.

ఇంతకన్నా అమ్మకు మనం ఏమి చేయగలం?
ఇంతకుమించి ఆ ప్రేమమయికి ఏమి ఇవ్వగలం?





Friday, May 7, 2010

నేడు టాగూర్ జయంతి

Tuesday, May 4, 2010

మంచి సినిమా.. మంచిని తెలిపిన సినిమా..!

ఆ మధ్య సినిమా చూద్దామని వెళ్ళాను. షాక్ తిన్నాను. ఎందుకంటే చూడటానికి అక్కడ ఒక్క సినిమా కూడా లేదు. అన్నీ హిందీ, ఇంగ్లిష్ సినిమాలే. విసుగేసి వేరే చోటికి వెళ్ళాను. అక్కడా ఇదే పరిస్తితి. చాలా బాధ వేసింది. చూద్దామంటే సినిమా లేని దౌర్భాగ్యపు స్తితిలో తెలుగు ప్రేక్షకుడు వున్నందుకు సిగ్గు వేసింది. ఏమి చేయాలో అర్ధం కాక సీడీ షాప్ కి వెళ్ళి, రెండు సీడీలు కొనుక్కుని ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రెండు సీడీల్లో ఒకటి... గ్రహణం.
నిజంగా చాల గొప్ప సినిమా. మూఢ నమ్మకాలు మనిషిని ఎంతకు దిగాజార్చుతాయో, వాటి వల్ల అమాయకుల జీవితాలు ఎలా అస్తవ్యస్తమవుతాయో తెల్పుతూ ప్రముఖ రచయిత చలం రాసిన కథ 'దోషగుణం'. దాని ఆధారంగా ఈ సినిమా తీసారు. ఒక చిన్న కథని సినిమాగా తీయాలంటే ఎంతో కష్టం. మూల కథ చెడకుండా జాగ్రత్తగా చూపించాలి. లేకపోతే మూల కధ లోని అసలు భావం చెడిపోతుంది. అలా చెడకుండా సినిమా తీయాలంటే ఎంతో ఆలోచన, శ్రమ కావాలి. ఆ విషయంలో ఇంద్రగంటి మోహనకృష్ణ ప్రతిభని కొనియాడి తీరాలి.


ఇక కధలోకి వెళ్తే, ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న ఒక రోగి “తల్లినం”టూ వచ్చిన స్త్రీని దుర్భాషలాడి బయటకి పంపేయడం చూసిన ఓ డాక్టర్ ఆమెను అనుసరిస్తాడు. వివరాలు కనుక్కొందామని ఆరా తీసేసరికి ఆమె కంగారుగా వెళ్లిపోతుంది. వెంటనే ఆసుపత్రిలో ఉన్నవారిని ఆమె గురించి ఆరా తీస్తే కొద్దిపాటి సమాచారం తెలుస్తుంది. ఇంటికి వచ్చిన తన స్నేహితునితో ఓ కథ చెప్పటం మొదలెడతాడు. అతను పుట్టి పెరిగిన ఊర్లో నారాయణస్వామి అనే భూస్వామి ఉండేవాడు. అతని భార్య శారదాంబ అందగత్తె. అత్తగారినీ, భర్తనీ, ఆస్తిపాస్తుల్నీ జాగ్రత్తగా చూసుకుంటుంది. కటిక పేదకుటుంబానికి చెందిన కనకయ్య అనే అబ్బాయి వాళ్ళ ఇంట్లో వారాలకి కుదురుతాడు. తెలివైన ఆ కుర్రాడంటే భూస్వామికీ, అతడి భార్యకీ కూడా చాలా ఇష్టం! అయితే ఉన్నట్టుండి ఆ కుర్రాడు జబ్బు పడతాడు. ఊర్లో ఉన్న వైద్యునికి చూపిస్తారు. గుణం కనిపించకపోగా, జబ్బు ముదురుతుంది. తల్లిదండ్రులు కంగారుపడి ఒక మంత్రగాడికి చూపిస్తారు. “వచ్చింది మామూలు జ్వరం కాదు, దోషగుణం. తనకన్నా వయస్సులో పెద్దదైన స్త్రీతో కలవడం వల్ల ఈ జబ్బు వచ్చింది. ఆమె రక్తంతో చేసిన మందు కంటిలో పెడితే నయం అవుతుంది” అని చెప్తాడు. ఇది విన్న కుటుంబ సభ్యులు అవాక్కవుతారు. నిద్రలో కుర్రాడు శారదాంబ పేరు పలవరిస్తాడు.  పిల్లాడి జబ్బుకు కారణం ఆమేనని నిర్ధారణకు వస్తారు కనకయ్య కుటుంబ సభ్యులు. జబ్బు ముదురుతుంది. భూస్వామికి కూడా తన భార్య మీద అనుమానం కలుగుతుంది. దాంతో ఆమె మీద నింద మోపుతారు. నారయణస్వామి కూడా ఆ నిందను నమ్ముతాడు. తిరగబడిన భార్యను కొడతాడు. ఆమె రక్తం తీసి ఇస్తాడు. ఊహించని విధంగా పిల్లాడి జబ్బు నయమవుతుంది. దాంతో శారదంబ మీద వేసిన నింద నిజమవుతుంది. ఆమెను ఇంటినుంచి గెంటేస్తాడు భర్త. అప్పటి ఆ కనకయ్యే ఈ డాక్టర్. ఈ కధంతా చెప్పి ఆమె కోసం వెతుకుతాడు. కాని ఆమె మళ్ళీ కనిపించదు. అతడు ఆమె కోసం ఎదురు చూస్తున్నట్టుగా చూపించి సినిమా ముగించాడు డైరెక్టర్.


తనికెళ్ళ భరణి నటన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన తరహాలో నారాయణ స్వామి పాత్రను అద్భుతంగా పండించారు. ఇక శారదాంబ పాత్రలో జయలలిత నటన గురించి చెప్పుకోవాలి. వ్యాంప్ పాత్రలు వేసే ఆ జయలలితేనా ఈమె అనిపించింది. ఆ పాత్రలో అంతగా ఒదిగిపోయిందామె. కనకయ్య గా మోహనీష్ బాగా చేసాడు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేసారు.


చిన్న చిన్న సంభాషణలతో, చక్కని స్క్రీన్ణ్ ప్లేతో ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు. అక్కర్లేని సంభాషణలు, పనికిరాని దృశ్యాలు లేవు. ముఖ్యంగా ముగింపు అద్భుతం. ఊహించని విధంగా సినిమాను ముగించారు.  విజయ్ సంగీతం కూడా చాలా బాగుంది. పాటలు లేవు కాని సన్నివేశాలకు బలాన్ని చేకూర్చింది ఆయన సంగీతం.


ఒక్క మాటలో చెప్పాలంటే మూఢ నమ్మకాల చీకట్లో మగ్గిపోతున్న వారికి ఈ చిత్రం ఒక మంచి గుణపాఠం. చలం కధ నేను చదవలేదు కాని ఈ సినిమా చూసి చాలా వుద్విగ్నతకు లోనయ్యాను. ఒక చక్కని సందేశాన్ని ఆసక్తికరంగా అందించారు. సున్నితమయిన బంధాలను జాగ్రత్తగా కాపాడుకోకపోతే పరిస్తితులు ఎలా మారతాయో అందంగా చూపించారు. అదే ఈ సినిమాకు అవార్డులను తెచ్చి పెట్టింది. ఇలాంటి ఒక చక్కని సందేశాత్మక చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన మోహనకృష్ణ అభినందనీయుడు.


ఏదేమైనా చాలా కాలం తరువాత ఒక మంచి సినిమాను చూసే భాగ్యాన్ని కలిగించిన గ్రహణం యూనిట్ కు మనస్పూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నా!