మే 13.
చరిత్రలో ఈరోజు ఎన్నో విచిత్రాలు జరిగి వుంటాయి. వింతలు చోటు చేసుకుని వుంటాయి. అద్భుతాలూ సంభవించి వుంటాయి. అవన్నీ నాకు తెలియదు కాని, 1950 లో మాత్రం ఒక అద్భుతం జరిగింది. 1950, మే 13న మిచిగాన్లో ఒక పసివాడు ప్రాణం పోసుకున్నాడు. ముద్దులొలికే ఆ చిన్నారిని అతని తల్లి తనివి తీరా చూసుకుని మురిసిపోయింది. అయితే ఆనాడు ఆ తల్లికి కూడా తెలీదు, ఒకనాడు ఈ ప్రపంచం మొత్తం తన బిడ్డను కళ్ళు విప్పార్చి చూస్తుందని. ఆ తల్లి పేరు ల్యూలా. ఆ పసివాడి పేరు స్టీవీ హార్డవే జడ్కిన్స్.
పుట్టుకే విషాదం...
కాల్విన్ జడ్కిన్స్, ల్యూలా మే హార్డవే దంపతులకు ఆరుగురు సంతానం. అందులో మూడోవాడు స్టీవీ. అందరిలా కాకుండా మూడు వారాలు ముందుగానే పుట్టటంతో అతని రూపం పూర్తిగా రూపుదిద్దుకోలేదు. ముఖ్యంగా కాళ్ళ వెనుక భాగంలో ఉండే రక్తనాళాలు సరిగ్గా వృద్ధి చెందలేదు. దాంతో అతనికి కనుచూపు కరువయ్యింది. కానీ అంధత్వం అతని కనులకే కానీ మనసుకు కాదు. అందుకే మనసుతో ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టాడు. తనకెంతో ఇష్టమైన కళకోసం కళ్ళు లేవన్న విషయాన్నివిస్మరించాడు.
స్వరమే వరమై...
చూపు ఇవ్వక దేవుడు అన్యాయం చేసినా... అద్భుతమైన స్వరాన్ని వరంగా ఇచ్చాడు. దానితోనే స్టీవీ యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. చిన్ననాటి నుంచీ చర్చికి సంబంధించిన సంగీత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. పియానో, హార్మోనియం, జాజ్ తదితర సంగీత వాయిద్యాలను అలవోకగా వాయించేవాడు. అందరి ప్రశంసలనూ పొందేవాడు. అలా అతని ప్రతిభ మోటౌన్ రికార్డింగ్ కంపెనీకి చేరింది.
ఒక్కసారి అతని పాట వినగానే ఆ కంపెనీ సి.ఇ.ఒ. బెర్రీ గోర్డీ... "ఇతనిని ప్రపంచపు ఎనిమిదో వింత అని అనకుండా ఉండలేకపోతున్నాను" అన్నాడంటే, స్టీవీ ప్రతిభ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. పదమూడేళ్ల ప్రాయంలో 'ఫింగర్ టిప్స్' మ్యూజిక్ ఆల్బం... అందులో పాడటంతో పాటు పలు సంగీత పరికరాలను వాయించిన ప్రతిభాశాలిగా స్టీవీ ఒక్కసారిగా సెలెబ్రిటీ అయిపోయాడు. అందరి దృష్టీ అతనిమీద. ఏ నోట విన్నా అతని ప్రతిభే. మజిల్ బీచ్ పార్టీ, బికినీ బీచ్ ఆల్బం చేశాక అతను వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు.
అవార్డులకు కేరాఫ్ అడ్రస్...
అవార్డుల కోసం స్టీవీ ఆశపడడు. కానీ అవార్డులు అతన్ని వెతుక్కుంటూ వస్తాయి. ముప్ఫై కంటే ఎక్కువ టాప్ టెన్ హిట్స్ చేసిన రికార్డు అతనిది. చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా 22 గ్రామీ అవార్డులను సొంతం చేసుకున్న ఘనత అతనిది. లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు, అకాడమీ అవార్డు, పోలార్ మ్యూజిక్ అవార్డు, మాంట్రియల్ జాజ్ ఫెస్టివల్ స్పిరిట్ అవార్డు... ఇలా చెప్పుకుంటూ పోతే అతని ప్రతిభకు గీటురాళ్ళు ఎన్నో.
మనిషిగా పుట్టినందుకు ఏదైనా సాధించాలి. మన పేరు పదిమంది చెప్పుకునేలా బతకాలి. స్టీవీని చూస్తే అది నిజమనిపిస్తుంది. వైకల్యం అతనికి విజయాన్ని దూరం చేయలేదు. కంటిచూపు లేదే అని అతను కుంగిపోతూ కూర్చోలేదు. కళకు ప్రాణం పోయాలని కలలు కన్నాడు. ఆ కలను నిజం చేసుకోటానికి అనుక్షణం శ్రమించాడు. అనుకున్నది సాధించాడు. ఆశించిన తీరాలను అందుకున్నాడు. అందుకే స్టీవీ అంటే చాలా ఇష్టం. సింగర్ గా కాదు... ఒక వ్యక్తిగా, ఒక ధీశాలిగా, ఒక ఆదర్శప్రాయుడిగా.
స్టీవీ ఒక అద్భుతం. అన్ని సదుపాయాలు ఉన్నా ఎలాంటి లక్ష్యాలూ లేకుండా సమయాన్ని వృధా చేసే సోమరులకు అతని జీవితం ఓ గుణపాఠం.
తన సంగీత తరంగాలపై యావత్ ప్రపంచాన్నీ ఓలలాడించిన స్టీవీకు జన్మదిన శుభాకాంక్షలు.
No comments:
Post a Comment