Tuesday, May 11, 2010

ఆమ్మా... నీకేమి ఇవ్వగలను?

ఈ ప్రపంచంలో వేల కట్టలేనిది ఏదయినా వుంటే అది అమ్మ ప్రేమే.
ఇంతవరకూ కల్తీ కానిది ఏదయినా వుంటే అది అమ్మ ప్రేమే.
దేనికీ అమ్ముడు పోనిది ఏదయినా వుంటే అది అమ్మ ప్రేమే.
దేని కోసమూ మనకు దూరం కానిది అమ్మ ప్రేమే. 
అమ్మంటే ప్రేమకు ప్రతిరూపం. అమ్మంటే ఆప్యాయతకు మరో రూపం. 

ప్రతిఫలం కోరనిది... ప్రతిక్షణం పరితపించేది
అనురాగం పంచేది... అనుక్షణం ఆరాటపడేది
అమ్మ మాత్రమే.
అందుకేనేమో... అవతార పురుషుడైనా అమ్మ పేగు తెంచుకునే పుడతాడు...
అమ్మ ప్రేమ పంచుకునే అంతవాడు అవుతాడు అన్నాడో మహాకవి.

 నిజమే కదా!
అమ్మ కడుపులో తొమ్మిది నెలల పాటు ఊపిరి పోసుకుంటాం.
అమ్మ ఒడిలో పసితనమంతా సేద తీరుతాం.
అమ్మ గుండెల్లో బతుకంతా తల దాచుకుంటాం.
అమ్మ నేర్పిన మొదటి అడుగును ఆసరాగా చేసుకుని ఎంతటి ఎత్తుకయినా ఎదుగుతాం.
అమ్మ తెలిపిన జ్ఞానాన్ని అనుసరించి ఎంతటి ఘన కీర్తినయినా గర్వంగా మూట కట్టుకుంటాం.
తినటం నేర్పింది అమ్మ. తెలివిగా బతకటం నేర్పింది అమ్మ.
అడుగేయటం నేర్పింది అమ్మ. అడుగడుగునా అండగా నిలిచేది అమ్మ.
అమ్మ లేని ప్రపంచం లేదు. అమ్మ లేకుండా ప్రపంచంలో మన మనుగడ సాగదు.

అమ్మ గురించి మాట్లాడినప్పుడల్లా నాకో కధ గుర్తొస్తుంది.

ఒక పిల్లాడు రాత్రి పడుకోబోయేముందు తన తల్లి దగ్గరకు వచ్చి ఒక కాగితాన్ని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. అందులో ఇలా రాసి వుంది.
గడ్డి కోసినందుకు... 5 /-
ఇల్లు క్లీన్ చేసినందుకు... 10 /-
కిరాణా సామాను తెచినందుకు... 10 /-
చెత్త పారబోసినందుకు... 5 /-
చెల్లిని ఆడించినందుకు... 5 /-
మొత్తంగా నువ్వు నాకు బాకీ వున్నది... 35 /-

తర్వాత రోజు ఉదయం లేవగానే తల్లి తన కొడుకు చేతిలో ఒక కాగితాన్ని పెట్టింది. అందులో ఇలా వుంది.

నిన్ను తొమ్మిది నెలలు మోసినందుకు... వెల లేదు
నీకు జన్మనిచినందుకు... వెల లేదు
నీకు అన్నం తినిపించినందుకు... వెల లేదు
నువ్వు మరుగుకు వెళ్తే శుభ్రం చేసినందుకు... వెల లేదు
నీకు బట్టలు, చాక్లెట్లు, బొమ్మలు కొనిచినందుకు... వెల లేదు
నువ్వు జబ్బు పడితే సేవ చేసినందుకు... వెల లేదు

మొత్తంగా నువ్వు నాకు చెల్లించాల్సింది ఏమీ లేదు.

ఇది చదివేసరికి ఆ పిల్లాడి కళ్ళలో నీళ్ళు నిండిపోయాయి. ఏడుస్తూ వెళ్లి తల్లి కాళ్ళ మీద పడి ఇలా అన్నాడు...
"నువ్వు నాకేమి ఇవ్వక్కర్లేదమ్మా. నేనే నీకు బాకీ పడ్డాను. చాలా చాలా బాకీ పడ్డాను"

ఈ కధ గుర్తొస్తే నా మనసు భారమై పోతుంది. నిజమే కదా! ఏమి ఇచ్చి తల్లి ఋణం తీర్చుకోగలం!
  జన్మనిచ్చి, సేవచేసి, బుద్ధులు నేర్పి, ఇంతవాళ్ళను చేసిన అమ్మకు ఏమి ఇవ్వగలం?

ఇవ్వగలం. చాలా ఇవ్వగలం.

ఆమె ముసలిది అయిపోయి ఆశ్రయం కోరి వచ్చినపుడు మన ఇంట్లో తన కోసం ఒక గదిని కేటాయించలేమా?
ఆకలిగా వుందని అని ఆమె నోరు తెరచి అడిగేలోపే పట్టెడు ముద్దను ఆమెకు పెట్టలేమా?
కళ్ళజోడు పాతదై పోయిందని చెప్పేలోపే కొత్త కళ్ళజోడును కొనివ్వలేమా?
ముసలిదానికి ముచ్చటలు ఎందుకని ముతక చీర ముఖాన కొట్టకుండా... తనకు నచ్చిన రండు చీర తెచ్చి ఇవ్వలేమా?
పళ్ళు లేనిదానికి పసందులేమిట్లే అని సనుక్కోకుండా... ఆమెకెంతో ఇష్టమైన పాయసాన్ని చేసి తినిపించలేమా?
తనకు నచ్చిన భక్తి చానల్ చూస్తున్నపుడు క్రికెట్ కోసమో, చిరంజీవి సినిమా కోసమో చానల్ మార్చకుండా వుండలేమా?
సమయం లేదని వంకలు చెప్పకుండా, బిజీ అంటూ బడాయిలు పోకుండా రోజూ పడి నిముషాలు ఆమెతో కబుర్లు చెప్పలేమా?

చేయగలం. ఇవన్ని తనకోసం మనం చేయగలం. ఇంతకుమించి ఏవేవో చేయాలని తను మనలను కోరదు కూడా. ఒకవేళ కోరితే వాటిని తీర్చటం కోసం తన బిడ్డ ఎంత కష్టపడి పోతాడోనని ఆ మాతృ హృదయం ముందుగానే బెంగపడిపోతుంది. అందుకే అంతకు మించి ఏదీ ఆశించదు.

మనకోసం బతికినా అమ్మకి, మనం తప్ప వేరే ప్రపంచమే లేదనుకునే పిచ్చి తల్లికి, మనకోసం ఎన్నో కష్టనష్టాలకోర్చిన మాతృమూర్తికి మనం చేయగలిగింది కూడా చేయలేకపోతే మన జన్మ వృధా! అందుకే మాత్రుదినోత్సవాలు చేసుకోవటం కాదు, అమ్మ మనసు తెలుసుకుని నడచుకోవటం అలవాటు చేసుకోవాలి. అమ్మ మనకోసం చేసిన త్యాగాలను మరువకుండా మననం చేసుకోవాలి.
దానికి ప్రతిగా మనమేమి తన కోసం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు.
మనకు జన్మనిచ్చిన ఆ తల్లి పేగు బాధతో మెలికలు పడకుండా చూసుకుంటే చాలు.
బయటకు వెళ్ళిన మనం ఇంటికొచ్చే వరకు కళ్ళలో వొత్తులు వేసుకుని చూసిన ఆమె కళ్ళలో కన్నీటి తడి చేరకుండా చూసుకుంటే చాలు.
మనకు అన్నీ అమర్చి పెట్టటం కోసం పరుగులిడి అలసిన ఆమె పాదాలు పట్టు తప్పుతుంటే, కింద పడకుండా ఆమెను పొదివి పట్టుకుంటే చాలు.

ఇవి చాలు... ఆ తల్లి మనసు మురిసిపోతుంది. మరు జన్మలో సైతం మనల్ని తన కడుపున మోయాలని కలలు కంటూ ప్రసాంతంగా కన్ను మూస్తుంది.

ఇంతకన్నా అమ్మకు మనం ఏమి చేయగలం?
ఇంతకుమించి ఆ ప్రేమమయికి ఏమి ఇవ్వగలం?





2 comments:

  1. చాలా బాగా రాసారు!!!
    నిజంగా అమ్మ ప్రేమ వెలలేనిది..

    ReplyDelete
  2. మీ స్పందన తెలిపినందుకు చాలా థాంక్స్!

    ReplyDelete