Monday, May 17, 2010

నేను స్త్రీవాదిని కాను


ఆడదే ఆధారం, మన కధ ఆడనే ఆరంభం అంటూ పాటలు కట్టారు. వాటిని విని ఆనందించమన్నారు కానీ మనసులో నిలుపుకొమ్మని ఎవరూ చెప్పలేదా? ఆడవాళ్ళు పూజింపబడే చోట దేవతలు కొలువై ఉంటారని మాట వరుసకే అన్నారా? ఆ మాటలను దృష్టిలో ఉంచుకుని ఆడవాళ్ళను పూజించాల్సిన అవసరం లేదా? పోనీ పూజించాల్సిన అవసరం లేదు... కనీసం గౌరవిస్తే చాలు కదా! ఆ కాస్త గౌరవం కూడా దక్కటం లేదే ఆడదానికి! ముఖ్యంగా మన దేశంలో.
ఆడదానికి వేదాలలో చోటు దక్కింది కానీ మగాడి మనసులో దక్కటం లేదే. ఆడది మహామహులకు జన్మనిచ్చింది కానీ ఎన్ని జన్మలెత్తినా కనీసం మనిషిగానయినా మర్యాదను అందుకోవటం లేదే! స్త్రీ మగాడితో సమానంగా పదవులను అలంకరిస్తోంది, స్త్రీ అంతరిక్షంలో అడుగుపెట్టింది, స్త్రీ అన్నిటా ముందడుగు వేస్తోంది, నిజంగా మగాడు సహకరించకపోతే ఇవన్నీ సాధించగలిగేదా... ఈమధ్య ఒక మగ మహారాజు అన్న మాటలివి. అసలు ఆడది ఎదగటానికి మగాడి అనుమతి ఎందుకు కావాలట అన్నాను నేను. అంటే... అంతా మీ ఇష్టమేనా అన్నాడతను కినుకగా. నాకు నవ్వొచ్చింది. తండ్రిగా వున్నపుడు మగాడు బాగుంటున్నాడు. కూతురిని కొడుకులతో సమానంగా చదివిస్తున్నాడు. అన్నగా వున్నపుడు మగాడు బాగుంటున్నాడు. చెల్లెలికి అన్నిటా తోడుగా ఉంటున్నాడు. మగాడు స్నేహితునిగా వున్నపుడు బాగానే ఉంటున్నాడు. తన నేస్తం మీద ఎలాంటి నీలి నీడలూ పడకుండా కాపాడుకుంటున్నాడు. కానీ మగాడు భర్త స్థానంలోకి రాగానే ఎందుకు మారిపోతున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం నాకు తెలిసి ఏ మగాడూ చెప్పలేదు. దీనికి సమాధానం స్త్రీ దగ్గర మాత్రమే దొరుకుతుంది.
ఒక ఆడపిల్ల విషయంలో తండ్రి, అన్న, స్నేహితుడు తమకు బాధ్యత ఉందనుకుంటారు. కేవలం భర్త మాత్రమే ఆమెపై తనకు హక్కు వుందనుకుంటాడు. ఆమె తన సొత్తు అనుకుంటాడు. జీవితమంతా ఆమె తన దగ్గర వుండి తీరాలనుకుంటాడు. తను లేకపోతే ఆమెకు మనుగడ లేదనుకుంటాడు. తను కాదంటే ఆమెకు జీవితమే లేదనుకుంటాడు. తను మాత్రమే ఆమె ప్రపంచమనుకుంటాడు. ప్రపంచంలో తను తప్ప ఆమెకు మరే దిక్కూ లేదనుకుంటాడు. ఆమె ప్రపంచాన్ని తన కళ్ళతోనే చూడాలనుకుంటాడు. అక్కడే సమస్యంతా.
భార్య తనకు నచ్చిన కూర వండాలి. తనకు నచ్చిన చీర కట్టాలి. తనకు నచ్చినట్టు జడ వేయాలి. తనకు నచ్చిన వారితో మాట్లాడాలి. తనకు నచ్చితేనే వుద్యోగం చేయాలి. నా, నేను, నాకు... ఈ మూడు మాటలు మగాడే ఎందుకు ఎక్కువ వాడతాడు? ఆడది ఆ మాటలు వాడితే ఎందుకు ఆవేసపడతాడు? ఆడది అనుకునేముందు తను కూడా మనిషే అని ఒక్కసారి అనుకోవచ్చు కదా! నాకు ఇది ఇష్టం అని చెప్పినపుడు నీకేమి ఇష్టం అని అడగవచ్చు కదా! నువ్వు నాకు నచ్చినట్టు వుండు అని ఆజ్ఞలు జారీ చేసేటప్పుడు, ఆమెకు నచ్చినట్టు ఉండటానికి కాస్తయినా ప్రయత్నించవచ్చు కదా! ఇవన్నీ వాళ్లకు ఎలా అర్ధమవుతాయి?
భార్య శరీరంతో పాటు మనసును కూడా తడిమే ప్రయత్నం మగవాడు చేయడే? ఒక్కసారి ఆ ప్రయత్నం చేస్తే ఆడది జీవితమంతా అతని చేయి విడువదని వాళ్లకు ఎలా అర్ధమవుతుంది! బతుకంతా నీ మనసు తెలుసుకుని నడచుకుంటానని బాస చేస్తే, బానిసగానైనా బతికేంతగా ప్రేమించేస్తుందని ఎలా చెబితే తెలుస్తుంది! ఇష్టాలను గౌరవించకపోయినా, కనీసం కించపరచకుండా వుంటే... తన ఇష్టాలను సయితం మర్చిపోయి అతని ఇష్టాలు తీర్చటమే పరమావధిగా జీవిస్తుందని ఎలా అవగతమవుతుంది!
పిడికెడంత ప్రేమను పంచి పెడితే... మగాడిగా అతనిని గెలిపించటం కోసం ఆడదానిగా తను ఆనదంగా ఓడిపోతుందని ఎప్పుడు అర్ధమవుతుంది!
చిరునవ్వుతో చిన్న పలకరింపు... ఆప్యాయత నిండిన మెత్తని స్పర్శ... కన్నీరు చిందిన వెల అక్కున చేర్చుకునే అనురాగం... అలసిన వేళ ఆర్తిగా దగ్గరకు తీసుకునే చేతులు... ప్రపంచంలో దేనిని గుర్తు రానివ్వకుండా చేసే వేచని కౌగిలి... కోరుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఆమెతో పాటు నడిచే పాదాలు... ఆమె విజయం సాధించినప్పుడు గర్వంగా విచ్చుకునే పెదవులు... భార్యగా తనకు బాసటగా నిలిచిన ఆమె, వ్యక్తిగా కూడా ఎదిగితే చూడాలని తపించే కళ్ళు... ఇవన్నీ వున్న మగాడు ఈ భూమి మీద వున్నాడా? వుంటే అతనికి స్త్రీగా పాదాభివందనం చేస్తాను.
నా మాటలు చదివితే మగాళ్ళకు కోపం రావచ్చు. కానీ నా మాటల మాటున దాగి వున్న ఆవేదనను చదివే ప్రయత్నం చేస్తే కోపం రాదు. ఆడది ఎన్ని సాధించినా మగాడి దగ్గర బలహీనపడుతోంది. దానికి కారణం ప్రేమ. ప్రేమ కోసం స్త్రీ పురుషుడిని ఆశ్రయిస్తుంది. తను కోరుకున్న ప్రేమ అతని దగ్గర దొరుకుతుందన్న నమ్మకంతో తన నిండు జీవితాన్ని అతని చేతుల్లో పెడుతోంది. దానిని అర్ధం చేసుకుని ఆమెను అక్కున చేర్చుకునే మగవాళ్ళు వున్నారో లేదో తెలియదు కానీ, అహంకారంతో పువ్వులాంటి ఆమె మనసును నలిపి పారేస్తున్న మగవాళ్ళు చాలామందే వున్నారు. ఇప్పటికీ ఎంతోమంది స్త్రీలు అలాంటివారి చేతుల్లో వంచనకు గురవుతూనే వున్నారు. గుండెల్లో పొంగుతున్న ఆవేదన కళ్ళనుండి బయటకు దూకకుండా, కనురెప్పల ఆనకట్ట వేసి బంధించాలని ప్రయత్నిస్తూ, భారంగా బతుకీడుస్తున్నారు. వాళ్లకు ఆ పరిస్తితి తెచ్చిన మగాళ్ళ మీద మాత్రమే నా కోపం. అంతే తప్ప నేను పురుష ద్వేషిని కాను. స్త్రీవాదిని అంతకన్నా కాదు. 

8 comments:

  1. meedi vyakti gatamaina praablem. bhaarya anTe prema choopinchi aame ishta prakaaram velle maga vaallu koodaa chaalaa amnde unnaaru

    ReplyDelete
  2. meeru cheppindi komta varaku nijame kaani andaru ala vumDari kadaa.

    ReplyDelete
  3. ఆదర్శ స్త్రీ లేనట్లే ఆదర్శ మగాడు కూడా లేడు. ఈ ఆదర్శ స్త్రీ లేక ఆదర్శ పురుషుడూ మన "విష్-ఫుల్ థింకింగ్" కి ప్రతి రూపాలు. అంటే కేవలం కల్పితాలు. నేను నాకు నచ్చిన స్త్రీ గురించి అనేక లక్షణాలు చెప్పి...చివరికి "ఇలాంటి స్త్రీ ఉంటుందా?" అంటే..అలాంటి స్త్రీ కాక పోవటం మీ తప్పు ఎలా కాదో మీరు ఊహొఇంచుకున్న మగాడు కాకపోవటం ఒక మగాడి తప్పుకూడా కాదు. మగాళ్ళను ముప్పుతిప్పలు పట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించే ఆడవాళ్ళు కొడా ఉన్నారు. మగాడు తమకి ఇష్టమైనట్లు ఏ కొంచెం ప్రవర్తించకపోయినా, ఊరుకోని ఆడవాళ్ళున్నారు.

    ReplyDelete
  4. కానీ మగాడు భర్త స్థానంలోకి రాగానే ఎందుకు మారిపోతున్నాడు?

    ఆడవాళ్ళక్కూడా ఇదే వర్తిస్తుంది కదా ? భార్య స్థానంలోకి వచ్చిన ఆడది అతన్ని కనిపెంచిన తల్లిదండ్రుల కంటే తనకే అతని మీదా అతని సంపాదన మీదా ఎక్కువ హక్కుందని ఎందుకు భావిస్తోంది ? మగవాణ్ణి తన ఆస్తిగా ఆడది భావించడంలేదా ?

    మరో మాట. మగవాడి ఆదాయమూ ఆస్తీ కుటుంబంలో అందరికీ చెందుతాయి. ఆడదాని ఆస్తి మాత్రం ఆమె ఒక్కర్తిదే. మరి మగవాడు ఎక్కువ నిస్వార్థుడా ? ఆడది ఎక్కువ నిస్వార్థురాలా ?

    ReplyDelete
  5. మీ అందరి అభిప్రాయతో నేను ఏకీభవిస్తాను. అయితే నేను అందరి మగవాళ్ళను వుద్దేశించి రాయటం లేదని ముందే చెప్పాను.కాబట్టి మీరు బాధ పడాల్సిన అవసరం లేదు. కేవలం నేను చూసిన కొందరు మగాళ్ళకు మాత్రమే ఆ మాటలు వర్తిస్తాయి. మీరన్నట్టు భర్తలను వేధించే భార్యలు కూడా వున్నారు.వాళ్ళ గురించి ఏ మగాడో రాస్తాడులెండి.ఎందుకంటే బాధ అనేది ఆడదానికయినా మగాడికయినా ఒకటే కదా!ఏది ఏమయినా మీ స్పందనకు ధన్యవాదాలు.

    ReplyDelete
  6. మూడు చేపల కథ:(జస్ట్ ఫర్ ఫన్)
    సుమతి: పెళ్ళి మానేస్తుంది లేదా మొగుడికి మొగుడవుతుంది
    కాలమతి: విడాకుల చట్టం ఉంది ఈమె కోసమే...
    మందమతి: ఈమె ఏమి చేస్తుందో మీకందరికీ తెలుసు....
    (కిరోసిన్ రేటు, బ్లేడు గాటు, ట్రెయిన్/గూడ్సు లేటు ఈమెకి బాగా తెలుస్తాయి)

    ఐనా సమీరగారూ... మీరు చెప్పినట్లు బాద పడుతున్న ఆడవాళ్ళ గురించి సగటు మనిషెవరికెనా.. జాలి ఉంటుంది.. కానీ ఆ జాలి వలన ఎవరికీ లాభం ఉండదు..
    మీరు polygonకి ఒక సైడే చూపించారు... మిగిలిన సైడ్లలో ఆడ, మగ తేడాల్లేకుండా ఒకరి వలన ఒకరు ఎన్నెన్ని రకాలుగానో బాద పడుతున్నారు...
    ఐనా స్త్రీ భాదిత, రిజర్వేషన్ భాదిత, భార్యా భాదిత, వర్గ భాదిత, వర్ణ భాదిత..etc.. ఇన్ని రకాలైన భాదితులైన ఒక సగటు మగాడు.. ఈదురుగాలిలో రెపరెపలాడుతున్న దీపంలా ఉన్నా ఎవరూ పట్టించుకోరు...
    ఐనా మీ ఊరు నాకు ఇంత దూరం అంటే ఇంత అని వాదులాడుకోటం కంటే.. విషయాన్ని లైటుగా తీసుకుని ప్రోబ్లం వస్తే అప్పుడు ఎలా చూసుకోవాలో ఆలోచిస్తే సరిపోతుంది..
    Have a nice day...

    ReplyDelete
  7. అంత జెనరలైజ్ చేసి రాసి అదేమంటే 'నేనెరిగిన కొందరి గురించే రాశా' అంటారేంటీ!

    మొత్తానికి - మగాడి నెత్తి మీద తల్లి/కూతురు/అక్క/చెల్లి/నేస్తం వగైరా సవాలక్ష వరసల వనితామణుల బాగోగులు చూసుకునే మహత్తర బాధ్యతైతే ఉంది కానీ, ఒక్కగానొక్క భార్య మీద అంతో ఇంతో పెత్తనం చెలాయించే హక్కు మాత్రం లేదంటారు. Hmmm :-)

    ReplyDelete
  8. మీ అందరి అభిప్రాయాలనూ నేను గౌరవిస్తాను. కానీ నా అభిప్రాయాన్ని నేను వెలిబుచ్చకుండా వుండలేను. స్త్రీ మాత్రమే కాదు, పురుషుడూ కొన్ని బాధలు పడుతున్నాడు. దాని గురించి రాయమన్నా ఇంతే నిజాయితీగా రాస్తాను.ఇంత బాధ పడుతున్నారంటే మీరంతా భార్యను ప్రేమగా చూసుకునే భర్తలై వుంటారు. నా మాటలేవీ మీ గురించి కాదు. అవి మీకు వర్తించవు.

    ReplyDelete