Monday, June 28, 2010

'చెత్త' హోటల్!

(సాక్షి ఫండే మ్యాగజైన్ కోసం రాసిన ఆర్టికల్)

Saturday, June 26, 2010

కేక పెట్టించే కేకులు!

కేకు పేరు చెబితే లోట్టలేయని వారుండరు. కానీ ఈ కేకులను చూస్తే మాత్రం కేక పెట్టకుండా వుండరు. ఒక వంటగాడు తన సృజనాత్మకతను ఇలా ప్రదర్శించి చూపాడు. క్రియేటివిటీ సంగతేమో కానీ... వీటిని చూసాక పిల్లలు కేకు పేరు చెబితేనే జడుసుకోవటం ఖాయం. కావాలంటే మీరూ చూడండి!




Thursday, June 24, 2010

విలన్ ఏమంటున్నాడు?


నటీనటులు: విక్రమ్, ఐశ్వర్యారాయ్, పృథ్విరాజ్, కార్తీక్, ప్రభు, ప్రియమణి తదితరులు.
కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మణిరత్నం
నిర్మాతలు: మణిరత్నం, శారద త్రిలోక్
సంగీతం: రెహమాన్
మాటలు: శ్రీరామకృష్ణ
పాటలు: వేటూరి
సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్, మణికండన్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
ఆర్ట్: సమీర్ చంద్ర

మణిరత్నం సినిమా అనగానే ఆత్రుతగా ఎదురుచూసే ప్రేక్షకుల ఆశలపై నీళ్ళు చల్లేసింది రావన్ సినిమా. అద్భుతమైన నటనా పటిమను ప్రదర్శించే విక్రమ్, అందాలరాశి ఐశ్వర్యా రాయ్ కాంబినేషన్, నంబర్ వన్ దర్శకుడు మణిరత్నం, సంగీత సామ్రాట్ రెహ్మాన్... ఇవేవీ రావణుడి వోటమిని ఆపలేకపోయాయి. తెలుగులో విలన్ గా విడుదలైన ఈ చిత్రం అభిమానుల తిరస్కారానికి గురయ్యింది. క్లారిటీ లేని కధనం, కధకు ఏమాత్రం బలం చేకూర్చలేకపోయిన మాటలు, ఎంతమాత్రం ఇంపుగా లేని సంగీతం... అన్నీ కలిసి సినిమాని చతికిలబదేలా  చేసాయి.
            అటవీ ప్రాంతాల్లో ఉండే సంఘ విద్రోహ శక్తి వీర (విక్రమ్‌). ఆ అటవీ ప్రాంతంలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతుంటాడు. పోలీసులను సజీవ దహనం చేయడం, ఎదురు తిరిగితే ఉప్పు పాతరెయ్యడం వంటివి చేస్తుంటాడు. (ఈ పాత్ర కాస్త వీరప్పన్ ను తలపోస్తుంది.) ఆ ప్రాంతానికి వచ్చిన సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ దేవ్‌ (పృథ్విరాజ్‌) వీరను చంపడమే లక్ష్యం గా పెట్టుకుంటాడు. పోలీస్‌ల కారణంగా వీర చెల్లెలి (ప్రియమణి) జీవితం నాశనం అవుతుంది. ఆ పగతో రగిలిపోతున్న వీర... దానికి ప్రతిగా దేవ్‌ భార్య రాగిణి (ఐశ్వర్య)ని కిడ్నాప్‌ చేసి తన స్థావరానికి తీసుకొస్తాడు. 14 రోజులు రాగిణిని బంధించి పోలీసులతో యుద్ధానికి దిగుతాడు. తర్వాత ఏం జరిగిందన్నది మిగతా కథ.
           రామాయణాన్ని ఆధునకరీస్తూ రావణుడిని హైలెట్ చేస్తూ వచ్చిన ఈ చిత్రంలో పాత్రల గాఢత అంతగా కనపడదు. దానికి కారణం పాత్రలను వాటి వాటి నేఫద్యాల్లో ఎస్టాబ్లిష్ చేయకపోవటమే. ఇంటర్వెల్ అయ్యేదాకా విక్రమ్ అస్సలు ఐశ్వర్య రాయ్ ని ఎందుకు కిడ్నాప్ చేసాడు...ఆమె ద్వారా అతను ఏం సాధిద్దామనుకున్నాడు...అతను ఏం నష్టపోయాడు..ఏం లాభం పొందుదామనుకున్నాడనేది స్పష్టం కాదు. సినిమాలో ఎంటర్‌టైనర్‌మెంట్‌ పూర్తిగా లోపించింది. పాత్రల్లో ఎమోషన్‌ శృతి మించింది. నటీనటుల నటనాకౌశలం చూపడం కోసమే సినిమా తీసినట్టుంది. సంభాషణలు చాలా చాలా  పేలవంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్: వీరయ్య పాత్రలో విక్రమ్ అద్భుతంగా రాణించాడు. అతని హావబావాలు అమితంగా ఆకట్టుకుంటాయి. ఐశ్వర్యారాయ్ తన పాత్రకు నూరు శాతం న్యాయం చేసింది. కాస్త డీ గ్లామరైజ్డ్ గా వున్న ఎంతో అందంగా కనిపించింది.  ఆమె అందం చిత్రానికి నిండుదన్నాన్నించింది. ప్రభు, కార్తీక్ కీలకమైన పాత్రల్లో బాగా చేశారు. ప్రియమణి కూడా తన వంతు మెప్పించింది. పృథ్విరాజ్ కూడా పరవాలేదనిపించాడు. ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ప్రాణం. అడవుల చిత్రీకరణ అద్భుతంగా వుంది. పచ్చని ప్రకృతిని తెచ్చి స్క్రీన్ మీద పరిచినట్టుగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో రీ రికార్డింగ్ కూడా చాలా బాగుంది.

మైనస్ పాయింట్స్: సినిమాకి అతి పెద్ద మైనస్ డైలాగ్స్. నటీనటుల పెదవుల కదలికకు, సంభాషణలకు సంబంధం వుండదు. దానితో అసలు ఏమి మాట్లాడుకుంటున్నారో అర్ధం కానీ పరిస్తితి. ఇది చాలా విసుగు తెప్పిస్తుంది. ఎక్కడా పంచ్ డైలాగులు కానీ, ప్రేక్షకులకు ఉత్సాహాన్ని కలిగించే మాటలు కానీ లేవు. ఏదో మాట్లాడుతున్నారులే అనుకోవాలి. పాటలు కూడా వినసొంపుగా లేవు. రెహ్మాన్ సంగీతం సినిమాకు ఏ విధంగానూ ఉపయోగపడలేదు. మొత్తంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంతా బోర్.  హీరోయిన్ తప్పించుకోవలనుకోవటం, విలన్ కి దొరికిపోవటం తప్ప ఏమి కధ వుండదు. సెకెండ్ హాఫ్ కాస్త పరవాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు. ప్రేక్షకుడిని మళ్ళీ మళ్ళీ థియేటర్ కి రాప్పించనూ లేదు. 

Thursday, June 10, 2010

రాతిని తొలిచి... రమ్యంగా మలిచి...

శిలను చెక్కి శిల్పాన్ని చేయటం పాత కళ. శిలను తొలిచి ఇంటిని చేయటం కొత్త కళ. ఈ కళలో టర్కీ వాళ్ళు సిద్ధహస్తులు. వాళ్ళు పెద్ద పెద్ద rallanu  సైతం అవలీలగా తొలిచేస్తున్నారు. వాటిలో నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. మనలాంటి వాళ్ళెవరికైనా ఆసక్తి కలిగి అక్కడికి వెల్తామేమోనని ఒక హోటల్ని కూడా కట్టారు. ఆ హోటల్ పేరు  'యునాక్ ఎల్వరీ హోటల్'.
         టర్కీలోని వుర్గప్ అనే ప్రాంతంలో ఈ హోటల్ వుంది. ఒక పెద్ద కొండను తవ్వి, ఈ విలాసవంతమైన హోటల్ కట్టారు. చక్కని బెడ్ రూములు, అటాచ్డ్ బాత్రూములు, రరకాల వంటలను రుచిగా అందించే రెస్టారెంట్, స్విమ్మింగ్ పూల్, గోడలకు ఖరీదయిన పెయింటింగులు... ఇలా అన్నీ హంగులతో అత్యాధునికంగా ఉంటుందా హోటల్. ఇందులో మొత్తం 30 గదులున్నాయి. వీటిలో కొన్ని మామూలు గదులు, కొన్ని డీలక్స్, మరికొన్ని సూట్స్. సింగిల్ రూముకి 85 యూరోలు (సుమారుగా 4745 రూపాయలు) , డబుల్ రూముకి 110 యూరోలు (సుమారుగా 6140 రూపాయలు), డీలక్స్ రూముకి 130 యూరోలు (సుమారుగా 7257 రూపాయలు), సూట్ కి 170 యూరోలు (సుమారుగా 9490 రూపాయలు) చెల్లించాల్సి వుంటుంది.
      ఆ మొత్తం పెద్ద ఖర్చు కాదనుకునేవారు హ్యాపీ గా వెళ్లి, ఎల్వరీ హోటల్లో చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు. ముఖ్యంగా ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి, హనీమూన్ కి వెళ్ళేవాళ్ళు రొటీన్ గా ఏ ఊటీనో, కొడైకేనాలో వెళ్ళకుండా టర్కీ వెళ్లి, ఎల్వరీ హోటల్లో హాయిగా స్పెండ్ చేయవచ్చు.  ఒక అద్భుతాని చూసినట్టూ వుంటుంది, ఒక మధురమైన అనుభూతిని సొంతం చేసుకున్నట్టూ వుంటుంది!
రాత్రిపూట హోటల్ అందాలు


విలాసవంతమైన పడక గది

డైనింగ్ హాల్

సాయంత్రంపూట ఇలా ఆరుబయట కూర్చుని కబుర్లాడుకుంటే ఆ ఆనందమే వేరు


Friday, June 4, 2010

గాన గంధర్వా... జోహార్లు!


గాన గంధర్వుడు, నా అభిమాన గాయకుడు బాలుకి జన్మదిన శుభాకాంక్షలు

పరవశిస్తుంది. ఆయన స్వరం కూర్చితే ఆ పాటలోని మాధుర్యం మనసులను పులకింప చేస్తుంది. నటుల హావభావాలకు అనుగుణంగా పాటలు పాడే విలక్షణత ఆయనకు మాత్రమే సొంతం. అందుకే ఆయన పాట పామరులను సయితం ఉర్రూతలూగించింది. 40 ఏళ్ళ సినీప్రస్తానంలో 11 భాషలలో, 40 వేలకు పైగా పాటలు పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి అరుదయిన రికార్డు సృష్టించారు బాలు. తెలుగు, తమిళం, కన్నడ బాషలలో కూడా ఆయన పాడిన పాటలకి జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా , నటుడిగా, సంగీత దర్శకుడిగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆయా విభాగాలలో 29 సార్లు నంది పురస్కారాన్ని అందుకున్న భాహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు.


                  ఒకటా రెండా... అయన గళం నుండి జాలువారిన అమృతపు చినుకులు ఎన్నని! ఆ అమృత జల్లుల్లో తడిసి ముద్దయిన అభిమాన హృదయాలు ఎన్నని! తెలుగు ప్రజానీకం ఏ పుణ్యం చేసుకుందో ఆ మధుర స్వరాన్ని విని తరించటానికి! తెలుగు సినిమా ఏమి అదృష్టం అదృష్టం చేసుకుందో... ఆ మహనీయుని తనలో ఇముడ్చుకోటానికి!



         బాలు పాడిన పాటల్లో నాకిష్టమైన పాటలను వెలికి తీయటమంటే, సాగర గర్భంలో ఆణిముత్యాన్ని వెతికే సాహసం చేయటమే. ఆకాశాన్ని జల్లెడ పట్టి చుక్కల్ని లెక్కపెట్టే ప్రయత్నం చేయతమంతా పిచ్చితనమే. అయినా నాకు నచ్చిన, నేను మరీ మరీ వినే కొన్ని పాటల్ని వుటంకించకుండా  ఉండలేను.  
* నెలరాజా పరుగిడకు (అమరగీతం)
* మధుమాస వేళలో (అందమె ఆనందం)
* సిరిమల్లె నీవే, ఎడారిలో కోయిల  (పంతులమ్మ)
* మల్లెలు పూచే (ఇంటింటి రామాయణం)
* చుట్టూ చెంగావి చీర (తూరుపు వెళ్ళే రైలు)
* కళకే కళ నీ అందమూ (అమావాస్య చంద్రుడు)
* కీరవాణి చిలకల కొలికిలో (అన్వేషణ)
* చక్కనైన ఓ చిరుగాలి (ప్రేమ సాగరం)
* విధాత తలపున (సిరివెన్నెల) 
* ఆవేసమంతా ఆలాపనేలే (ఆలాపన)
* రేగుతున్నదొక రాగం (డాన్స్ మాస్టర్)
* ప్రియతమా నా హృదయమా (ప్రేమ)
* మాటేరాని చిన్నదాని (ఓ పాపా లాలి)
* చెలీ రావా వరాలీవా (మౌనరాగం)
* ఓ పాపా లాలి (గీతాంజలి)
* కమ్మని ఈ ప్రమలేఖని (గుణ)
* పూ లతలే పూచెనమ్మా (హృదయం)
* సుమం ప్రతిసుమం సుమం (మహర్షి)
* ప్రియతమా ప్రియతమా (ప్రియతమా)
* పువ్వై పుట్టి పూజే చేసి (రాగమాలిక)
* తరలిరాద తనే వసంతం, చుట్టూ పక్కల చూడరా (రుద్రవీణ)
* నిను తలచి మైమరచా (విచిత్ర సోదరులు)
* కధగా కల్పనగా, యీలోకం అతి పచ్చన (వసంత కోకిల)
* పచ్చ పచ్చాని కల వేసే బంగారు వల (తూర్పు సింధూరం)
* ప్రేమ లేదనీ (అభినందన)
* నాగమల్లి తోటలలో ఈ వలపు పాటలలో (అనురాగ సంగమం)
 
             ఇక ఈ సాహసాన్ని కట్టి పెట్టటం మంచిదని నాకనిపిస్తోంది. ఆకాశాన్ని కొలవటం, సముద్రంలోని నీతిని తోడటం, సూర్యుని చేతితో తాకటం సాధ్యపడిన నాడు, బహుశా బాలు పాటల్లో నాకిష్టమైన వాటిని ఎంచటం కూడా సాధ్యపడుతుందేమో!

Thursday, June 3, 2010

సంగీత నిధి... ఇళయరాజా!

            స్వరాలను ఏరి కూర్చి రాగమాలికలను అల్లే స్వరాల రారాజు ఇళయరాజా పుట్టినరోజు జూన్ 2న.

నాకు తెలిసి పాటంటే ఇళయరాజా కట్టినది. మనసు పొరలను తడిమే ఆయన పాట వినని రోజు ఏదో వెలితి. నా జీవితంలో నాకున్న కోరిక ఒక్కటే... ఒకే ఒక్కసారి ఆ మహానుభావున్ని కళ్ళారా చూడాలని. ఒక్కసారయినా ఆ మహనీయుని కాళ్ళకు నమస్కరించాలని.
        సంగీత సాగరాన్ని మధించి, అమృతతుల్యమయిన పాటలను అందించిన మేధావి ఇళయరాజా, 1943వ సంవత్సరం జూన్ 2వ తేదీన తమిళనాడులో ఒక నిరు పేదకుటుంబంలో జన్మించారు.  మొదట్లో చెన్నైలో శుభకార్యాలకు, సభలకు సంగీత ప్రదర్శనలిచ్చే బృందంలో సభ్యునిగా సంగీత జీవితాన్ని ప్రారంభించారు ఇళయరాజా. సలీల్ చౌదరి వంటి సంగీత దర్శకుల దగ్గర గిటారిస్టుగా, కీ బోర్డు కళాకారుడిగా పని చేసారు. తర్వాత కన్నడ సంగీత దర్శకుడైన జి.కె.వెంకటేష్ దగ్గర సహాయకుడిగా చేరడంతో చలన చిత్ర పరిశ్రమతో అనుబంధం ప్రారంభమైంది. ఈ సంగీత దర్శకుని దగ్గరే దాదాపు 200 సినిమాలకు సహాయకుడిగా పని చేసారు. కొన్నాళ్ళకు పంజు అరుణాచలం అనే తమిళ నిర్మాత అన్నక్కలి అనే సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం ఇవ్వడంతో 1976 లో ఇళయరాజా పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా అవతరించాడు. 1976లో విడుదలైన జయప్రద నటించిన 'భద్రకాళి అనే తెలుగు చిత్రంలోని ‘చిన్ని చిన్ని కన్నయ్య’ అనే పాటకు సంగీతాన్ని అందించి మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు  సినీరంగ ప్రవేశం చేసారు. అయితే ఎన్టీఆర్‌ నటించిన 'యుగంధర్‌' మొదట విడుదలయింది. ఆ రోజునుంచి ఈరోజు వరకూ వెనుదిరిగి చూసుకోలేదయన. మూడు సార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్న ఘనత ఆయనది. ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారంతో పాటు పద్మభూషణ్ అవార్డును అందుకున్న విశిష్టత ఆయనది.
    సంగీతానికి కొత్త ఒరవడిని నేర్పాడాయన. స్వరాల జల్లుల్లో సర్వ మానవాళినీ తడిపి ముద్ద చేసాడాయన. ఆయన చేయని ప్రయోగం లేదు. ఆయన లేకపోతే సినిమా సంగీతమే లేదు. ఆయన ఒక స్వరసాగరం. సినీ సంగీత చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఓ స్వర్ణాక్షరం.
       సుమనోహర స్వరాలతో మదిమదినీ పులకింప చేసిన స్వరబ్రహ్మకు వందనం. రసరమ్యమైన రాగాలతో ప్రతి హృదినీ పరవశింప చేసిన సంగీత నిధికి అభివందనం.

ఇళయరాజా అంటే ఏమిటో తెలిపే అమావాస్య చంద్రుడులోని ఈ అద్భుతమైన పాట నా ఆల్ టైం ఫేవరేట్.

సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో(2)

మలయజ మారుత శీకరమో, మనసిజ రాగ వశీకరమో
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో


ఆనందాలే భోగాలైతే, హంసానంది రాగాలైతే
నవ వసంత గానాలేవో సాగేనులే, సురవీణ నాదాలెన్నో మొగేనులే
వేకువలో వెన్నెలలో చుక్కలు చూడని కన్నులలో
 మావుల కొమ్మల ఊగిన కోయిల వేణువు లూడిన గీతికలు
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో

అందాలన్నీ అందే వేళ, బంధాలన్నీ పొందే వేళ

కన్నుల్లో గంగా యమునా పొంగేనులే, కౌగిట్లో సంగమమేదో సాగేనులే
కోరికలే సారికలై ఆడిన పాడిన సందడిలో
మల్లెల తావుల పిల్లన గ్రోవులు పల్లవి పాడిన పందిరిలో
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో
          
      ఇంత టిపికల్ కంపోజిషన్ నా జీవితంలో నేనెప్పుడూ వినలేదు. హ్యాట్సాఫ్ టు ఇళయరాజా! నాకు తెలిసినవి, విన్న ప్రతిసారీ  మైమరచిపోయే కొన్ని పాటలు ఇవి...

* చెలీ రావా వరాలీవా (మౌనరాగం)
* ఆవేసమంతా ఆలాపనేలే, ప్రియతమా తమ సంగీతం (ఆలాపన)
* ఏవేవో కలలు కన్నాను (జ్వాల)
* రేగుతున్నదొక రాగం (డాన్స్ మాస్టర్)
* పాటగా నాలో పరువాలు పలికే (క్షత్రియుడు)
* మిడిసిపడే దీపాలివి (ఆస్తులు-అంతస్తులు)
* ఆగిపో ఆగిపో కాలమా ఆగిపో (ఆరాధన)
* మూగైనా హృదయమా (ఆత్మబంధువు)
* ఏమనినే మది పాడుదునో (మంత్రిగారి వియ్యంకుడు)
* రాసలీల వేళ రాయబారమేల (ఆదిత్య 369 )
* సుందరీ నువ్వే నేనంట (దళపతి)
* కురిసెను విరిజల్లులే  (ఘర్షణ)
* సంధ్యారాగపు సరిగమలో (ఇంద్రుడు చంద్రుడు)
* ఆకాశం మేఘాలు మూసే వేళల్లో (కోకిల)
* ఏ ఊహలోనో తేలానేమో (శివ 2006)
* పచ్చా పచ్చని కల వేసే బంగారు వల (తూర్పు సింధూరం)
* ఏనాడు విడిపోని ముడి వేసెనే (శ్రీ కనక మహాలక్ష్మి డాన్స్ ట్రూప్)

ఇలా చెప్పుకుంటూ పోతే ఆ మధుర గీతాల లిస్టుకు అంతు వుండదు. ఇళయరాజాపై నాకున్న అభిమానానికి కొలమానమూ వుండదు.