Thursday, June 24, 2010

విలన్ ఏమంటున్నాడు?


నటీనటులు: విక్రమ్, ఐశ్వర్యారాయ్, పృథ్విరాజ్, కార్తీక్, ప్రభు, ప్రియమణి తదితరులు.
కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మణిరత్నం
నిర్మాతలు: మణిరత్నం, శారద త్రిలోక్
సంగీతం: రెహమాన్
మాటలు: శ్రీరామకృష్ణ
పాటలు: వేటూరి
సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్, మణికండన్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
ఆర్ట్: సమీర్ చంద్ర

మణిరత్నం సినిమా అనగానే ఆత్రుతగా ఎదురుచూసే ప్రేక్షకుల ఆశలపై నీళ్ళు చల్లేసింది రావన్ సినిమా. అద్భుతమైన నటనా పటిమను ప్రదర్శించే విక్రమ్, అందాలరాశి ఐశ్వర్యా రాయ్ కాంబినేషన్, నంబర్ వన్ దర్శకుడు మణిరత్నం, సంగీత సామ్రాట్ రెహ్మాన్... ఇవేవీ రావణుడి వోటమిని ఆపలేకపోయాయి. తెలుగులో విలన్ గా విడుదలైన ఈ చిత్రం అభిమానుల తిరస్కారానికి గురయ్యింది. క్లారిటీ లేని కధనం, కధకు ఏమాత్రం బలం చేకూర్చలేకపోయిన మాటలు, ఎంతమాత్రం ఇంపుగా లేని సంగీతం... అన్నీ కలిసి సినిమాని చతికిలబదేలా  చేసాయి.
            అటవీ ప్రాంతాల్లో ఉండే సంఘ విద్రోహ శక్తి వీర (విక్రమ్‌). ఆ అటవీ ప్రాంతంలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతుంటాడు. పోలీసులను సజీవ దహనం చేయడం, ఎదురు తిరిగితే ఉప్పు పాతరెయ్యడం వంటివి చేస్తుంటాడు. (ఈ పాత్ర కాస్త వీరప్పన్ ను తలపోస్తుంది.) ఆ ప్రాంతానికి వచ్చిన సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ దేవ్‌ (పృథ్విరాజ్‌) వీరను చంపడమే లక్ష్యం గా పెట్టుకుంటాడు. పోలీస్‌ల కారణంగా వీర చెల్లెలి (ప్రియమణి) జీవితం నాశనం అవుతుంది. ఆ పగతో రగిలిపోతున్న వీర... దానికి ప్రతిగా దేవ్‌ భార్య రాగిణి (ఐశ్వర్య)ని కిడ్నాప్‌ చేసి తన స్థావరానికి తీసుకొస్తాడు. 14 రోజులు రాగిణిని బంధించి పోలీసులతో యుద్ధానికి దిగుతాడు. తర్వాత ఏం జరిగిందన్నది మిగతా కథ.
           రామాయణాన్ని ఆధునకరీస్తూ రావణుడిని హైలెట్ చేస్తూ వచ్చిన ఈ చిత్రంలో పాత్రల గాఢత అంతగా కనపడదు. దానికి కారణం పాత్రలను వాటి వాటి నేఫద్యాల్లో ఎస్టాబ్లిష్ చేయకపోవటమే. ఇంటర్వెల్ అయ్యేదాకా విక్రమ్ అస్సలు ఐశ్వర్య రాయ్ ని ఎందుకు కిడ్నాప్ చేసాడు...ఆమె ద్వారా అతను ఏం సాధిద్దామనుకున్నాడు...అతను ఏం నష్టపోయాడు..ఏం లాభం పొందుదామనుకున్నాడనేది స్పష్టం కాదు. సినిమాలో ఎంటర్‌టైనర్‌మెంట్‌ పూర్తిగా లోపించింది. పాత్రల్లో ఎమోషన్‌ శృతి మించింది. నటీనటుల నటనాకౌశలం చూపడం కోసమే సినిమా తీసినట్టుంది. సంభాషణలు చాలా చాలా  పేలవంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్: వీరయ్య పాత్రలో విక్రమ్ అద్భుతంగా రాణించాడు. అతని హావబావాలు అమితంగా ఆకట్టుకుంటాయి. ఐశ్వర్యారాయ్ తన పాత్రకు నూరు శాతం న్యాయం చేసింది. కాస్త డీ గ్లామరైజ్డ్ గా వున్న ఎంతో అందంగా కనిపించింది.  ఆమె అందం చిత్రానికి నిండుదన్నాన్నించింది. ప్రభు, కార్తీక్ కీలకమైన పాత్రల్లో బాగా చేశారు. ప్రియమణి కూడా తన వంతు మెప్పించింది. పృథ్విరాజ్ కూడా పరవాలేదనిపించాడు. ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ప్రాణం. అడవుల చిత్రీకరణ అద్భుతంగా వుంది. పచ్చని ప్రకృతిని తెచ్చి స్క్రీన్ మీద పరిచినట్టుగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో రీ రికార్డింగ్ కూడా చాలా బాగుంది.

మైనస్ పాయింట్స్: సినిమాకి అతి పెద్ద మైనస్ డైలాగ్స్. నటీనటుల పెదవుల కదలికకు, సంభాషణలకు సంబంధం వుండదు. దానితో అసలు ఏమి మాట్లాడుకుంటున్నారో అర్ధం కానీ పరిస్తితి. ఇది చాలా విసుగు తెప్పిస్తుంది. ఎక్కడా పంచ్ డైలాగులు కానీ, ప్రేక్షకులకు ఉత్సాహాన్ని కలిగించే మాటలు కానీ లేవు. ఏదో మాట్లాడుతున్నారులే అనుకోవాలి. పాటలు కూడా వినసొంపుగా లేవు. రెహ్మాన్ సంగీతం సినిమాకు ఏ విధంగానూ ఉపయోగపడలేదు. మొత్తంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంతా బోర్.  హీరోయిన్ తప్పించుకోవలనుకోవటం, విలన్ కి దొరికిపోవటం తప్ప ఏమి కధ వుండదు. సెకెండ్ హాఫ్ కాస్త పరవాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు. ప్రేక్షకుడిని మళ్ళీ మళ్ళీ థియేటర్ కి రాప్పించనూ లేదు. 

2 comments: