ఒక్కసారి ఒకటి నమ్మితే ప్రాణం పోయినా అభిప్రాయం మార్చుకోని వాళ్ళు చాలామంది వుంటారు. తాము నమ్మే పిచ్చినే వేదం అనుకునే వెర్రివాళ్ళూ వుంటారు. కాని అది మంచిది కాదని ప్రపంచమంతా కోడై కూస్తున్నాకాదని వాదించే వాళ్ళను ఏమనాలో వాళ్ళనే అడగాలి. వాళ్ళు ఎవరో కాదు... ఆట పేరెంట్స్. ఒక పక్క మానవ హక్కుల సంఘం, మరో పక్క సేవాసంఘాలు మీ పిల్లలకు ప్రమాదం అని హెచ్హరిస్తున్నావినకుండా మొండిగా వాదించటం చూస్తే ఆశ్చర్యం వేస్తోంది.
పిల్లలతో పిచ్చి పిచ్చి దుస్తులు వేయించటం, పెద్దవాళ్ళ తరహాలో హావ భావాలను పలికేలా చేయటం వాళ్ళ మానసిక ప్రవ్రుతిని దెబ్బ తీస్తుందని మానసిక తత్వవేత్తలు గోల పెడుతుంటే, మా పిల్లల గురించి మాకు తెలుసంటూ అడ్డంగా వాదించటం చాలా వింతగా వుంది. పిల్లల గురించి వారికి తెలియదనో, పిల్లల మీద ప్రేమలేదనో కాదు చెప్పింది. మీకు తెలియకుండానే మీ పిల్లలకు హాని చేస్తున్నారని గుర్తు చేయాలని ప్రయత్నిచింది మానవ హక్కుల కమిషన్. అది అర్ధం చేసుకోకుండా వాదించటం హాస్యాస్పదం.ఈ విషయం గురించి చర్చించటానికి టీవీ చానల్ వాళ్ళు పిలిస్తే ఆ పిల్లల తల్లులు, మెంటర్ చేసిన రభస అంతా ఇంతా కాదు. మర్యాదలు పాటించకపోవటం అటుంచి, సమస్య గురించి మాత్లాడుతున్న సామాజిక సేవా కార్యకర్తని హేళన చేయటం అమానుషం. ఇలాంటి ప్రవర్తనను ఎవరూ ప్రోత్సహించకూడదు. ఛానల్ వారు దీనిని వెంటనే ఖండించి వుండాల్సింది.
పిల్లల టాలెంట్ వెలుగు చూడటానికి ఆ ప్రోగ్రాం మంచి వేదికే. దాన్ని ఎవరూ కాదనరు. కాని మిగిలిన విషయాలు కూడ ఆలోచించాలి కదా! చిన్నారుల ఆహార్యం దగ్గరనుంచి అసభ్య నృత్య భంగిమలు, హావభావాలతో వాళ్ళు గెంతులు వేస్తుంటే, జడ్జిలు, మెంటర్లు చప్పట్లు కొట్టటం చూస్తే వొళ్ళు మండిపోతుంది. అది చాలదన్నట్లు తీవ్రమైన వాగ్వాదాలు, వయసుకు మించిన చాలెంజ్ లు చూస్తూంటే అసహ్యమేస్తుంది. హాయిగా చదువుకొని,నవ్వుకుంటూ ఎదగాల్సిన బాల్యం డాన్స్ మాస్టర్ల కౄర శిక్షణకు బలైపొతోంది. వారి బాల్యంతో చెలగాటమాడుతున్న యిటువంటి రియాల్టే షోలను ప్రసారం చేయకుండా వుండాల్సిన బాధ్యత టీవీ చానెళ్ళకు ఎంతైనా వుంది. ఆ బాధ్యత మర్చిపోయిన చానెళ్ళపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
డాన్సు నేర్చుకోవడాన్ని ఎవరూ కాదనరు. కాని డాన్సు పేరుతో పిల్లల మీద ఇంతటి ఒత్తిడిని కలిగించటం ఎంతవరకూ సమంజసమో తల్లిదండ్రులు అలోచించి తీరాలి. వాళ్ళ బంగారు భవితను ఇలాంటి షోల పాలు కాకుండా జాగ్రత్త పడాలి. పిల్లలకు వారి బాల్యాన్ని ఆనందించే అవకాశాన్ని కల్పించాలి. అలా కల్పించటం తమ బాధ్యతని ప్రతి తల్లి, తండ్రి గుర్తించాలి. అలా గుర్తించని తల్లిదండ్రులను కఠినంగా శిక్షిస్తేనే తప్ప, పసివారి పండంటి జీవితాలతో ఆటలాదుతున్న ఇలాంటి షోలు, చానెళ్ళ ఆగడాలకు అంతం వుండదు.
No comments:
Post a Comment