Tuesday, May 4, 2010

మంచి సినిమా.. మంచిని తెలిపిన సినిమా..!

ఆ మధ్య సినిమా చూద్దామని వెళ్ళాను. షాక్ తిన్నాను. ఎందుకంటే చూడటానికి అక్కడ ఒక్క సినిమా కూడా లేదు. అన్నీ హిందీ, ఇంగ్లిష్ సినిమాలే. విసుగేసి వేరే చోటికి వెళ్ళాను. అక్కడా ఇదే పరిస్తితి. చాలా బాధ వేసింది. చూద్దామంటే సినిమా లేని దౌర్భాగ్యపు స్తితిలో తెలుగు ప్రేక్షకుడు వున్నందుకు సిగ్గు వేసింది. ఏమి చేయాలో అర్ధం కాక సీడీ షాప్ కి వెళ్ళి, రెండు సీడీలు కొనుక్కుని ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రెండు సీడీల్లో ఒకటి... గ్రహణం.
నిజంగా చాల గొప్ప సినిమా. మూఢ నమ్మకాలు మనిషిని ఎంతకు దిగాజార్చుతాయో, వాటి వల్ల అమాయకుల జీవితాలు ఎలా అస్తవ్యస్తమవుతాయో తెల్పుతూ ప్రముఖ రచయిత చలం రాసిన కథ 'దోషగుణం'. దాని ఆధారంగా ఈ సినిమా తీసారు. ఒక చిన్న కథని సినిమాగా తీయాలంటే ఎంతో కష్టం. మూల కథ చెడకుండా జాగ్రత్తగా చూపించాలి. లేకపోతే మూల కధ లోని అసలు భావం చెడిపోతుంది. అలా చెడకుండా సినిమా తీయాలంటే ఎంతో ఆలోచన, శ్రమ కావాలి. ఆ విషయంలో ఇంద్రగంటి మోహనకృష్ణ ప్రతిభని కొనియాడి తీరాలి.


ఇక కధలోకి వెళ్తే, ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న ఒక రోగి “తల్లినం”టూ వచ్చిన స్త్రీని దుర్భాషలాడి బయటకి పంపేయడం చూసిన ఓ డాక్టర్ ఆమెను అనుసరిస్తాడు. వివరాలు కనుక్కొందామని ఆరా తీసేసరికి ఆమె కంగారుగా వెళ్లిపోతుంది. వెంటనే ఆసుపత్రిలో ఉన్నవారిని ఆమె గురించి ఆరా తీస్తే కొద్దిపాటి సమాచారం తెలుస్తుంది. ఇంటికి వచ్చిన తన స్నేహితునితో ఓ కథ చెప్పటం మొదలెడతాడు. అతను పుట్టి పెరిగిన ఊర్లో నారాయణస్వామి అనే భూస్వామి ఉండేవాడు. అతని భార్య శారదాంబ అందగత్తె. అత్తగారినీ, భర్తనీ, ఆస్తిపాస్తుల్నీ జాగ్రత్తగా చూసుకుంటుంది. కటిక పేదకుటుంబానికి చెందిన కనకయ్య అనే అబ్బాయి వాళ్ళ ఇంట్లో వారాలకి కుదురుతాడు. తెలివైన ఆ కుర్రాడంటే భూస్వామికీ, అతడి భార్యకీ కూడా చాలా ఇష్టం! అయితే ఉన్నట్టుండి ఆ కుర్రాడు జబ్బు పడతాడు. ఊర్లో ఉన్న వైద్యునికి చూపిస్తారు. గుణం కనిపించకపోగా, జబ్బు ముదురుతుంది. తల్లిదండ్రులు కంగారుపడి ఒక మంత్రగాడికి చూపిస్తారు. “వచ్చింది మామూలు జ్వరం కాదు, దోషగుణం. తనకన్నా వయస్సులో పెద్దదైన స్త్రీతో కలవడం వల్ల ఈ జబ్బు వచ్చింది. ఆమె రక్తంతో చేసిన మందు కంటిలో పెడితే నయం అవుతుంది” అని చెప్తాడు. ఇది విన్న కుటుంబ సభ్యులు అవాక్కవుతారు. నిద్రలో కుర్రాడు శారదాంబ పేరు పలవరిస్తాడు.  పిల్లాడి జబ్బుకు కారణం ఆమేనని నిర్ధారణకు వస్తారు కనకయ్య కుటుంబ సభ్యులు. జబ్బు ముదురుతుంది. భూస్వామికి కూడా తన భార్య మీద అనుమానం కలుగుతుంది. దాంతో ఆమె మీద నింద మోపుతారు. నారయణస్వామి కూడా ఆ నిందను నమ్ముతాడు. తిరగబడిన భార్యను కొడతాడు. ఆమె రక్తం తీసి ఇస్తాడు. ఊహించని విధంగా పిల్లాడి జబ్బు నయమవుతుంది. దాంతో శారదంబ మీద వేసిన నింద నిజమవుతుంది. ఆమెను ఇంటినుంచి గెంటేస్తాడు భర్త. అప్పటి ఆ కనకయ్యే ఈ డాక్టర్. ఈ కధంతా చెప్పి ఆమె కోసం వెతుకుతాడు. కాని ఆమె మళ్ళీ కనిపించదు. అతడు ఆమె కోసం ఎదురు చూస్తున్నట్టుగా చూపించి సినిమా ముగించాడు డైరెక్టర్.


తనికెళ్ళ భరణి నటన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన తరహాలో నారాయణ స్వామి పాత్రను అద్భుతంగా పండించారు. ఇక శారదాంబ పాత్రలో జయలలిత నటన గురించి చెప్పుకోవాలి. వ్యాంప్ పాత్రలు వేసే ఆ జయలలితేనా ఈమె అనిపించింది. ఆ పాత్రలో అంతగా ఒదిగిపోయిందామె. కనకయ్య గా మోహనీష్ బాగా చేసాడు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేసారు.


చిన్న చిన్న సంభాషణలతో, చక్కని స్క్రీన్ణ్ ప్లేతో ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు. అక్కర్లేని సంభాషణలు, పనికిరాని దృశ్యాలు లేవు. ముఖ్యంగా ముగింపు అద్భుతం. ఊహించని విధంగా సినిమాను ముగించారు.  విజయ్ సంగీతం కూడా చాలా బాగుంది. పాటలు లేవు కాని సన్నివేశాలకు బలాన్ని చేకూర్చింది ఆయన సంగీతం.


ఒక్క మాటలో చెప్పాలంటే మూఢ నమ్మకాల చీకట్లో మగ్గిపోతున్న వారికి ఈ చిత్రం ఒక మంచి గుణపాఠం. చలం కధ నేను చదవలేదు కాని ఈ సినిమా చూసి చాలా వుద్విగ్నతకు లోనయ్యాను. ఒక చక్కని సందేశాన్ని ఆసక్తికరంగా అందించారు. సున్నితమయిన బంధాలను జాగ్రత్తగా కాపాడుకోకపోతే పరిస్తితులు ఎలా మారతాయో అందంగా చూపించారు. అదే ఈ సినిమాకు అవార్డులను తెచ్చి పెట్టింది. ఇలాంటి ఒక చక్కని సందేశాత్మక చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన మోహనకృష్ణ అభినందనీయుడు.


ఏదేమైనా చాలా కాలం తరువాత ఒక మంచి సినిమాను చూసే భాగ్యాన్ని కలిగించిన గ్రహణం యూనిట్ కు మనస్పూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నా!

No comments:

Post a Comment