Tuesday, May 25, 2010

మూగవోయిన మధురవీణ


సెంచరీలు కొట్టే వయస్సు మాది అంటూ పాట రాసిన ఆ మహాకవి డెభ్భై నాలుగేళ్ళకే తనువు చాలించాడు. తెలుగు సినిమా సాహిత్యసీమలో పాటల పూదోట విరబూయించిన ఆ మహనీయుడు పరలోకానికి పయనమయ్యాడు. అశేష ప్రజానీకాన్నీ తన అక్షరాల గుభాలింపుతో ముగ్ధుల్ని చేసిన వేటూరి భువిని విడిచి దివికి చేరిపోయాడు. కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా పాటను మన జీవితాల్లో ఒక భాగాన్ని చేసిన కలం కదలికలు శాశ్వతంగా ఆగిపోయాయి.

      ఆ కలం అమ్మలా జోల పాడింది. ఆ కలం నాన్నలా నీతిని నేర్పింది. ఆ కలం కన్నీళ్ళ కళ్ళాపి చల్లింది. ఆ కలం నవ్వుల జల్లు కురిపించింది. ఆ కలం కలల కవాటాలు తెరిచింది. ఆ కలం విషాదానికి విడిదిగా మారింది. ఏ భావాన్ని పలికించినా, ఏ రాగానికి అక్షరాలతో సొబగులు అద్దినా ప్రతి పదంలోనూ వేటూరి శైలి కదం తొక్కుతుంది. ప్రతి మాటలోనూ భాషకు సైతం అందని భావమేదో దోబూచులాడుతుంది. తెలుగు సినిమా సాహిత్య లోకంలోకి పిల్ల తెమ్మెరలా వచ్చి ప్రభంజనమై పోయాడు. అలతి అలతి పదాలతో అభిమానుల హృదయాల్లో పీట వేసుకుని కూర్చున్నాడు. అలసిన మనసులకు తన మాటలతో సేద తీర్చాడు. గాయపడిన హృదయాలకు పదాలతో వైద్యం చేసాడు. మండిన గుండెలకు తన అక్షరాలతో ఆవేశాన్ని ఆజ్యంగా పోసాడు. కలాన్ని కత్తిలా దూసాడు... సాహితీప్రియుల హృదయ సామ్రాజ్యాల్ని గెలుచుకున్నాడు.

       వింత వింత పద ప్రయోగాలతో తెలుగు బాషకు కొత్త సొబగులను అద్దిన వీరుడు వేటూరి. తన మాత్రుబాషకు జాతీయ హోదా ఇవ్వలేదన్న కోపంతో జాతీయ అవార్డును తోసిపుచ్చిన ధీరుడు వేటూరి. ఆయన కలం పదునుకు అక్షరాల కుత్తుకలు తెగిపడతాయి. భారమైన భావాల మడుగులో పడి ఊపిరాడక విలవిలలడతాయి. అయినా ఆయన జాలి చూపలేదు. తన అక్షర అస్త్రాన్ని శ్రోతల హృదయాలకు గురిపెట్టక మానలేదు. భువనానికి వేణువై వచ్చానన్నాడు. గగనానికి గాలిని పోతానన్నాడు. మనసును తుల్లిపడకంటూ వారించాడు. అతిగా ఆశపడకు అంటూ హితవు పలికాడు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అంటూ నిలదీశాడు. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే అంటూ వేదాంతాన్ని కుమ్మరించాడు. పిల్లనగ్రోవికి నిలువెల్లా గాయలేనంటూ బాధ పడిపోయాడు. ప్రతిరోజూ నీకొక పాఠమే తెలుసుకుంటూ పద అంటూ జ్ఞానబోధ చేసాడు. ఆమనీ పాడవే అంటూ ప్రకృతిని పలకరించి పులకరించాడు. నీ కబళం పడతా... నిను పట్టుకుపోతా అంటూ భయపెట్టి పరుగులెత్తించాడు. ఆకు చాటు పిందేను తడిపి అల్లరి పెట్టాడు. కాటుకలంటుకున్న కౌగిలింత లెంత హాయి అంటూ కుర్రకారుకు గిలిగింతలు పెట్టాడు. నవరసాలనూ తనదైన శైలిలో వొలికించాడు. ప్రతి శ్రోత పెదవిపై తన పదాలను పలికించాడు.  

      అక్షరాలతో మాలికలల్లి కళామతల్లి కంఠాన్నిఅలంకరించిన వేటూరి కళ్ళు శాస్వతంగా మూతబడ్డాయి. ఆయన సృష్టించిన అద్భుత సాహితీ సౌరభాన్ని ఎన్నో ఏళ్ళుగా ఆస్వాదిస్తోన్న అభిమానుల మనోవీణా తంత్రులు తెగిపోయాయి. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాదీ వెన్నెలమ్మ అన్నాడాయన. అలాగే ఎందఱో రచయితలు వస్తారు కానీ వేటూరి మాత్రం రారు. ఎప్పటికీ రారు.
 

1 comment:

  1. నేను ఆదివరం సాయంత్రం పేపర్ చూస్తోంటే వేటూరి అంత్యక్రియలు పూర్తి అన్న న్యూస్ చూసి షాక్ నేను.అసలు ఆయన పోయినట్లే తెలీదు నాకు అప్పటిదాకా.ఆత్మీయుడిని కోల్పోయిన భావన కలిగింది నాలో.కాసేపు అలా ఉండిపోయాను ఆయన పాటలు గుర్తుకు వచ్చి.నిజంగా మనము గొప్ప రచయితని కోల్పోయాము.ఎన్ని ఆణిముత్యాలు అసలు ఆయన చేతుల్లోనుండి.

    నా అభిమాన దర్శకుడు మణిరత్నం గారి ఆస్థాన రచయిత ఆయన. అసలు ఎంత బాగుంటాయి ఆయన గీతాలు.

    ReplyDelete