Friday, May 21, 2010

ఎలా జరిగిందబ్బా!

కొన్ని సంఘటనలు యాదృచ్చికంగా జరిగిపోతూ వుంటాయి. అమితాశ్చర్యాన్ని కలుగజేస్తాయి. అలా ఎలా జరిగిందబ్బా అని జుట్టు పీక్కునేలా చేస్తాయి. అలాంటి కొన్ని సంఘటనలు ఇవి...

* అది 1893 వ సంవత్సరం. హెన్రీ జిగ్లాండ్ అనే వ్యక్తి తన గాళ్ ఫ్రెండ్ కి ఏదో కారణంతో గుడ్ బై చెప్పేసాడు. అది ఆమె తట్టుకోలేకపోయింది. అతను లేని జీవితం వద్దనుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలియగానే ఆమె అన్న, హెన్రీ ఇంటికి వెళ్ళాడు. గన్ తీసి గార్డెన్ లో కుర్చుని వున్న హెన్రీని షూట్ చేసాడు. అయితే హెన్రీ త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ తుపాకీ గుండు తిన్నగా వెళ్లి ఒక చెట్టులోకి చొచ్చుకుపోయింది.

         అది 1913 వ సంవత్సరం. తన గార్డెన్లో వున్న కొన్ని చెట్లను నరికి పారేయాలనుకున్నాడు హెన్రీ. ఒక పెద్ద చెట్టును కూల్చటానికి డైనమైటును అమర్చాడు. అది పేలింది. అంతే... ఒక్కసారిగా పెద్దగా అరిచి కుప్ప కూలిపోయాడు హెన్రీ. కారణం... ఇరవయ్యేళ్ళ క్రితం తన ప్రేయసి అన్న పేల్చిన తూటా అదే చెట్టులో ఇరుక్కుంది. ఇప్పుడు అది బయటికి వచ్చి హెన్రీ గుండెల్లోకి దూసుకుపోయింది. దేవుడు ఆ తూటా మీద హెన్రీ పేరు రాసి పారేసాడు కాబోలు. అందుకే ఇరవయ్యేళ్ళ తర్వాత అయినా అది తన బాధ్యత తను నెరవేర్చింది.

* 1960, డిసెంబర్ 5 ... ఫ్రాన్సులోని డోవర్ జలసంధిలో ఒక ఓడ మునిగిపోయింది. అందరూ చనిపోయారు, ఒక వ్యక్తి తప్ప. అతని పేరు హ్యూ విలియమ్స్.
1767 , డిసెంబర్ 5 ... అదే జలసంధిలో మళ్లీ ఒక ఓడ మునిగిపోయింది. 127 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తప్ప. ఆ ఒక్కరి పేరు హ్యూ విలియమ్స్.
1820 , ఆగష్టు 8 ... థేమ్స్ నదిలో ఒక పడవ మునిగిపోయింది. ప్రాణాలతో మిగిలిన ఒకే ఒక వ్యక్తి హ్యూ విలియమ్స్.
1940 , జూలై 10 ... జర్మన్ సైన్యం ఒక బ్రిటిష్ నౌకను నాశనం చేసింది. ఒక వ్యక్తి, అతని మేనల్లుడు మాత్రమే మిగిలారు. అదేం విచిత్రమో... ఆ ఇద్దరి పేరూ హ్యూ విలియమ్సే.

* 1996 ... ప్యారిస్...
అర్ధరాత్రి పోలీసులకు యాక్సిడెంట్ అయ్యిందని ఒక ఫోన్ వచ్చింది. పోలీసులు వెంటనే ఆ ప్రదేశానికి వెళ్లారు. రెండు కార్లు గుద్దుకుని తుక్కుతుక్కు అయిపోయాయి. డ్రైవ్ చేస్తున్న ఇద్దరూ చనిపోయారు. వారిలో ఒకరు ఆడ, ఒకరు మగ. ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళిద్దరూ భార్యాభర్తలని తేలింది. అంతకన్నా విచిత్రమయిన విషయం ఏమిటంటే, అప్పటికి ఎన్నో నెలల క్రితమే వాళ్ళిద్దరూ విడిపోయారట. అంతే ఇప్పుడు ఒకరికి తెలియకుండానే ఒకరు బయటకు వచ్చారు. ఒకరి కారును ఒకరు గుద్దుకుని చనిపోయారు. ఈ విషయం అర్ధమవగానే పోలీసులు చాలా ఆశ్చర్యపోయారట.
      పాపం... కలసి జీవించలేదు కానీ కలసి జీవితాన్ని చాలించారు కదూ!

* 1990 ... నార్త్ వేల్స్
పదిహేనేళ్ళ పిల్లాడు పదో తరగతి పరీక్ష రాయటానికి కూర్చున్నాడు.
ఆ పిల్లాడి పేరు... జేమ్స్ బాండ్.
అతని రోల్ నంబర్... 007

* ఈ సంఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది.
ఒక సభలో ప్రసంగించటానికి ఒక ప్రముఖ వ్యాపారవేత్త వచ్చాడు. అతని పేరు డేనీ డే. ఆరోజు అతను 'చావు ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి మనమే జాగ్రత్తగా వుండాలి' అనే టాపిక్ మీద అనర్గళంగా మాట్లాడాడు.
స్పీచ్ ముగిసింది. మాట్లాడి అలసిపోయిన డేనీ ఒక పెప్పర్ మింట్ తీసుకుని నోట్లో వేసుకున్నాడు. అది కంఠానికి అడ్డుపడి అక్కడికక్కడే చనిపోయాడు.

     చరిత్రను తవ్వడం మొదలు పెడితే ఇలాంటి విచిత్రాలు, నమ్మలేని నిజాలు ఎన్నో బయట పడతాయి. ఇంటర్నెట్ సాగరాన్ని మదిస్తున్నపుడు నాకు తెలిసిన, నన్నెంతో ఆశ్చర్యపరిచిన కొన్ని విషయాలివి.  

2 comments: