Wednesday, January 28, 2015

ఇప్పటికైనా నోరు విప్పండి బాస్!


చెన్నై నుంచి హైదరాబాద్ వస్తోన్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సులో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. బస్సు కాలి బూడిదైంది... పొద్దున్న టీవీ పెట్టగానే ఇదే వార్త. అందరికీ ఒక్కసారిగా పాలెం బస్సు ప్రమాదం గుర్తొచ్చేసింది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ప్రైవేటు ట్రావెల్స్ వాళ్లను అదుపు చేయడం లేదు, అందుకే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అంటూ అన్ని వెబ్ సైట్లలోనూ, వార్తా చానెళ్లలోనూ చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వం తమ బస్సులనే పట్టించుకోవడం లేదు. ఇక ప్రైవేటు బస్సులనేం పట్టించుకుంటుంది!
మొన్న నేను శెలవులకు అమలాపురం వెళ్లాను. తిరిగి రావడానికి ప్రైవేటు బస్సు ఎక్కడం ఇష్టం లేక ఆర్టీసీ బస్సు ఎక్కాను. డ్రైవర్ వెనుకగా ఉండే వరుసలో మొదటి సీటు నాది. పక్కనే ఉన్న సింగిల్ సీటులో ఓ వ్యక్తి కూర్చున్నాడు. అతడు రాగానే మందు వాసన గుప్పుమంది. ముసలోడు, తాగి ఉంటాడులే అని పట్టించుకోలేదు. బస్సు బయలుదేరి, లైట్లు ఆర్పిన తర్వాత వాడు చేస్తోన్న పని చూసి మతి పోయింది నాకు. చక్కగా ఓ గ్లాసు తీసి, సీసాలోంచి మందు గ్లాసులోకి ఒంపుకుని, వాటర్ ప్యాకెట్ చింపి నీళ్లు కలుపుకుని మరీ తాగుతున్నాడు. మధ్యమధ్యలో వాగుతున్నాడు కూడా. ఎవరూ గుండె గుభేల్ మంది. తాగుబోతువాడు ఎప్పుడెలా ప్రవర్తిస్తాడో ఎవరికి తెలుసు? అందుకే తర్వాతి స్టాప్ వచ్చేవరకూ ఆగి, అక్కడ బస్ ఆగినప్పుడు డ్రైవర్ కు విషయం చెప్పాను. అతణ్ని దింపేయమని చెప్పాను. కానీ డ్రైవర్ దింపలేదు. ఎందుకంటే వాడు రిజర్వేషన్ చేయించుకోలేదు. సీటు ఖాళీ ఉంది కదా అని డ్రైవర్ ఆ సీటును అతనికి అమ్మేశాడు. నాకు తెలిసి ఆ డబ్బులు అతనికే మిగులుతాయి. దిగమంటే అతడు డబ్బులు తిరిగివ్వమంటున్నాడు, ఎలా ఇస్తాను, ఇక తాగడులెండి అని నాకే సర్దిచెప్పాడు తప్ప వాడిని దింపలేదు. అతనీ మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను గమనించిందేమిటంటే... అతడూ తాగి ఉన్నాడు. అనుమతి లేకపోయినా లగేజీ వేసుకోవడం, కరెంటు తీగలకు తగిలేలా బస్సుల మీద పెద్ద పెద్ద మూటలు ఎక్కించుకోవడం, డబ్బుకు ఆశపడి సీట్లు లేకపోయినా ఇనుప కుర్చీలు వేసి మరీ జనాన్ని కూర్చోబెట్టుకోవడం, తాగి నడపడం వంటి తప్పులు ప్రైవేటు బస్సులే కాదు, ఆర్టీసీ బస్సుల విషయంలో కూడా జరుగుతోంది. దానికి కారణం ఎవరో కాదు... మనమే.
ఆ రోజు జరిగిన మొత్తం వ్యవహారంలో నాకు ఆ తాగినవాడి మీద, డ్రైవర్ మీద కంటే చుట్టూ ఉన్నవాళ్లమీద కోపమొచ్చింది. నేను కోప్పడుతున్నా, ఇదేం అన్యాయం అని నిలదీస్తున్నా ఒక్కరు కూడా నాతో గొంతు కలపలేదు. చాలామంది యువకులు ఉన్నారు. వాళ్లు కూడా పట్టించుకోలేదు. నేను తాగాను, అయితే ఏంటి, నిన్నేమైనా చేశానా అని ఆ తాగుబోతు నామీదే అరుస్తున్నా ఒక్కరూ నోరు మెదపలేదు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఎంతసేపూ ప్రభుత్వం సరిగ్గా లేదు అని లెక్చర్లు ఇస్తాం తప్పితే, సరిగ్గా లేనప్పుడు ఎవరు ప్రశ్నిస్తున్నాం! అడిగితే అవతలివాడు తిరగబడతాడేమోనని భయం. అందుకే మనకెందుకొచ్చిన గొడవ అని వదిలేస్తారు. ఆరోజు వాడి తాగిన మత్తులో నిజంగానే ఏదైనా రాద్దాంతం చేసివుంటే? ఏ ప్రమాదానికో కారకుడై ఉంటే? ఇవాళ జరిగిన బస్సు ప్రమాదానికి కారణం బస్సులో ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లడమేనని ప్రయాణీకులు చెప్పారు. మరి అలాంటి వాటిని ఎక్కిస్తున్నప్పుడు వాళ్లు ఎందుకు అడ్డుకోలేదు? ఎవరూ అడ్డుకోరు. ఇదేం పని అని అడగరు. ఏదైనా జరిగిన తర్వాత చింతిస్తారు.
కనీసం అప్పుడప్పుడైనా నోరు విప్పండి బాస్. తప్పు చేసేవాడిని ఏంట్రా నువ్వు చేస్తున్న పని అని ఒక్కసారి ప్రశ్నించండి. అలా అడగకే ప్రతివాడూ మనకు కీడు చేస్తున్నాడు. మోసం చేస్తున్నాడు. బాధ పెడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే మనల్ని లోకువ చేస్తున్నాడు. రూపాయి తక్కువైతే టిక్కెట్ ఇవ్వను బస్సు దిగమని చెప్పే కండక్టర్... మనకు రూపాయి ఇవ్వాల్సి వస్తే చిల్లర లేదు ఏం చేయమంటావ్ అంటూ అరుస్తాడు. మనం ఎక్కకపోతే బతుకు గడవని ఆటోడ్రైవర్... వాడి స్థాయి ఏంటో మర్చిపోయి మన అక్కల్నీ చెల్లెళ్లనీ చూసి విజిలేస్తుంటాడు. షాపువాడు తాను ఇచ్చింది మూసుకుని తీసుకోమంటున్నాడు. నచ్చకపోతే పొమ్మంటున్నాడు. ఇవన్నీ మనం అన్యాయాన్ని ప్రశ్నించకపోవడం వల్లే. తప్పు చేసినవాడిని నిలదీయకపోవడం వల్లే. మనం ఒక్కరం మాట్లాడటం వల్ల సమాజం మారిపోకపోవచ్చు. కానీ కనీసం ఒక్కడైనా భయపడి తప్పు చేయడానికి వెనక్కి తగ్గితే చాలు. మనల్ని చూసి మరొక్కరు చెడును ప్రశ్నించేందుకు ముందుకొస్తే చాలు. ఆ ఒక్కరూ ఒక్కరూ కలిసి వందలు, వేలు, లక్షలు అవుతారు. కొన్ని తప్పులనైనా జరగకుండా ఆపగలుగుతారు.

Friday, August 16, 2013

అందరూ ఈమెలా ఉంటే...

జీవితం కొందరికి పూల పాన్పులా ఉంటుంది. కొందరికి ముళ్ల బాటలా ఉంటుంది. కానీ ముళ్లను కూడా పూలుగా మార్చుకోవడం కొందరికే సాధ్యమవుతుంది. శ్వేతా కట్టి దాన్నిసాధించింది. ఆమె బాల్యం గురించి చదివినప్పుడు చాలా బాధనిపించింది. కానీ ఆమె తర్వాత వేసిన అడుగుల గురించి తెలుసుకున్నాక ఆమె అంటే ఇష్టం కలిగింది. గౌరవం పెరిగింది. అందరు అమ్మాయిలూ శ్వేతలా ఆలోచిస్తే, ఈ లోకంలో ఏ అమ్మాయీ నిస్సహాయురాలిగా మిగిలిపోదేమో అనిపించింది. అందుకే ఆమె కథను అందరిచీ చెప్పాలనుకున్నాను. ఆమె గురించి సాక్షి ఫ్యామిలీ పేజీలో ఆర్టికల్ రాశాను. మీరు చదివే ఉంటారు. ఒకవేళ చదవకపోతే ఇప్పుడైనా ఓసారి చదవండి...



Monday, December 10, 2012

మహా నటుడు



Sunday, September 16, 2012

నట శేఖరుడితో మాటా మంతీ



ఇంటర్వ్యూ కోసం కృష్ణ గారింటికి వెళ్ళాను. పాల నురుగులాంటి తెల్లని పంచె, చొక్కాతో హుందాగా నడచుకుంటూ వచ్చారాయన. నవ్వుతూ పలకరించారు. నవ్వుతూనే అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పారు. 
ఆయనతో మాటా మంతీ ఆనందంగా సాగిపోయింది.

Saturday, August 4, 2012

హెల్త్ ఈజ్ వెల్త్





ఆరోగ్యమే మహాభాగ్యం అన్నరు కదా... మనందరికీ ఆ మహాభాగ్యం దక్కాలని ఎప్పుడో రాసిన ఇవన్నీ పోస్ట్ చేశాను. చదవండి. ఆరోగ్యంగా ఆనందంగా వుండండి. రేపు మరికొన్ని పోస్ట్ చేస్తా.

Friday, August 3, 2012

ఆనవాళ్ళు మరవొద్దంటున్న ఓనమాలు


ఆఫీసు పనుల్లో పడిపోయి ఈమధ్య బ్లాగులో రెండు ముక్కలు రాయడానిక్కూదా సమయం కేటాయించలేకపోతున్నా. ఆ మధ్య ఓనమాలు సినిమా చూసినప్పటినుంచి నా ఫీలింగ్స్ అందరితో పంచుకుందామనుకుంటూనే వున్నా. అది ఇప్పటికి అయ్యింది.
                    ఓనమాలు సినిమాకి మాటలు రాసింది మా సాక్షి ఫ్యామిలీ హెడ్ ఖదీర్ గారు కావటంతో విడుదలకు ముందే సినిమా చూసే అవకాశం మా స్టాఫ్ అందరికీ దొరికింది. ఎప్పుడూ ఎవరు ఎక్కడికి పిలిచినా వెళ్ళని నేను కూడా వెళ్ళాను. దానికి కారణం అదో వైవిధ్యమైన సినిమా అని తెలియడమే. అసలు ఆ పేరే చెబుతోంది ఆ సినిమా ప్రత్యేకమైనదని .
                    భార్య చివరి కోరిక మేరకు కొడుకు దగ్గర వుండటానికి అమెరికా వెళ్ళిన నారాయణరావు మాస్టారు త్న్ మనసును  మాత్రం తన వూరిలోనే వదిలేస్తాడు. తనకు ఒక గుర్తింపుని, తనకంటూ కొన్ని బంధాలని, ఎన్నెన్నో జ్ఞాపకాలని ఇచ్చిన తన ప్రియమైన గ్రామాన్ని తలచుకుని ప్రతిక్షణం కుమిలిపోతుంటాడు. ఎన్నిసార్లు అడిగినా కొడుకు, కొడలు తనని వూరికి పంపించకపోవటంతో మనవల సాయంతో ఇండియాకి వచ్చేస్తాడు. విషయం తెలిసిన కొడుకు తండ్రిని వూరికి చేర్చడానికి ఒక ట్యాక్సీని యేర్పాటు చేస్తాడు. ఆ డ్రైవరుతో కబుర్లు చెబుతూ, గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వూరికి ప్రయాణమవుతాడు  నారాయణరావు.   
                   ఎంతో సంతోషంగా వూళ్ళోకి అడుగుపెట్టిన నారాయణరావు హతాశుడవుతాడు. అది తన వూరేనా అని ఆశ్చర్యపోతాడు. పచ్చగా కళకళలాడే వూరు వెలవెలబోతుంటుంది. సందడి సందడిగా వుండే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఆప్యాయతలకి, అనురాగాలకి నిలయమైన గ్రామంలో మనుషులు కనీసం ఒకరినొకరు పలకరించుకోకుండా టీవీలకు అతుక్కుపోయారు. పచ్చని పొలాలతో, పంట చేలతో అలరారే అక్కడ ఆకలి చావులు చూసి నారాయణరావు అల్లాడిపోతాడు. ఎవరికి వారు రెక్కలొచ్చిన పక్షుల్లా పట్టణాలకు ఎగిరిపోయి పుట్టి పెరిగిన వూరిని మర్చిపోవటం ఆ ముసలి మాస్టారు తల్లడిల్లిపోతాడు. ఎలాగైనా తన వూరికి పూర్వ వైభవాన్ని తీసుకు రావాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఆయన ఎమి చేసాడన్నదే కథ.   
             ఇలా చెప్పుకుంటే ఏముందా కథలో అనిపిస్తుంది. సినిమా చూస్తే మాత్రం చలించని గుండె వుండదు, తడవని కన్ను వుండదు. అంత అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు క్రాంతిమాధవ్. వర్తమానం నుంచి గతానికి, మళ్ళీ గతం నుంచి వర్తమానానికీ కథను నడిపించిన తీరును మెచ్చుకోకుండా వుండలేం. నారాయణరావు మాస్టారిగా రాజేంద్ర ప్రసాద్ నటన అమోఘం. భార్య కల్యాణి, తన విద్యార్థి చనిపోయిన సన్నివేశాల్లో ఆయన నటన చూసి ఏడవని ప్రేక్షకుడు వుండడని నిస్సందేహంగా చెప్పగలను. అలాగే ట్యాక్సీ డ్రైవర్ ఎర్రమంజిల్ గా రఘుబాబు కూడా అద్భుతంగా నటించాడు. మిగిలిన వాళ్ళంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. కాకపోతే హీరోయిన్ కల్యాణి మరీ లావుగా వుంది.     
            అన్నిటికంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది పాటలు, మాటల గురించి. కోటి సంగీతం ద్రుశ్యాలకు మరింత అందాన్ని తెచ్చింది. ఆయన కట్టిన బాణీలకు సిరివెన్నెల సమకూర్చిన సాహిత్యం మనసులని తడుముతుంది. ముఖ్యంగా... పిల్లలూ బాగున్నారా పాట వింటే వున్నపళంగా వెళ్ళి మన వూరిలో వాలిపోవాలనిపిస్తుంది. అంత టచింగ్ గా వుంది. 
         ఇక ఖదీర్ గారు రాసిన మాటల గురించి చెప్పటానికి నాకు వచ్చిన మాటలు చాలవు. అంత బాగా రాశారాయన. సాధరణంగా మనకు తెలిసినవారు ఒక పని చేశారంటే అది ఎలా వుందో చూడాలన్న వుత్సుకత వుంటుంది మనకు. సినిమా చూసేముందు నాకూ అలాగే వుంది. చూసాక మాత్రం, నాకు మాటలే కరువయ్యాయి. ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పకుండా వుండలేకపోయాను. ప్రతి మాటా మన అలోచనా విధానంపై ప్రభావం చూపిస్తుంది. భావోద్వేగాల సుడిలో తోసి వుక్కిరిబిక్కిరి చేస్తుంది.    
         అయితే దయ్యం సినిమాలు లేదంటే వయొలెన్స్ తో వాయించేసే సినిమాలు. కొనాళ్ళుగా ఇవే మనకు దిక్కయ్యాయి. మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ, తీసిన కథలే తిప్పి తిప్పి తీస్తుంటే నాకు మాత్రం చూడలేక కళ్ళు పేలిపోతున్నాయి. సినిమాలంటే పడి చచ్చే నేను, ఏదైనా సినిమా ఫ్లాపయ్యిందని చెబితే ఎందుకు ఫ్లాపయ్యిందో తెలుసుకుందామని ఆ సినిమాకి వెళ్ళి చూసె నేను  చిరాకు పుట్టి కొన్నాళ్ళుగ సినిమాలు చూడటమే మానేశాను. అలాంటి సమయంలో వచ్చింది ఓనమాలు. చచ్చిపోతున్న నా సినిమా ఆసక్తిని మళ్ళీ తట్టి లేపింది. చాలా చాలా నచ్చేసింది. మీరు కుడా తప్పకుందా చూడండి. లేదంటే ఒక మంచి సినిమాని అవమానించినవాళ్ళమవుతాం. మరో మంచి సినిమా తీయలనుకునే దర్శకుడి జిజ్ఞాశను చంపేసిన వాళ్ళమవుతాం. ప్లీజ్... ఒక్కసారి చూడండి. నచ్చితే ఒక అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకుంటారు. లేదంటే మీరు నష్టపోయేదేమీ లేదు కదా... టికెట్ డబ్బులు తప్ప.       

Thursday, July 19, 2012

తాప్సీ ఇంటర్వ్యూ


సాక్షి ఫ్యామిలీలో వచ్చిన తాప్సీ ఇంటర్వ్యూ

Tuesday, October 11, 2011

గజల్ మూగబోయింది!


నిన్న మధ్యాహ్నం ఆఫీసులో ఒక వార్త విన్నాను... ఒక ఉద్యోగి హఠాత్తుగా బ్రెయిన్ హేమరేజ్ తో చనిపోయారని. చాలా బాధ కలిగింది. ఆయన చాలా మంచి వ్యక్తి. చిన్న వయసులోనే ఆయనలా మరణించడం నన్ను కలవరపెట్టింది. ఆ మూడ్ లోనే ఇంటికి చేరాను. కాస్త మూడ్ మారుతుందని టీవీ పెట్టాను. మళ్ళీ ఇంకో విషాద వార్త. నా అభిమాన గాయకుడు, గజల్ కు ప్రాణం పోసిన మహానుభావుడు జగ్జీత్ సింగ్ చనిపోయారు. ఒక్క క్షణం మనసు రెపరెపలాడింది. ఎప్పుడు మనసు కాస్త బాగోకపోయినా ఆయన పాటలు వింటూ నన్ను, నా సమస్యలనూ మర్చిపోవటం నాకు అలవాటు. కాని ఇప్పుడు ఆయన పోయారన్న బాధను ఏమి చేసి పోగొట్టుకొవాలో అర్ధం కాలేదు. తుం ఇత్నాజొ ముస్కురా రహే హో అంటూ మంద్రంగా సాగిపోయె ఆ గానం ఇక వినిపించదు, బడీ నాజుక్ హై యె మంజిల్ అంటూ మధురంగా పాడిన ఆ స్వరం ఇక పలకదు.   
          తుమ్ ఇత్నా జో ముస్కురా రహే హో , బడీ నాజుక్ హై యె మంజిల్ ,  కహీ దూర్ జబ్ దిన్ ఢల్ జాయే, కాగజ్ కీ కష్టీ, కభీ ఆసూ కభీ కుషీ, తూ నహీ తో జిందగీ మే... చెప్పుకుంటూ పోతే ఆయన ప్రతి పాటా గుండెను తడుతుంది. ఆర్తిగా తడుముతుంది.
                 ఆహ్లాదకరమైన సంగీతంతో నాలాంటి ఎందరి మనసులకో శాంతి కలిగించిన ఆ మహా గాయకుడి ఆత్మకు శాంతి చేకూర్చమని దేవుడిని ప్రార్ధిస్తున్నాను.

Saturday, October 8, 2011

కాదేదీ కళకు అనర్హం

 

 వీటిని చూసాక నేను కూడా ఒక కళాఖండాన్ని సృష్టిద్దామని ట్రై చేసాను. మరీ అంత అందంగా కాకపోయినా ఒక మాదిరిగానైనా వస్తుందని అనుకున్నాను. అంత సీన్ లేదని త్వరగానే అర్థం చేసుకున్నాను. చేతులపై కత్తి గాట్లు, పాడైపోయిన పండ్లు చూసాక నా ప్రయత్నాన్ని విరమించుకోక తప్పలేదు.

Friday, October 7, 2011

అయ్యో పాపం!

ఆ మధ్య ఒకసారి ఏదో వెబ్ సైట్ లో  కొంతమంది గురించి చదివాను. వాళ్ళు ప్రపంచంలోనే అత్యంత దురదృష్ట వంతులంట!  అయ్యో పాపం అనిపించింది. రాసిపెట్టి వుంటే మనిషిని దురదృష్టం ఎంతగా వెంటాడుతుందో కదా అనుకున్నాను. బహుశా వాళ్ళ గురించి చదివితే మీకూ అలాగే అనిపిస్తుందేమో. ఇదిగో... వీళ్ళే వాళ్ళు.




ఇవి చదివాక నాలాగే మీక్కూడా అయ్యో పాపం అనిపించింది కదూ!