మొన్న పేపర్ చదువుతుంటే ఒక వార్త... పన్నెండేళ్ళ బాలికపై అత్యాచారం.
నిన్న మరో వార్త... ప్రేమించలేదంటూ పద్నాలుగేళ్ళ బాలికపై యాసిడ్ దాడి.
ఇవాళ ఇంకో వార్త... తుపాకీతో బెదిరించి మైనారిటీ తీరని పిల్లలపై అత్యాచారం చేస్తున్న స్కూల్ కరస్పాండెంట్.
ఏమిటిదంతా?
పై వార్తలు చదివినప్పుడు నా మనసులో ఉత్పన్నమైన ప్రశ్న.
ఆడదాని దౌర్భల్యం. స్త్రీజాతి దురదృష్టం. మహిళల నిస్సహాయత.
నాకు నేను చెప్పుకున్న సమాధానం.
చిన్ననాటి నుండీ వింటున్న ఒక రొటీన్ సమాధానం.
ఏమిటీ దౌర్భాగ్యం?
ఆడదాన్ని చూడగానే తప్పుడు ఆలోచనలే ఎందుకు కలుగుతున్నాయీ మగాళ్ళకి?
చిన్న పెద్ద తేడా కూడా చూడకుండా కామంతో మూసుకుపోయిన చూపులు వెంటాడుతుంటే ఎలా బతుకుతుంది ఆడది ఈ మగాళ్ళ లోకంలో?
ఇంటర్వ్యూకి సిటీకి వచ్చిన ఒక వివాహితను, ఆటో డ్రైవర్ తన స్నేహితులతో కలిసి రేప్ చేసాడు.
చుట్టపు చూపు చూడటానికి వచ్చి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆరేళ్ళ చిన్ని పాపపై పశువులా పడ్డాడో ముదుసలి.
పొరపాటున తన బావతో హోటల్ గదిలో దొరికినందుకు, సెల్ ఫోనులో ఫోటోలు తీసి, వాటి ద్వారా బెదిరించి ఒక అమ్మాయిపై నాలుగు నెలలపాటు అత్యాచారం జరిపారు పోలీసులు.
ఎన్ని అకృత్యాలు? ఎన్ని దుర్మార్గాలు? ఎన్నెన్ని దారుణాలు?
టెన్నిస్ నేర్చుకోడానికి వెళ్ళిన రుచిక పరిస్తితి ఏమయ్యింది?
ఐజీ పదవిలో వున్న రాక్షసుడు పద్నాలుగేళ్ళ ఆ పాపపై అక్రుత్యానికి ఒడిగట్టాడు. న్యాయం కోసం పోరాడీ పోరాడీ అలసిపోయిన ఆ పసి మనసు ముక్కలైపోయింది. మలినమైన తనువుతో బతకలేక మరణంతో తన కధకు ముగింపు పలికింది.
చదువుకోవాలనే ఆశతో హాస్టల్లో చేరిన ఆయేషాకు జరిగిన అన్యాయం తెలియనిదెవరికి?
మృగంలా ఒక మగాడు ఆమె తనువును చీల్చేస్తుంటే, ఆ చిట్టితల్లి పెట్టిన కేకలు ఏ గాలిలో కలిసిపోయాయో?
ప్రత్యూష చావు వెనుక వున్న రహస్యాలను బయటపెట్టేది ఎవరు?
పల్లెల్లో.. పట్టణాల్లో.. మహిళలపై ఇలాంటి అత్యాచారాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.
అంతమైపోయిన ఆ జీవితాలను చూసి ఈ లోకం ఒక చిన్న కన్నీటి బొట్టు విడుస్తుంది.
రాలిపోయిన ఆ లేలేత కుసుమాల కోసం ఒక నిమిషం మౌనం పాటిస్తోంది.
ఆ తరువాత వాళ్ళ కధలు కాగితాల్లో మిగిలిపోతాయి.
వాళ్లకు జరిగిన అన్యాయం కాలగర్భంలో కలిసిపోతుంది.
ఇంతేనా?
నెలల పిల్లల్ని సైతం ఎవరి చేతుల్లోనూ పెట్టలేని భయం ఎందుకు మనకి?
పిల్లల్ని స్కూలుకి పంపి, వాళ్ళు తిరిగి వచ్చేవరకూ ప్రశాంతంగా ఉండలేని దౌర్భాగ్యం ఏమిటి మనకి?
ఆడపిల్లని కనటమే పాపమా?
అలాగే వుంది పరిస్తితి.
ఆడపిల్లని పెంచటం, పెళ్లి చేయటం కాదు, వాళ్ళని కామాంధుల కళ్ళల్లో పడకుండా కాపాడుకోవటమే కష్టమైన పని నేటి తల్లిదండ్రులకి.
ఇలాగైతే ఆడపిల్లలకి రక్షణ కలిగేదేప్పుడు?
ఈ సమాజంలో వాళ్ళు ధైర్యంగా తిరిగేదేప్పుడు?
అత్యాచారాలు, లైంగిక వేధింపుల పట్ల మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు ఆందోళన చేస్తాయి గాని కాలగమనంలో వారి ఆందోళనలు మరుగునపడిపోతున్నాయి. ఒక కేసులో తీర్పు వచ్చేలోపు మరో కేసు. ఆ కేసును పరిసీలించేలోపు మరోటి. సంఘటనలు జరగటమే తప్ప సమస్యకు అంతం కనిపించటం లేదు. ఏళ్ళ తరబడి కేసులు వాయిదాలు.. యీలోపు సాక్షులను, సాక్ష్యాధారాలను తారుమారు చేయటం.. కేసును తమకు అనుకూలంగా మలచుకోవడం.. పైకోర్టుకు అప్పీలు.. తర్వాత కేసు మాఫీ…
ఇంతకు మించి జరిగేదేమిటి?
వున్న దరిద్రం చాలక అత్యాచారం జరగడానికి స్త్రీ కూడా కారణమని వాదిస్తున్నారు కొందరు ప్రబుద్దులు. స్త్రీలు శరీర భాగాలు కనపడేలా దుస్తులు ధరిస్తే మగాడు ఊరుకుంటాడా? ఆ మధ్య ఒక మగ మహారాజు వేసిన ప్రశ్న ఇది.
అందరు ఆడవాళ్ళు అమాయకులు, మగాళ్ళంతా దుర్మార్గులు అని నేను వాదించను. అందరు ఆడవాళ్ళూ అమాయకులు కాకపోవచ్చు. అందరు మగాళ్ళూ కీచకులు కాకపోవచ్చు. కానీ సమాజంలో జురుగుతున్న దారుణాలను చూసిన తరువాత ఆడదానికి మగాడి నుంచి ఎదురవుతున్న సమస్యలు చూసిన తరువాత ఇలా మాట్లాడాల్సి వస్తోంది. ఆడదానికి అన్యాయం చేస్తున్న మగాళ్ళ గురించే మనం మాట్లాడాలి.
ఆడది సరైన బట్టలు వేసుకోకపోవటం వల్ల మగాడికి కోరిక పుడుతోందా? ఎంత నీచమైన వాదన ఇది! నెలల పసికందులపై, పదేళ్లలోపు పిల్లలపై కూడా దారుణాలకు ఒడిగడుతున్నారు. మరి వాళ్ళు కూడా ఈ కోవలోకే వస్తారా? పొట్టి దుస్తులు మాత్రమే కాదు, చీర కట్టుకున్న ఆడది కూడా బలవుతోంది. దానికేమంటారో సదరు పెద్దమనిషి!
రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ దుస్తితికి బాధపడకుండా, ఇలాంటి అర్ధం పర్దం లేని కామెంట్లు చేసేవాళ్ళకు వేయాలి ముందు శిక్ష.
మనిషిలో పెరిగిపోతున్న పశు ప్రవ్రుత్తి, మంటగలిసిపోతున్న మానవీయ విలువలు ఈ దారుణాలకు కారణమని తెలిసి కూడా ఆడదానిపై నిందలు మోపి, తమ రాక్షసత్వాన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్న మగ మహారాజులకు నాదో మనవి.
దయ చేసి మీ రాక్షస క్రీడకు పాలబుగ్గల పసివాళ్ళను బలి చేయకండి.
మానవత్వాన్ని మర్చిపోయి లేలేత కుసుమాలను నిర్దాక్షిణ్యంగా నలిపి పారేయకండి.
అంకుల్, అన్నయ్యా, సార్ అంటూ అమాయకంగా పిలిచే ఆ చిట్టి తల్లుల్లకు చితి పేర్చకండి.
పరాయివాళ్ళ పిల్లల పట్ల అలాంటి ఆలోచన కలిగితే... మీ కడుపున పుట్టిన బిడ్డను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.
మహానుభావులు కానక్కర్లేదు, కనీసం మనుషుల్లా ప్రవర్తించండి.
"మహానుభావులు కానక్కర్లేదు, కనీసం మనుషుల్లా ప్రవర్తించండి." -- చాలా పెద్ద కోరిక కోరేరు మీరు... ఆచరణ కు వీలు కాని వీలు లేని పని అడిగేరు.
ReplyDelete