పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడే ముళ్ళు, ఏడే అడుగులు, మొత్తం కలిసి నూరేళ్ళు అని చెబుతాడు హీరో.
ఇది మన దేశంలో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లి. మనం ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి మనకు దీని గురించి తెలుసు. కానీ ఇతర దేశాల్లో వివాహ సంప్రదాయం ఎలా వుంటుంది! పొద్దున్న ఆఫీసుకి వస్తుంటే ఒక ఫంక్షన్ హాల్ దగ్గర పెళ్లి సందడి కనిపించింది. అప్పుడు వచ్చింది ఆ ఆలోచన. ఆఫీసుకి రాగానే వెంటనే ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూసా. వివాహ సంప్రదాయాల గురించి భలే ఆసక్తికరమైన విషయాలు కనిపించాయి. అవే ఇవి.
మెక్సికో: పెళ్ళిలో వధూవరుల మెడచుట్టూ తెల్లటి రిబ్బన్ కడతారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి 13 బంగారు వెండి నాణాలు ఇస్తాడు. వీటిని ప్రీస్ట్ ప్రార్ధనలు జరిపి, ఆశీర్వదించి మరీ వరుడి చేతికి ఇస్తాడు. వరుడు వాటిని తీసుకెళ్ళి వధువు చేతిలో పెడతాడు. ఆమె ఆనందంగా స్వీకరిస్తుంది. ఒకరిపై ఒకరు నమ్మకం, ప్రేమ పెంచుకోటానికి, ఒకరికి ఒకరు కట్టుబడి ఉండటానికి సూచనగా దీన్ని భావిస్తారట!
ఇటలీ: ఇక్కడి వివాహాల్లో ప్రధాన పాత్ర వహించేది ఆహారం. వివాహ కార్యక్రమం ముగిసిపోయినదనిపించుకుని వధూవరులకు బాదాం పప్పుతో చేసిన చాక్లెట్లు వున్న బ్యాగ్స్ ఇస్తారు. ప్రత్యేకంగా తయారుచేసే ఈ చాక్లెట్లను కాన్ఫెట్టి అంటారు. జీవితమంతా తీయగా, ఆనందంగా సాగిపోవాలని దీవిస్తూ వీటిని ఇస్తారట. పెళ్ళికి హాజరైన అతిథులకు కూడా వీటిని ఇస్తారు. వధువుకు ఎలాంటి ఆభరణాలూ వేయరు. వేస్తే అసుభమని అనుకుంటారు. అంతేకాదు, పెళ్లి ఆదివారం జరిగితే మంచిదని భావిస్తారు.
శ్రీలంక: ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బౌద్ధ వివాహాల గురించి. వీటిని చూడటానికి రెండు చాలవని అంటారు. చెక్కతో చేసిన ప్రత్యేకమైన వేదికపై పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఈ వేదికలను వాళ్ళు మగల్ పొరు అంటారు.
మొరాకో: ఇక్కడ వధువు మెహందీ పెట్టుకోవడం తప్పనిసరి. అంతేకాదు, కాళ్ళమీద చేతుల మీద టాటూలు వేస్తారు. ఇవి అందానికే కాదు, అదృష్టాన్ని తెచ్చిపెడతాయని వాళ్ళు నమ్ముతారు.
చైనా: ఎరుపు రంగు వస్త్రాలకు ప్రాధాన్యమిస్తారు. ఆ రంగు జీవితంలో ఆనందాన్ని, ప్రేమను నింపుతుందని వారి విశ్వాసం. వధువు కేశాలంకరణకు చాల ప్రాధాన్యముంది. భర్త, బిడ్డలతో మంచి సంసార జీవితాన్ని గడుపుతున్న స్త్రీతో మాత్రమే వధువుకు కేశాలంకరణ చేయిస్తారు. అలా చేయిస్తే పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి జీవితం సుఖప్రదంగా ఉంటుందని నమ్ముతారు. అంతేకాదు, వధువు కేశాలు నాలుగుసార్లు దువ్వాలనే ఆచారం కూడా వుంది. పెళ్లి జరిగిన తర్వాత కొత్త జంట పరస్పరం కర్చీఫులు బహుమతిగా ఇచ్చుకుంటారు. ఆ కర్చీఫులు ఎరుపు రంగులో వుంటాయి. వాటి మీద బాతుల బొమ్మలుంటాయి. బాతులు ఒకసారి జంట కడితే జీవితాంతం కలిసే ఉంటాయట. అందుకని ఆ బొమ్మలు ఉన్నవాటినే ఇచ్చి పుచ్చుకుంటారు.
ఐర్లాండ్: ఇక్కడ వధువు ధరించే గౌన్ ను హార్స్ షూ షేపులో తయారు చేస్తారు. హార్స్ షూ అంటే యు ఆకారంలో వుండే ఒక టూల్. ఆ ఆకారంలో వుండే దుస్తులను ధరిస్తే అదృష్టం వరిస్తుందని వారి నమ్మకం. వధువు చేతిలో ఉంచే పూలగుత్తిలో ఒక హార్స్ షూను కూడా ఉంచుతారు.
బ్రెజిల్: ఇక్కడ ఒక వింత ఆచారం వుంది. వధువును కావాలనే ఆలస్యంగా తీసుకొస్తారు. వివాహ కార్యక్రమం మొదలు కాకముందు వరుడు ఆమెను వివాహ వస్త్రాలలో చూడకూడదనేది వారి ఉద్దేశం.
జర్మనీ: ఇద్దరికి వివాహం జరిపించాలని నిర్ణయించిన తర్వాత, పెళ్ళికి కొన్ని రోజుల ముందు ఒక తంతు వుంటుంది. ఇద్దరినీ కూర్చోబెట్టి వారి ముందు బంధువులు పింగాణీ పాత్రలను నేలకేసి కొడతారు. ఇలా వాటిని విరగ్గొట్టడం వల్ల నూతన దంపతులకు శుభం చేకూరుతుందని వాళ్ళు నమ్ముతారు.
తైవాన్: పెళ్లిరోజు ఉదయం వరుడు వధువు ఇంటికి వెళ్తాడు. ఆమె తల్లిదండ్రుల ముందు మోకాళ్ళ మీద కూర్చుని 'మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను' అని వొట్టు వేసి, ఆమెను తనతో పంపించమని అడుగుతాడు. వాళ్ళు దానికి అంగీకరిస్తారు. అప్పుడతడు వధువును తీసుకుని పెళ్లి జరిగే చోటికి వెళతాడు. ఆ తర్వాత వివాహ కార్యక్రమం జరుగుతుంది.
టర్కీ: ఇక్కడొక వింత ఆచారం వుంది. పెళ్ళికూతురి చెప్పుల మీద పెళ్లి కానీ ఆమె స్నేహితురాళ్ళు తమ పేర్లు రాస్తారు. పెళ్లి జరిగిన తర్వాత చెప్పులు తీసి చూస్తారు. వాటి మీద ఎవరి పేరైనా చెరిగిపోతే ఆ అమ్మాయికి త్వరలోనే పెళ్లైపోతుందని నమ్ముతారు. ఇలాంటిదే కొరియాలో కూడా ఒకటుంది. వధువు తన చేతిలోని పూలగిత్తిని వెనక్కు విసురుతుంది. దానిని పట్టుకున్న అమ్మాయికి వెంటనే పెళ్లైపోతుందని అక్కడివాళ్ల విశ్వాసం.
ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల వెడ్డింగ్ ట్రెడిషన్స్ వున్నాయి. ఎవరి ఆచారాలు వారివి... ఎవరి నమ్మకాలు వారివి.