Wednesday, January 28, 2015

ఇప్పటికైనా నోరు విప్పండి బాస్!


చెన్నై నుంచి హైదరాబాద్ వస్తోన్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సులో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. బస్సు కాలి బూడిదైంది... పొద్దున్న టీవీ పెట్టగానే ఇదే వార్త. అందరికీ ఒక్కసారిగా పాలెం బస్సు ప్రమాదం గుర్తొచ్చేసింది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ప్రైవేటు ట్రావెల్స్ వాళ్లను అదుపు చేయడం లేదు, అందుకే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అంటూ అన్ని వెబ్ సైట్లలోనూ, వార్తా చానెళ్లలోనూ చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వం తమ బస్సులనే పట్టించుకోవడం లేదు. ఇక ప్రైవేటు బస్సులనేం పట్టించుకుంటుంది!
మొన్న నేను శెలవులకు అమలాపురం వెళ్లాను. తిరిగి రావడానికి ప్రైవేటు బస్సు ఎక్కడం ఇష్టం లేక ఆర్టీసీ బస్సు ఎక్కాను. డ్రైవర్ వెనుకగా ఉండే వరుసలో మొదటి సీటు నాది. పక్కనే ఉన్న సింగిల్ సీటులో ఓ వ్యక్తి కూర్చున్నాడు. అతడు రాగానే మందు వాసన గుప్పుమంది. ముసలోడు, తాగి ఉంటాడులే అని పట్టించుకోలేదు. బస్సు బయలుదేరి, లైట్లు ఆర్పిన తర్వాత వాడు చేస్తోన్న పని చూసి మతి పోయింది నాకు. చక్కగా ఓ గ్లాసు తీసి, సీసాలోంచి మందు గ్లాసులోకి ఒంపుకుని, వాటర్ ప్యాకెట్ చింపి నీళ్లు కలుపుకుని మరీ తాగుతున్నాడు. మధ్యమధ్యలో వాగుతున్నాడు కూడా. ఎవరూ గుండె గుభేల్ మంది. తాగుబోతువాడు ఎప్పుడెలా ప్రవర్తిస్తాడో ఎవరికి తెలుసు? అందుకే తర్వాతి స్టాప్ వచ్చేవరకూ ఆగి, అక్కడ బస్ ఆగినప్పుడు డ్రైవర్ కు విషయం చెప్పాను. అతణ్ని దింపేయమని చెప్పాను. కానీ డ్రైవర్ దింపలేదు. ఎందుకంటే వాడు రిజర్వేషన్ చేయించుకోలేదు. సీటు ఖాళీ ఉంది కదా అని డ్రైవర్ ఆ సీటును అతనికి అమ్మేశాడు. నాకు తెలిసి ఆ డబ్బులు అతనికే మిగులుతాయి. దిగమంటే అతడు డబ్బులు తిరిగివ్వమంటున్నాడు, ఎలా ఇస్తాను, ఇక తాగడులెండి అని నాకే సర్దిచెప్పాడు తప్ప వాడిని దింపలేదు. అతనీ మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను గమనించిందేమిటంటే... అతడూ తాగి ఉన్నాడు. అనుమతి లేకపోయినా లగేజీ వేసుకోవడం, కరెంటు తీగలకు తగిలేలా బస్సుల మీద పెద్ద పెద్ద మూటలు ఎక్కించుకోవడం, డబ్బుకు ఆశపడి సీట్లు లేకపోయినా ఇనుప కుర్చీలు వేసి మరీ జనాన్ని కూర్చోబెట్టుకోవడం, తాగి నడపడం వంటి తప్పులు ప్రైవేటు బస్సులే కాదు, ఆర్టీసీ బస్సుల విషయంలో కూడా జరుగుతోంది. దానికి కారణం ఎవరో కాదు... మనమే.
ఆ రోజు జరిగిన మొత్తం వ్యవహారంలో నాకు ఆ తాగినవాడి మీద, డ్రైవర్ మీద కంటే చుట్టూ ఉన్నవాళ్లమీద కోపమొచ్చింది. నేను కోప్పడుతున్నా, ఇదేం అన్యాయం అని నిలదీస్తున్నా ఒక్కరు కూడా నాతో గొంతు కలపలేదు. చాలామంది యువకులు ఉన్నారు. వాళ్లు కూడా పట్టించుకోలేదు. నేను తాగాను, అయితే ఏంటి, నిన్నేమైనా చేశానా అని ఆ తాగుబోతు నామీదే అరుస్తున్నా ఒక్కరూ నోరు మెదపలేదు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఎంతసేపూ ప్రభుత్వం సరిగ్గా లేదు అని లెక్చర్లు ఇస్తాం తప్పితే, సరిగ్గా లేనప్పుడు ఎవరు ప్రశ్నిస్తున్నాం! అడిగితే అవతలివాడు తిరగబడతాడేమోనని భయం. అందుకే మనకెందుకొచ్చిన గొడవ అని వదిలేస్తారు. ఆరోజు వాడి తాగిన మత్తులో నిజంగానే ఏదైనా రాద్దాంతం చేసివుంటే? ఏ ప్రమాదానికో కారకుడై ఉంటే? ఇవాళ జరిగిన బస్సు ప్రమాదానికి కారణం బస్సులో ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లడమేనని ప్రయాణీకులు చెప్పారు. మరి అలాంటి వాటిని ఎక్కిస్తున్నప్పుడు వాళ్లు ఎందుకు అడ్డుకోలేదు? ఎవరూ అడ్డుకోరు. ఇదేం పని అని అడగరు. ఏదైనా జరిగిన తర్వాత చింతిస్తారు.
కనీసం అప్పుడప్పుడైనా నోరు విప్పండి బాస్. తప్పు చేసేవాడిని ఏంట్రా నువ్వు చేస్తున్న పని అని ఒక్కసారి ప్రశ్నించండి. అలా అడగకే ప్రతివాడూ మనకు కీడు చేస్తున్నాడు. మోసం చేస్తున్నాడు. బాధ పెడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే మనల్ని లోకువ చేస్తున్నాడు. రూపాయి తక్కువైతే టిక్కెట్ ఇవ్వను బస్సు దిగమని చెప్పే కండక్టర్... మనకు రూపాయి ఇవ్వాల్సి వస్తే చిల్లర లేదు ఏం చేయమంటావ్ అంటూ అరుస్తాడు. మనం ఎక్కకపోతే బతుకు గడవని ఆటోడ్రైవర్... వాడి స్థాయి ఏంటో మర్చిపోయి మన అక్కల్నీ చెల్లెళ్లనీ చూసి విజిలేస్తుంటాడు. షాపువాడు తాను ఇచ్చింది మూసుకుని తీసుకోమంటున్నాడు. నచ్చకపోతే పొమ్మంటున్నాడు. ఇవన్నీ మనం అన్యాయాన్ని ప్రశ్నించకపోవడం వల్లే. తప్పు చేసినవాడిని నిలదీయకపోవడం వల్లే. మనం ఒక్కరం మాట్లాడటం వల్ల సమాజం మారిపోకపోవచ్చు. కానీ కనీసం ఒక్కడైనా భయపడి తప్పు చేయడానికి వెనక్కి తగ్గితే చాలు. మనల్ని చూసి మరొక్కరు చెడును ప్రశ్నించేందుకు ముందుకొస్తే చాలు. ఆ ఒక్కరూ ఒక్కరూ కలిసి వందలు, వేలు, లక్షలు అవుతారు. కొన్ని తప్పులనైనా జరగకుండా ఆపగలుగుతారు.

No comments:

Post a Comment