ఆఫీసు పనుల్లో పడిపోయి ఈమధ్య బ్లాగులో రెండు ముక్కలు రాయడానిక్కూదా సమయం కేటాయించలేకపోతున్నా. ఆ మధ్య ఓనమాలు సినిమా చూసినప్పటినుంచి నా ఫీలింగ్స్ అందరితో పంచుకుందామనుకుంటూనే వున్నా. అది ఇప్పటికి అయ్యింది.
ఓనమాలు సినిమాకి మాటలు రాసింది మా సాక్షి ఫ్యామిలీ హెడ్ ఖదీర్ గారు కావటంతో విడుదలకు ముందే సినిమా చూసే అవకాశం మా స్టాఫ్ అందరికీ దొరికింది. ఎప్పుడూ ఎవరు ఎక్కడికి పిలిచినా వెళ్ళని నేను కూడా వెళ్ళాను. దానికి కారణం అదో వైవిధ్యమైన సినిమా అని తెలియడమే. అసలు ఆ పేరే చెబుతోంది ఆ సినిమా ప్రత్యేకమైనదని .
భార్య చివరి కోరిక మేరకు కొడుకు దగ్గర వుండటానికి అమెరికా వెళ్ళిన నారాయణరావు మాస్టారు త్న్ మనసును మాత్రం తన వూరిలోనే వదిలేస్తాడు. తనకు ఒక గుర్తింపుని, తనకంటూ కొన్ని బంధాలని, ఎన్నెన్నో జ్ఞాపకాలని ఇచ్చిన తన ప్రియమైన గ్రామాన్ని తలచుకుని ప్రతిక్షణం కుమిలిపోతుంటాడు. ఎన్నిసార్లు అడిగినా కొడుకు, కొడలు తనని వూరికి పంపించకపోవటంతో మనవల సాయంతో ఇండియాకి వచ్చేస్తాడు. విషయం తెలిసిన కొడుకు తండ్రిని వూరికి చేర్చడానికి ఒక ట్యాక్సీని యేర్పాటు చేస్తాడు. ఆ డ్రైవరుతో కబుర్లు చెబుతూ, గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వూరికి ప్రయాణమవుతాడు నారాయణరావు.
ఎంతో సంతోషంగా వూళ్ళోకి అడుగుపెట్టిన నారాయణరావు హతాశుడవుతాడు. అది తన వూరేనా అని ఆశ్చర్యపోతాడు. పచ్చగా కళకళలాడే వూరు వెలవెలబోతుంటుంది. సందడి సందడిగా వుండే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఆప్యాయతలకి, అనురాగాలకి నిలయమైన గ్రామంలో మనుషులు కనీసం ఒకరినొకరు పలకరించుకోకుండా టీవీలకు అతుక్కుపోయారు. పచ్చని పొలాలతో, పంట చేలతో అలరారే అక్కడ ఆకలి చావులు చూసి నారాయణరావు అల్లాడిపోతాడు. ఎవరికి వారు రెక్కలొచ్చిన పక్షుల్లా పట్టణాలకు ఎగిరిపోయి పుట్టి పెరిగిన వూరిని మర్చిపోవటం ఆ ముసలి మాస్టారు తల్లడిల్లిపోతాడు. ఎలాగైనా తన వూరికి పూర్వ వైభవాన్ని తీసుకు రావాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఆయన ఎమి చేసాడన్నదే కథ.
ఇలా చెప్పుకుంటే ఏముందా కథలో అనిపిస్తుంది. సినిమా చూస్తే మాత్రం చలించని గుండె వుండదు, తడవని కన్ను వుండదు. అంత అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు క్రాంతిమాధవ్. వర్తమానం నుంచి గతానికి, మళ్ళీ గతం నుంచి వర్తమానానికీ కథను నడిపించిన తీరును మెచ్చుకోకుండా వుండలేం. నారాయణరావు మాస్టారిగా రాజేంద్ర ప్రసాద్ నటన అమోఘం. భార్య కల్యాణి, తన విద్యార్థి చనిపోయిన సన్నివేశాల్లో ఆయన నటన చూసి ఏడవని ప్రేక్షకుడు వుండడని నిస్సందేహంగా చెప్పగలను. అలాగే ట్యాక్సీ డ్రైవర్ ఎర్రమంజిల్ గా రఘుబాబు కూడా అద్భుతంగా నటించాడు. మిగిలిన వాళ్ళంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. కాకపోతే హీరోయిన్ కల్యాణి మరీ లావుగా వుంది.
అన్నిటికంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది పాటలు, మాటల గురించి. కోటి సంగీతం ద్రుశ్యాలకు మరింత అందాన్ని తెచ్చింది. ఆయన కట్టిన బాణీలకు సిరివెన్నెల సమకూర్చిన సాహిత్యం మనసులని తడుముతుంది. ముఖ్యంగా... పిల్లలూ బాగున్నారా పాట వింటే వున్నపళంగా వెళ్ళి మన వూరిలో వాలిపోవాలనిపిస్తుంది. అంత టచింగ్ గా వుంది.
ఇక ఖదీర్ గారు రాసిన మాటల గురించి చెప్పటానికి నాకు వచ్చిన మాటలు చాలవు. అంత బాగా రాశారాయన. సాధరణంగా మనకు తెలిసినవారు ఒక పని చేశారంటే అది ఎలా వుందో చూడాలన్న వుత్సుకత వుంటుంది మనకు. సినిమా చూసేముందు నాకూ అలాగే వుంది. చూసాక మాత్రం, నాకు మాటలే కరువయ్యాయి. ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పకుండా వుండలేకపోయాను. ప్రతి మాటా మన అలోచనా విధానంపై ప్రభావం చూపిస్తుంది. భావోద్వేగాల సుడిలో తోసి వుక్కిరిబిక్కిరి చేస్తుంది.
అయితే దయ్యం సినిమాలు లేదంటే వయొలెన్స్ తో వాయించేసే సినిమాలు. కొనాళ్ళుగా ఇవే మనకు దిక్కయ్యాయి. మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ, తీసిన కథలే తిప్పి తిప్పి తీస్తుంటే నాకు మాత్రం చూడలేక కళ్ళు పేలిపోతున్నాయి. సినిమాలంటే పడి చచ్చే నేను, ఏదైనా సినిమా ఫ్లాపయ్యిందని చెబితే ఎందుకు ఫ్లాపయ్యిందో తెలుసుకుందామని ఆ సినిమాకి వెళ్ళి చూసె నేను చిరాకు పుట్టి కొన్నాళ్ళుగ సినిమాలు చూడటమే మానేశాను. అలాంటి సమయంలో వచ్చింది ఓనమాలు. చచ్చిపోతున్న నా సినిమా ఆసక్తిని మళ్ళీ తట్టి లేపింది. చాలా చాలా నచ్చేసింది. మీరు కుడా తప్పకుందా చూడండి. లేదంటే ఒక మంచి సినిమాని అవమానించినవాళ్ళమవుతాం. మరో మంచి సినిమా తీయలనుకునే దర్శకుడి జిజ్ఞాశను చంపేసిన వాళ్ళమవుతాం. ప్లీజ్... ఒక్కసారి చూడండి. నచ్చితే ఒక అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకుంటారు. లేదంటే మీరు నష్టపోయేదేమీ లేదు కదా... టికెట్ డబ్బులు తప్ప.
తప్పకుండా చూడాలి అనిపించేదిగా ఉంది మీ ఈ పోస్ట్.
ReplyDeleteచూసి అద్భుతమైన అనుభూతినే పొందుతానని నమ్మకం.
థ్యాంక్సండి....మంచి వెరైటీ చిత్రం గురించి చెప్పినందుకు.
+1
ReplyDeleteఅవును మీరు చెప్పింది నిజం.ఖదీర్ బాబు గారు మరియు యునిట్
ReplyDeleteఅందరికి అభినందనలు