Tuesday, October 11, 2011

గజల్ మూగబోయింది!


నిన్న మధ్యాహ్నం ఆఫీసులో ఒక వార్త విన్నాను... ఒక ఉద్యోగి హఠాత్తుగా బ్రెయిన్ హేమరేజ్ తో చనిపోయారని. చాలా బాధ కలిగింది. ఆయన చాలా మంచి వ్యక్తి. చిన్న వయసులోనే ఆయనలా మరణించడం నన్ను కలవరపెట్టింది. ఆ మూడ్ లోనే ఇంటికి చేరాను. కాస్త మూడ్ మారుతుందని టీవీ పెట్టాను. మళ్ళీ ఇంకో విషాద వార్త. నా అభిమాన గాయకుడు, గజల్ కు ప్రాణం పోసిన మహానుభావుడు జగ్జీత్ సింగ్ చనిపోయారు. ఒక్క క్షణం మనసు రెపరెపలాడింది. ఎప్పుడు మనసు కాస్త బాగోకపోయినా ఆయన పాటలు వింటూ నన్ను, నా సమస్యలనూ మర్చిపోవటం నాకు అలవాటు. కాని ఇప్పుడు ఆయన పోయారన్న బాధను ఏమి చేసి పోగొట్టుకొవాలో అర్ధం కాలేదు. తుం ఇత్నాజొ ముస్కురా రహే హో అంటూ మంద్రంగా సాగిపోయె ఆ గానం ఇక వినిపించదు, బడీ నాజుక్ హై యె మంజిల్ అంటూ మధురంగా పాడిన ఆ స్వరం ఇక పలకదు.   
          తుమ్ ఇత్నా జో ముస్కురా రహే హో , బడీ నాజుక్ హై యె మంజిల్ ,  కహీ దూర్ జబ్ దిన్ ఢల్ జాయే, కాగజ్ కీ కష్టీ, కభీ ఆసూ కభీ కుషీ, తూ నహీ తో జిందగీ మే... చెప్పుకుంటూ పోతే ఆయన ప్రతి పాటా గుండెను తడుతుంది. ఆర్తిగా తడుముతుంది.
                 ఆహ్లాదకరమైన సంగీతంతో నాలాంటి ఎందరి మనసులకో శాంతి కలిగించిన ఆ మహా గాయకుడి ఆత్మకు శాంతి చేకూర్చమని దేవుడిని ప్రార్ధిస్తున్నాను.

Saturday, October 8, 2011

కాదేదీ కళకు అనర్హం

 

 వీటిని చూసాక నేను కూడా ఒక కళాఖండాన్ని సృష్టిద్దామని ట్రై చేసాను. మరీ అంత అందంగా కాకపోయినా ఒక మాదిరిగానైనా వస్తుందని అనుకున్నాను. అంత సీన్ లేదని త్వరగానే అర్థం చేసుకున్నాను. చేతులపై కత్తి గాట్లు, పాడైపోయిన పండ్లు చూసాక నా ప్రయత్నాన్ని విరమించుకోక తప్పలేదు.

Friday, October 7, 2011

అయ్యో పాపం!

ఆ మధ్య ఒకసారి ఏదో వెబ్ సైట్ లో  కొంతమంది గురించి చదివాను. వాళ్ళు ప్రపంచంలోనే అత్యంత దురదృష్ట వంతులంట!  అయ్యో పాపం అనిపించింది. రాసిపెట్టి వుంటే మనిషిని దురదృష్టం ఎంతగా వెంటాడుతుందో కదా అనుకున్నాను. బహుశా వాళ్ళ గురించి చదివితే మీకూ అలాగే అనిపిస్తుందేమో. ఇదిగో... వీళ్ళే వాళ్ళు.




ఇవి చదివాక నాలాగే మీక్కూడా అయ్యో పాపం అనిపించింది కదూ!


Saturday, June 11, 2011

ఎంత ట్రాజెడీయో!



(సాక్షి ఫండే లో రాసిన ఆర్టికల్) 




Friday, June 10, 2011

అమ్మో సినిమానా?


ఈ మధ్య వస్తున్న సినిమాలను చూస్తుంటే, సినిమాకి వీరాభిమానినైన నాక్కూడా భయమేస్తోంది. అందరూ చెత్త సినిమా అని చెప్పినా, అంత చెత్తగా ఎందుకుందో చూడాలనుకునే రకం నేను. అలాంటి నాకే కొన్ని సినిమాలు దడ పుట్టించాయి. బయటికి పరుగెత్తించాయి. ఆ వ్యధను కాస్త మీకూ పంచుదామనిపించి బ్లాగు ఓపెన్ చేశా.
         అసలు ఈ సంవత్సరం నా సినిమా కష్టాలు పరమ వీర చక్రతో మొదలయ్యాయి. బాలకృష్ణ అంటే నాకు ఇష్టం. కాని ఆయన డైలాగులు ఎంత బాగా చెప్పగలరో చూడటానికే సినిమా చూడమంటే... నా వల్ల కాదు. తర్వాత మిరపకాయ్. బ్లాకు లో టికెట్ కొనుక్కుని వెళ్ళినందుకు కడుపు మండిపోయింది. ఒక ఇంటలిజెన్స్ ఆఫీసర్ ప్రవర్తనను మన తెలుగు సినిమాలో మాత్రమే అంత చీప్ గా చూపించగలరు. అనగనగా ఒక ధీరుడు... ఆయన ధీరుడే. కాని ఏ సినిమా పడితే ఆ సినిమా చూసి తట్టుకునేంత ధీరులం మనం కాదు కదా? ఆ సినిమాలో రవిబాబు హీరో కళ్ళు పొడిచేస్తాడు. అయిన అతడి కళ్ళు అందంగా చక్కగా వుంటాయి. చూపు మాత్రమే పోతుంది. అదెలాగో నాకెంతకీ అర్ధం కాలేదు. వాంటెడ్... ఎవరు ఎవరికి వాంటెడ్ అన్నది  తెలీదు కానీ ప్రేక్షకులకు మాత్రం ఆ సినిమా  అన్ వాంటెడ్.  ఇక వర్మ గారు చాలా కాన్ఫిడెంట్ గా మన మీదకు వదిలిన చిత్రం కధ స్క్రీన్ ప్లే దర్సకత్వం అప్పలరాజు. పాపం స్క్రీన్ ప్లే, దర్సకత్వం గొడవలో పడి అప్పలరాజు గారు కధను మర్చిపోయారు. దొంగల ముఠా ఒకటి నా ప్రాణానికి. మామూలు సినిమాలే చూడగలిగేలా తీస్తే చాలు కదా! ఇలా ప్రయోగాలు చేసి మా బుర్రలు చెడగొట్టటం ఎందుకట! ఇక శక్తి సినిమా చివరి వరకూ చూసే శక్తి లేక మధ్యలోనే తిరిగొచ్చేసాను. ఈ మధ్యనే వీర కూడా వీర లెవెల్లో నా ఓపికకి పరీక్ష పెట్టాడు. ఫస్ట్ హాఫ్ కాస్త పర్లేదు కాని సెకెండ్ హాఫ్ లో  చెడుగుడు ఆడుకున్నాడు.  చుట్టుపక్కల ఊళ్ళు కూడా ఎంతో గౌరవించే హీరోకి అంత చీప్ లవ్ స్టొరీ పెట్టాలని డైరెక్టర్ కి ఎందుకనిపించిందో. ఎడిటింగ్ అయితే ఎంత ఘోరంగా వుందో చెప్పలేను. హండ్రెడ్ పర్సెంట్  లవ్ బాగానే వుంది కాని కాస్త అతిగా అనిపించింది. ముఖ్యంగా మనం గెలవడం కోసం ఎదుటివారిని  ఎంత మోసం చేసినా పరవాలేదని రాంగ్ మెసేజ్ ఇవ్వడం నాకు అస్సలు నచ్చలేదు.  సుకుమార్ మా వూరి వాడని నాకు చాలా అభిమానం. అయినా నాకు నచ్చనిది చెప్పకుండా ఉండలేను. ఇక తీన్ మార్  అంటారా. పవన్ కళ్యాన్ కి కుదురుగా నిలబడటం వచ్చేవరకు అతని సినిమా చూడకూడదని ఒట్టు పెట్టుకున్నాను. అయినా నాకు తెలీక అడుగుతాను... పరాయి బాషలో అంత పెద్ద పెద్ద డైలాగులు పెట్టినప్పుడు కనీసం కింద ఒక స్క్రోల్లింగ్ అయిన ఇవ్వాలని తెలియకపోతే మనం మాత్రం ఏమి చేయగలం! ప్రేమ కావాలిని ప్రేక్షకులు పెద్దగా కావాలనుకోలేదు.  పూరి జగన్నాథ్ తన రాక్షసి ద్వారా జనాల ప్రాణాలు తీయాలని ప్రయత్నిచాడు. ఇక ఇవాళ బద్రీనాథ్ విడుదల అయ్యింది. అది శక్తిని మించిపోయిందని చూసొచ్చిన వాళ్ళంతా తలలు పట్టుకున్నారు. ఇంకేముంది! వినాయక్ సినిమా కోసం చూసిన ఎదురు చూపులకు అర్థం లేకుండా పోయింది. చూడాలన్న ఆశా చచ్చిపోయింది. ఎందుకిలా సినిమాలన్నీ బోల్తా కొడుతున్నాయో ఎవరైనా ఆలోచిస్తున్నారో లోదో? ఒకవేళ ఆలోచిస్తే ఒకట్రెండు సినిమాలు పోయాకైన ఒక మంచి సినిమాను మనకు అందించేవారు కదా? పోటీపడి మరీ అట్టర్ ఫ్లాపులెందుకు తీస్తారు?

        అలా మొదలైంది తప్ప ఈ ఏడు అసలు హిట్టంటూ ఉందా? పెద్ద పెద్ద వాళ్ళందరూ ఫెయిలైన టైములో మంచి హిట్ ఇచ్చిన నందినీ రెడ్డికి హాట్సాఫ్. గోల్కొండ హాయ్ స్కూల్ మంచి సినిమా అని పేరు తెచ్చుకుంది. గగనం గురించి నెగటివ్ గా మాట్లాడడానికి ఏమీ లేదు. ఎందుకంటే అది కాలక్షేపం కోసం తీసింది కాదు. టెర్రరిజం లాంటి భయంకర సమస్యను అడ్రెస్  చేసింది. సినిమా కూడా ఏమీ బోర్ కొట్టదు. మిస్టర్ పర్ఫెక్ట్ హాయిగా ఫామిలీతో కలిసి చూడొచ్చు. ఇక మన అలసట తీర్చడానికి అల్లరి నరేష్ సినిమాలు ఎలాగూ వున్నాయి. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రెండు డబ్బింగ్ సినిమాల గురించి. రంగం, వైశాలి. మంచి సినిమా కోసం ఎన్నో రోజులుగా చూస్తున్న నన్ను అత్యంత ఆనందపర్చాయి ఆ సినిమాలు. ఒకటి చక్కటి సామాజిక స్ఫ్రుహను కలిగించే సినిమా అయితే, మరొకటి టేకింగ్ పరంగా అద్భుతంగా ఉన్న సినిమా (కధా పరంగా చూసుకుంటే క్లైమాక్స్ కాస్త డల్ గా ఉన్నప్పటికీ). ఇలాంటి ప్రయోగాలు మన వాళ్ళెందుకు చేయరో నాకు అర్ధం కాదు. ఒక్కోసారి ప్రేక్షకులది కూడా తప్పు ఉందేమో అనిపిస్తుంది నాకు. బ్రోకర్ లాంటి మంచి సినిమాలను కూడా చక్కగా ఆదరించలేని మనం వీళ్ళకు లోకువైపోయమేమో. అందుకే వీళ్ళు ఇలాంటి సినిమాలు తీస్తున్నారేమో. హీరోల కోసం కాకుండా మంచి విలువల కోసం సినిమా చూడాలని ప్రేక్షకుడు అనుకోనంత వరకు మన దర్శకులు, నిర్మాతలు మారరు. హీరోలకు తగ్గట్టు కథ రాయకుండా, ప్రజలకు ఉపయోగపడేలా, ప్రేక్షకులు ఆనందపడేలా సినిమాలు తీయరు. నిర్మాతలు, దర్శకులతో పాటు ప్రేక్షకుడు కూడా మారితేనే మళ్ళీ తెలుగు సినిమా విలువలు పెరుగుతాయని సినిమా వీరాభిమానిగా నా అభిప్రాయం.




Saturday, June 4, 2011

భలే ఉందే!

చైనాలో వస్తువులను చాలా విచిత్రంగా తరలిస్తున్నారు. మొన్న నెట్లో ఆ ఫోటోలు చూసి చాలా ఆశ్చర్యపోయాను. మీరు కూడా చూస్తారని సరదాగా వాటిని ఇక్కడ ఉంచుతున్నాను.













 

Friday, June 3, 2011

అక్కడేముంది?





(సాక్షి ఫన్ డే కోసం రాసిన ఆర్టికల్ ) 

Monday, February 28, 2011

సారీ బాలయ్యా!


మనుషుల్లో సంస్కారం ఎందుకింత లోపిస్తోందో ఒక్కోసారి అర్థం కాదు నాకు. ఈరోజు ఒక చానెల్లో బాలకృష్ణ గురించి న్యూస్ చూడగానే కడుపు మండిపోయింది. ఒక వ్యక్తిని అభిమానిస్తే నెత్తిన పెట్టుకుంటారు. దానివల్ల ఎవరికీ ఏ నష్టమూ వుండదు కాబట్టి ఓకే. కాని అభిమానించకపోతే ఇంతలా అవమానించటం సరి కాదు. దానివల్ల అవతలి వ్యక్తి పరువు, మర్యాద పాడవుతాయనే  జ్ఞానం కూడా లేకపోతె ఎలా? తన సినిమాలు చూడమని బాలయ్య ఎవరినీ బతిమాలడం లేదు కదా. ఇష్టమైతే చూడాలి లేకపోతె లేదు. అంతేకాని ఇలా ఐ హేట్ బాలయ్య డాట్ కాం అంటూ ఒక సైట్ ఓపెన్ చేసి, ఆయనను అవమానించేలా ఫోటోలు పెట్టటం, పిచ్చి పిచ్చి రాతలు రాయటం సంస్కారం వున్నవాలు చేసే పని కాదు. ఇంత కుసంస్కారం తమలో వున్నందుకు ఈ పని చేసినవాళ్ళు సిగ్గుపడాలి. వాళ్ళ బదులు నేను బాలయ్యకు క్షమాపణ చెప్తున్నాను. సారీ బాలయ్యా.

దయ చేసి ఇలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించకండి. ఇలాంటి పనులు చేసేవాళ్ళు మీకు కనిపిస్తే తగిన బుద్ధి చెప్పకుండా వదలకండి. ఎందుకంటే రేపు మీరే ఒక స్టార్ కావచ్చు. మీరు నచ్చని వాళ్ళెవరో మీ గురించి కూడా ఇలాంటి ఒక సైట్ ఓపెన్ చేయవచ్చు. మీ మీద బురద చల్లే ప్రయత్నం చేయవచ్చు.