దాసరి నారాయణరావు... నా నా అభిమాన దర్శకుడు అని చెప్పేస్తే సరిపోదు. ఎందుకంటే నాలాంటి అభిమానులు వందల్లో, వేళల్లో వుంటారు. అద్భుతమైన సినిమాలను సృష్టించిన ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. బలిపీఠం, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, మేఘసందేశం, ప్రేమాభిషేకం, శివరంజని... ఒకటా రెండా.. చెప్పుకుంటూ పోతే లెక్క తెగనన్ని చిత్ర రాజాలు మన కళ్ళముందు ఠీవిగా వచ్చి నిలబడతాయి. అలాంటి ఒక చిత్రాన్ని ఈరోజు ఉదయం తేజ టీవిలో చూసాను. అదే ధర్మపీఠం దద్దరిల్లింది. శోభన్ బాబు, జయసుధ, కైకాల సత్యనారాయణ తదితరులు నటించిన ఈ చిత్రం.. దర్శకరత్నమన తెలుగు ప్రేక్షకులకు ఇచ్చిన మరో మంచి చిత్రం.
మామూలుగానే శోభన్ బాబు అంటే పడి చచ్చే నేను, ఈ సినిమాలో ఆయన నటన చూసి రెప్ప వేయటం కూడా మర్చిపోయాను. ఆ ఠీవి, ఆ నడక, ఆ డైలాగ్ డెలివరీ... ఓహ్.. ఆ పాత్రలో ఆయన జీవించారు. తన బిడ్డలను దేశానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలనే వున్నతమైన ఆలోచనతో ఒకడిని డాక్టర్ని, ఒకడిని ఇంజినీర్ని, ఒకడిని లాయర్ని చేస్తాడు తండ్రి. కానీ వాళ్ళు అవినీతికి కొమ్ము కాసేవాళ్ళుగా, లంచాలకు న్యాయాన్ని తాకట్టు పెట్టేవాల్లుగా తయారవుతారు. ఒక కొడుకు చేసిన దుర్మార్గాన్ని చూసిన తల్లి దానిని బయటపెట్టబోతున్న తల్లిని, ముగ్గురు కొడుకులూ కలిసి పిచ్చిదానిలా చిత్రీకరిస్తారు. ఒక సమయంలో భర్తకు నిజం చెప్పి కన్ను మూస్తుంది ఆమె. సాయం చేయమని వచ్చిన తన స్నేహితునికి సైతం డబ్బుకు ఆశపడి తన కొడుకులు అన్యాయం చేయడాన్ని జీర్నిన్చుకోలేకపోతాడు తండ్రి. వాళ్ళు బతికుంటే సమాజాన్ని నాశనం చేస్తారన్న ఉద్దేశంతో తన ముగ్గురు కొడుకుల్నీ చంపేస్తాడు. న్యాయస్థానం అతనికి ఉరిశిక్షను విధించగానే, కోర్టులోనే కుప్పకూలిపోతాడు.
కధ ఆసాంతం ఆసక్తికరంగా సాగుతుంది. అందరూ ఎవరి పాత్రలకు వాళ్ళు న్యాయం చేసారు. అయితే శోభన్ నటన మాత్రం అద్వితీయం. ముఖ్యంగా క్లైమాక్స్లోని కోర్టు సీన్లో ఆయన హావభావాలు, డైలాగ్స్ చెప్పేటప్పుడు ఖంగుమనే స్వరం అమేజింగ్. శోభన్ బాబు సినిమా కదా అని చూడటం మొదలుపెట్టాను కానీ, ఆ కధ, కధన శైలి నన్ను కదలనివ్వలేదు. హాట్సాఫ్ టు దాసరి అండ్ శోభన్ బాబు!