దేనికోసమో ఇంటర్నెట్ ను తవ్వుతుంటే ఈ అద్భుత దృశ్యం కంటబడింది. మనిషికి మనిషి చేయగలిగిన సాయం చేయడానికి కూడా ముందుకు రాని ఈ రోజుల్లో, ఆడుతూ పాడుతూ తిరిగే ఈ పసివాళ్ళు ఒక మూగ ప్రాణిని కాపాడటం కోసం పడిన తపన నన్ను కదిలించింది. స్వార్ధంతో మన సుఖం మన సంతోషం తప్ప, సాటి మనిషి గురించి కనీసం పట్టించుకోని మనకు పిల్లలు నేర్పుతున్న పాఠం ఇది!
ఇది నా ప్రపంచం. నా కలలు-కోరికలు, నా ఆశలు-ఆశయాలు, నా కలతలు-కన్నీళ్లు, నా భావాలు-భావోద్వేగాలు... అన్నీ ఇక్కడ అక్షరాలుగా చల్లుతాను. ఇక్కడ నేను వుంటాను. నేను మాత్రమే వుంటాను.
Friday, August 20, 2010
Friday, August 13, 2010
నీవు మరపు'రావు'
నేడు రావు గోపాలరావు వర్ధంతి.
ఆహార్యం, వాచకం, అభినయం... అన్నింట్లోనూ ఆయనది ఒక ప్రత్యేక శైలి. ఆయన కామెడీ చేస్తే నవ్వలేక పొట్టలు పగిలిపోతాయి. ఆయన విలనిజం చూపితే భయంతో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 'ఊరికి మొనగాడు' నుంచి 'ఆ ఒక్కటి అడక్కు' వరకు తన నటనా కౌశలంతో తెలుగు ప్రజానీకాన్ని ఉర్రూతలూగించిన రావు గోపాలరావు వర్ధంతి నేడు. తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ దగ్గరలోని గంగనపల్లిలో జన్మించిన రావు గోపాలరావు, దేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగారు. తన అద్బుత నటనతో అందరి మనస్సులో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు.
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రావు గోపాలరావు సినిమాలు చూస్తూనే వున్నాను. సాధారణంగా ఆయన పేరు చెప్పగానే అందరూ ముత్యాలముగ్గు గురించి మాట్లాడతారు. కానీ నాకు మాత్రం మల్లెపువ్వు సినిమాలో నటన ఇష్టం. ఇప్పటికీ ఆ సినిమా 22 సార్లు చూసాను. శోభన్ బాబు నటన, కధ, కధనం, పాటలు... వీటన్నిటితో పాటు రావు గోపాలరావు నటన అమితంగా నచ్చటమే అందుకు కారణం. ఇంటిగుట్టులో పాత్ర కూడా మనసుకు హత్తుకుంటుంది. అంత ఉదాత్తమైన పాత్రలో గుండెను తాకేలా ఆయన ప్రదర్శించిన నటన కంటతడి పెట్టిస్తుంది. దేవాలయం, బొబ్బిలి పులి, దొంగ మొగుడు, చాలెంజ్, గ్యాంగ్ లీడర్ తదితర చిత్రాల్లో విలన్ రావు గోపాలరావుని, ఘరానా మొగుడు, అల్లరి అల్లుడు, ఆ ఒక్కటి అడక్కు తదితర చిత్రాల్లోని సాత్వికుడైన రావు గోపాలరావుని మరచిపోవటం అంత తేలిక కాదు. అందుకేగా చనిపోయి పదహారేళ్ళు అవుతున్న ఇప్పటికీ ఆయనను మన మనసుల్లో సజీవంగా నిలుపుకుని కొనియాడుతున్నాం!
మన అభిమాన నట రారాజు ఆత్మకు శాంతి కలగాలని మనసారా ప్రార్ధిద్దాం!
Subscribe to:
Posts (Atom)