స్వరాలను ఏరి కూర్చి రాగమాలికలను అల్లే స్వరాల రారాజు ఇళయరాజా పుట్టినరోజు జూన్ 2న.
నాకు తెలిసి పాటంటే ఇళయరాజా కట్టినది. మనసు పొరలను తడిమే ఆయన పాట వినని రోజు ఏదో వెలితి. నా జీవితంలో నాకున్న కోరిక ఒక్కటే... ఒకే ఒక్కసారి ఆ మహానుభావున్ని కళ్ళారా చూడాలని. ఒక్కసారయినా ఆ మహనీయుని కాళ్ళకు నమస్కరించాలని.
సంగీత సాగరాన్ని మధించి, అమృతతుల్యమయిన పాటలను అందించిన మేధావి ఇళయరాజా, 1943వ సంవత్సరం జూన్ 2వ తేదీన తమిళనాడులో ఒక నిరు పేదకుటుంబంలో జన్మించారు. మొదట్లో చెన్నైలో శుభకార్యాలకు, సభలకు సంగీత ప్రదర్శనలిచ్చే బృందంలో సభ్యునిగా సంగీత జీవితాన్ని ప్రారంభించారు ఇళయరాజా. సలీల్ చౌదరి వంటి సంగీత దర్శకుల దగ్గర గిటారిస్టుగా, కీ బోర్డు కళాకారుడిగా పని చేసారు. తర్వాత కన్నడ సంగీత దర్శకుడైన జి.కె.వెంకటేష్ దగ్గర సహాయకుడిగా చేరడంతో చలన చిత్ర పరిశ్రమతో అనుబంధం ప్రారంభమైంది. ఈ సంగీత దర్శకుని దగ్గరే దాదాపు 200 సినిమాలకు సహాయకుడిగా పని చేసారు. కొన్నాళ్ళకు పంజు అరుణాచలం అనే తమిళ నిర్మాత అన్నక్కలి అనే సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం ఇవ్వడంతో 1976 లో ఇళయరాజా పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా అవతరించాడు. 1976లో విడుదలైన జయప్రద నటించిన 'భద్రకాళి అనే తెలుగు చిత్రంలోని ‘చిన్ని చిన్ని కన్నయ్య’ అనే పాటకు సంగీతాన్ని అందించి మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు సినీరంగ ప్రవేశం చేసారు. అయితే ఎన్టీఆర్ నటించిన 'యుగంధర్' మొదట విడుదలయింది. ఆ రోజునుంచి ఈరోజు వరకూ వెనుదిరిగి చూసుకోలేదయన. మూడు సార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్న ఘనత ఆయనది. ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో పాటు పద్మభూషణ్ అవార్డును అందుకున్న విశిష్టత ఆయనది.
సంగీతానికి కొత్త ఒరవడిని నేర్పాడాయన. స్వరాల జల్లుల్లో సర్వ మానవాళినీ తడిపి ముద్ద చేసాడాయన. ఆయన చేయని ప్రయోగం లేదు. ఆయన లేకపోతే సినిమా సంగీతమే లేదు. ఆయన ఒక స్వరసాగరం. సినీ సంగీత చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఓ స్వర్ణాక్షరం.
సుమనోహర స్వరాలతో మదిమదినీ పులకింప చేసిన స్వరబ్రహ్మకు వందనం. రసరమ్యమైన రాగాలతో ప్రతి హృదినీ పరవశింప చేసిన సంగీత నిధికి అభివందనం.
ఇళయరాజా అంటే ఏమిటో తెలిపే అమావాస్య చంద్రుడులోని ఈ అద్భుతమైన పాట నా ఆల్ టైం ఫేవరేట్.
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో(2)
మలయజ మారుత శీకరమో, మనసిజ రాగ వశీకరమో
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో
ఆనందాలే భోగాలైతే, హంసానంది రాగాలైతే
నవ వసంత గానాలేవో సాగేనులే, సురవీణ నాదాలెన్నో మొగేనులే
వేకువలో వెన్నెలలో చుక్కలు చూడని కన్నులలో
మావుల కొమ్మల ఊగిన కోయిల వేణువు లూడిన గీతికలు
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో
అందాలన్నీ అందే వేళ, బంధాలన్నీ పొందే వేళ
కన్నుల్లో గంగా యమునా పొంగేనులే, కౌగిట్లో సంగమమేదో సాగేనులే
కోరికలే సారికలై ఆడిన పాడిన సందడిలో
మల్లెల తావుల పిల్లన గ్రోవులు పల్లవి పాడిన పందిరిలో
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో
ఇంత టిపికల్ కంపోజిషన్ నా జీవితంలో నేనెప్పుడూ వినలేదు. హ్యాట్సాఫ్ టు ఇళయరాజా! నాకు తెలిసినవి, విన్న ప్రతిసారీ మైమరచిపోయే కొన్ని పాటలు ఇవి...
* చెలీ రావా వరాలీవా (మౌనరాగం)
* ఆవేసమంతా ఆలాపనేలే, ప్రియతమా తమ సంగీతం (ఆలాపన)
* ఏవేవో కలలు కన్నాను (జ్వాల)
* రేగుతున్నదొక రాగం (డాన్స్ మాస్టర్)
* పాటగా నాలో పరువాలు పలికే (క్షత్రియుడు)
* మిడిసిపడే దీపాలివి (ఆస్తులు-అంతస్తులు)
* ఆగిపో ఆగిపో కాలమా ఆగిపో (ఆరాధన)
* మూగైనా హృదయమా (ఆత్మబంధువు)
* ఏమనినే మది పాడుదునో (మంత్రిగారి వియ్యంకుడు)
* రాసలీల వేళ రాయబారమేల (ఆదిత్య 369 )
* సుందరీ నువ్వే నేనంట (దళపతి)
* కురిసెను విరిజల్లులే (ఘర్షణ)
* సంధ్యారాగపు సరిగమలో (ఇంద్రుడు చంద్రుడు)
* ఆకాశం మేఘాలు మూసే వేళల్లో (కోకిల)
* ఏ ఊహలోనో తేలానేమో (శివ 2006)
* పచ్చా పచ్చని కల వేసే బంగారు వల (తూర్పు సింధూరం)
* ఏనాడు విడిపోని ముడి వేసెనే (శ్రీ కనక మహాలక్ష్మి డాన్స్ ట్రూప్)
ఇలా చెప్పుకుంటూ పోతే ఆ మధుర గీతాల లిస్టుకు అంతు వుండదు. ఇళయరాజాపై నాకున్న అభిమానానికి కొలమానమూ వుండదు.