Saturday, June 4, 2011

భలే ఉందే!

చైనాలో వస్తువులను చాలా విచిత్రంగా తరలిస్తున్నారు. మొన్న నెట్లో ఆ ఫోటోలు చూసి చాలా ఆశ్చర్యపోయాను. మీరు కూడా చూస్తారని సరదాగా వాటిని ఇక్కడ ఉంచుతున్నాను.













 

Friday, June 3, 2011

అక్కడేముంది?





(సాక్షి ఫన్ డే కోసం రాసిన ఆర్టికల్ ) 

Monday, February 28, 2011

సారీ బాలయ్యా!


మనుషుల్లో సంస్కారం ఎందుకింత లోపిస్తోందో ఒక్కోసారి అర్థం కాదు నాకు. ఈరోజు ఒక చానెల్లో బాలకృష్ణ గురించి న్యూస్ చూడగానే కడుపు మండిపోయింది. ఒక వ్యక్తిని అభిమానిస్తే నెత్తిన పెట్టుకుంటారు. దానివల్ల ఎవరికీ ఏ నష్టమూ వుండదు కాబట్టి ఓకే. కాని అభిమానించకపోతే ఇంతలా అవమానించటం సరి కాదు. దానివల్ల అవతలి వ్యక్తి పరువు, మర్యాద పాడవుతాయనే  జ్ఞానం కూడా లేకపోతె ఎలా? తన సినిమాలు చూడమని బాలయ్య ఎవరినీ బతిమాలడం లేదు కదా. ఇష్టమైతే చూడాలి లేకపోతె లేదు. అంతేకాని ఇలా ఐ హేట్ బాలయ్య డాట్ కాం అంటూ ఒక సైట్ ఓపెన్ చేసి, ఆయనను అవమానించేలా ఫోటోలు పెట్టటం, పిచ్చి పిచ్చి రాతలు రాయటం సంస్కారం వున్నవాలు చేసే పని కాదు. ఇంత కుసంస్కారం తమలో వున్నందుకు ఈ పని చేసినవాళ్ళు సిగ్గుపడాలి. వాళ్ళ బదులు నేను బాలయ్యకు క్షమాపణ చెప్తున్నాను. సారీ బాలయ్యా.

దయ చేసి ఇలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించకండి. ఇలాంటి పనులు చేసేవాళ్ళు మీకు కనిపిస్తే తగిన బుద్ధి చెప్పకుండా వదలకండి. ఎందుకంటే రేపు మీరే ఒక స్టార్ కావచ్చు. మీరు నచ్చని వాళ్ళెవరో మీ గురించి కూడా ఇలాంటి ఒక సైట్ ఓపెన్ చేయవచ్చు. మీ మీద బురద చల్లే ప్రయత్నం చేయవచ్చు.

Saturday, October 2, 2010

మది చీల్చుకు వచ్చిన మాట


సాక్షి ఫ్యామిలీలో జిందగీ కాలమ్ కోసం రాసిన ఆర్టికల్.



Wednesday, September 29, 2010

నా లిస్టులో చేరిన మరో మంచి సినిమా!


దాసరి నారాయణరావు...  నా నా అభిమాన దర్శకుడు అని చెప్పేస్తే సరిపోదు. ఎందుకంటే నాలాంటి అభిమానులు వందల్లో, వేళల్లో వుంటారు. అద్భుతమైన సినిమాలను సృష్టించిన ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. బలిపీఠం, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి,  మేఘసందేశం, ప్రేమాభిషేకం, శివరంజని... ఒకటా రెండా.. చెప్పుకుంటూ పోతే లెక్క తెగనన్ని చిత్ర రాజాలు మన కళ్ళముందు ఠీవిగా వచ్చి నిలబడతాయి. అలాంటి ఒక చిత్రాన్ని ఈరోజు ఉదయం తేజ టీవిలో చూసాను. అదే ధర్మపీఠం దద్దరిల్లింది. శోభన్ బాబు, జయసుధ, కైకాల సత్యనారాయణ తదితరులు నటించిన ఈ చిత్రం.. దర్శకరత్నమన తెలుగు ప్రేక్షకులకు ఇచ్చిన మరో మంచి చిత్రం.
                మామూలుగానే శోభన్ బాబు అంటే పడి చచ్చే నేను, ఈ సినిమాలో ఆయన నటన చూసి రెప్ప వేయటం కూడా మర్చిపోయాను. ఆ ఠీవి, ఆ నడక, ఆ డైలాగ్ డెలివరీ... ఓహ్.. ఆ పాత్రలో ఆయన జీవించారు. తన బిడ్డలను దేశానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలనే వున్నతమైన ఆలోచనతో ఒకడిని డాక్టర్ని, ఒకడిని ఇంజినీర్ని, ఒకడిని లాయర్ని చేస్తాడు తండ్రి. కానీ వాళ్ళు అవినీతికి కొమ్ము కాసేవాళ్ళుగా, లంచాలకు న్యాయాన్ని తాకట్టు పెట్టేవాల్లుగా తయారవుతారు. ఒక కొడుకు చేసిన దుర్మార్గాన్ని చూసిన తల్లి దానిని బయటపెట్టబోతున్న తల్లిని, ముగ్గురు కొడుకులూ కలిసి  పిచ్చిదానిలా చిత్రీకరిస్తారు. ఒక సమయంలో భర్తకు నిజం చెప్పి కన్ను మూస్తుంది ఆమె. సాయం చేయమని వచ్చిన తన స్నేహితునికి సైతం డబ్బుకు ఆశపడి తన కొడుకులు అన్యాయం చేయడాన్ని జీర్నిన్చుకోలేకపోతాడు తండ్రి. వాళ్ళు బతికుంటే సమాజాన్ని నాశనం చేస్తారన్న ఉద్దేశంతో తన ముగ్గురు కొడుకుల్నీ చంపేస్తాడు. న్యాయస్థానం అతనికి ఉరిశిక్షను విధించగానే, కోర్టులోనే కుప్పకూలిపోతాడు.
             కధ ఆసాంతం ఆసక్తికరంగా సాగుతుంది. అందరూ ఎవరి పాత్రలకు వాళ్ళు న్యాయం చేసారు. అయితే శోభన్ నటన మాత్రం అద్వితీయం. ముఖ్యంగా క్లైమాక్స్లోని  కోర్టు సీన్లో ఆయన హావభావాలు, డైలాగ్స్ చెప్పేటప్పుడు ఖంగుమనే స్వరం అమేజింగ్. శోభన్ బాబు సినిమా కదా అని చూడటం మొదలుపెట్టాను కానీ, ఆ కధ, కధన శైలి నన్ను కదలనివ్వలేదు. హాట్సాఫ్ టు దాసరి అండ్ శోభన్ బాబు!

న్యాయం గెలిచిందా ఓడిందా?

సుదీర్ఘ విచారణలు, వివాదాల తరువాత ఆయేషా మీరా హత్య కేసులో తీర్పు వెలువడింది. నిందితుడికి యావజ్జీవ శిక్ష పడింది. అయితే శిక్ష పడింది నేరం చేసినవాడికేనా? చేసాడని అనుకుంటున్న వాడికా?


       ఆ రోజు ఉదయం పేపర్లో ఆయేషా హత్య గురించి చదివి నేను కదలిపోయాను. మనుషుల్లో ఇంత పైశాచికత్వం, ఇంత రాక్షసత్వం ఉంటాయా అని హడాలిపోయాను. అభం శుభం తెలియని ఒక ఆడపిల్లని ఇంత క్రూరంగా చంపిన మానవ మృగాన్ని ఏమి చేసినా పాపం లేదని అనుకున్నాను. కాని నేను కోరుకున్నట్టు వాడిని ఎవరూ ఏమీ చేయలేదు. ఒక పసిమొగ్గ రాలిపోయింది. ఎవరూ పట్టించుకున్నట్టు కనిపించలేదు. ఒక కన్నతల్లి కన్నీరు ఏరయ్యింది. ఆమెకు ఎవరూ ఓదార్పు కలిగించలేదు. న్యాయం చేయలేదు. సాక్ష్యాలు తారుమారయ్యాయి. వాస్తవాలు మారిపోయాయి. 
          ఆయేషా హత్య జరిగిన రోజు ఆమె ఉంటున్న హాస్టల్ ఎదురుగా ఉన్న టీ కొట్టులో టీ తాగుతూ, హాస్టల్ వద్దనే సత్యంబాబు తచ్చాడటం ఒక వ్యక్తి చూశాడు. అంతకుమించిన ప్రత్యక్ష ఆధారాలు లేవు. అయినా అతన్ని అరెస్ట్ చేసారు. రకరకాలుగా విచారణ చేసారు. అతను నేరాన్ని అంగీకరించాడు. ఇప్పుడు శిక్షకీ తల వంచాడు. కానీ అతడు నేరస్తుడు కాదని, అసలు నేరస్తులు వేరే వున్నారని ఆయేషా తల్లి బల్ల గుద్ది చెప్పారు. మరి ఆ మాటలను ఎవరూ ఎందుకు పట్టించుకోలేదో, కనీసం హాస్టల్ వార్డెన్ని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదో ఎవరికీ తెలియదు. ఇప్పటికీ అర్ధం కాని, సమాధానం దొరకని ప్రశ్నలే. అయితే ఈ ప్రశ్నలు తీర్పు ఇచ్చే జడ్గి మనసులో రేకేత్తకపోతయా, వాళ్ళని కూడా హాజరుపరచమని ఆదేశాలు ఇవ్వకపోతాడా అని చివరి క్షణం వరకూ ఆశగా చూసాను. కాని నేనూ అనుకున్నది జరగలేదు.  అనుమానాలు నివృత్తి కానేలేదు. కేసు మాత్రం పూర్తయింది. న్యాయమే గెలిచిందో అన్యాయమో గెలిచిందో తెలియదు కానీ ఆయేషా హత్యోదంతానికి శాశ్వతంగా తెర పడింది.
          ఎందుకో తెలియదు కాని, ఈ తీర్పు నాకు సంతృప్తిని కలిగించలేదు. సత్యం అసలు నేరస్తుడు కాదని అందరిలాగే నేనూ నమ్మటం వల్లనా లేక ఒక అమాయక ఆడపిల్లను నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్న క్రూరునికి ఆ శిక్ష సరిపోదనా? ఏమో... ఏమీ తెలియటం లేదు. ఒకటి మాత్రం అనిపిస్తోంది. ఈ సమాజంలో ఆడపిల్లకు ఇప్పటికీ రక్షణ కరువే... పేదవాడికి ఎప్పటికి న్యాయం కరువే.

Friday, August 20, 2010

చిన్నవాళ్ళ పెద్ద మనసు


దేనికోసమో ఇంటర్నెట్ ను తవ్వుతుంటే ఈ అద్భుత దృశ్యం కంటబడింది. మనిషికి మనిషి చేయగలిగిన సాయం చేయడానికి కూడా ముందుకు రాని ఈ రోజుల్లో, ఆడుతూ పాడుతూ తిరిగే ఈ పసివాళ్ళు ఒక మూగ ప్రాణిని కాపాడటం కోసం పడిన తపన నన్ను కదిలించింది. స్వార్ధంతో మన సుఖం మన సంతోషం తప్ప, సాటి మనిషి గురించి కనీసం పట్టించుకోని మనకు పిల్లలు నేర్పుతున్న పాఠం ఇది!   



Friday, August 13, 2010

నీవు మరపు'రావు'


నేడు రావు గోపాలరావు వర్ధంతి.

ఆహార్యం, వాచకం, అభినయం... అన్నింట్లోనూ ఆయనది ఒక ప్రత్యేక శైలి. ఆయన కామెడీ చేస్తే నవ్వలేక పొట్టలు పగిలిపోతాయి. ఆయన విలనిజం చూపితే భయంతో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 'ఊరికి మొనగాడు' నుంచి 'ఆ ఒక్కటి అడక్కు' వరకు తన నటనా కౌశలంతో తెలుగు ప్రజానీకాన్ని ఉర్రూతలూగించిన రావు గోపాలరావు వర్ధంతి నేడు. తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ దగ్గరలోని గంగనపల్లిలో జన్మించిన రావు గోపాలరావు, దేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగారు. తన అద్బుత నటనతో అందరి మనస్సులో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు.
               నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రావు గోపాలరావు సినిమాలు చూస్తూనే వున్నాను. సాధారణంగా ఆయన పేరు చెప్పగానే అందరూ ముత్యాలముగ్గు గురించి మాట్లాడతారు. కానీ నాకు మాత్రం మల్లెపువ్వు సినిమాలో నటన ఇష్టం. ఇప్పటికీ ఆ సినిమా 22 సార్లు చూసాను. శోభన్ బాబు నటన,  కధ, కధనం, పాటలు... వీటన్నిటితో పాటు రావు గోపాలరావు నటన అమితంగా నచ్చటమే  అందుకు కారణం. ఇంటిగుట్టులో పాత్ర కూడా మనసుకు హత్తుకుంటుంది. అంత ఉదాత్తమైన పాత్రలో గుండెను తాకేలా ఆయన ప్రదర్శించిన నటన కంటతడి పెట్టిస్తుంది. దేవాలయం, బొబ్బిలి పులి, దొంగ మొగుడు, చాలెంజ్, గ్యాంగ్ లీడర్ తదితర చిత్రాల్లో విలన్ రావు గోపాలరావుని, ఘరానా మొగుడు, అల్లరి అల్లుడు, ఆ ఒక్కటి అడక్కు తదితర చిత్రాల్లోని సాత్వికుడైన రావు గోపాలరావుని మరచిపోవటం అంత తేలిక కాదు. అందుకేగా చనిపోయి పదహారేళ్ళు అవుతున్న ఇప్పటికీ ఆయనను మన మనసుల్లో సజీవంగా నిలుపుకుని కొనియాడుతున్నాం! 
              మన అభిమాన నట రారాజు ఆత్మకు శాంతి కలగాలని మనసారా ప్రార్ధిద్దాం!


  


Friday, July 23, 2010

పాలబుగ్గలపై కన్నీటి చారికలా?

మొన్న పేపర్ చదువుతుంటే ఒక వార్త... పన్నెండేళ్ళ బాలికపై అత్యాచారం.
నిన్న మరో వార్త... ప్రేమించలేదంటూ పద్నాలుగేళ్ళ బాలికపై యాసిడ్ దాడి.
ఇవాళ ఇంకో వార్త... తుపాకీతో బెదిరించి మైనారిటీ తీరని పిల్లలపై అత్యాచారం చేస్తున్న స్కూల్ కరస్పాండెంట్.
ఏమిటిదంతా?
పై వార్తలు చదివినప్పుడు నా మనసులో ఉత్పన్నమైన ప్రశ్న.
ఆడదాని దౌర్భల్యం. స్త్రీజాతి దురదృష్టం. మహిళల నిస్సహాయత.
నాకు నేను చెప్పుకున్న సమాధానం.
చిన్ననాటి నుండీ వింటున్న ఒక రొటీన్ సమాధానం.
ఏమిటీ దౌర్భాగ్యం?
ఆడదాన్ని చూడగానే తప్పుడు ఆలోచనలే ఎందుకు కలుగుతున్నాయీ  మగాళ్ళకి?
చిన్న పెద్ద తేడా కూడా చూడకుండా కామంతో మూసుకుపోయిన చూపులు వెంటాడుతుంటే ఎలా బతుకుతుంది ఆడది ఈ మగాళ్ళ లోకంలో?
ఇంటర్వ్యూకి సిటీకి వచ్చిన ఒక వివాహితను, ఆటో డ్రైవర్ తన స్నేహితులతో కలిసి రేప్ చేసాడు.
చుట్టపు చూపు చూడటానికి వచ్చి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆరేళ్ళ చిన్ని పాపపై పశువులా పడ్డాడో ముదుసలి.
పొరపాటున తన బావతో హోటల్ గదిలో దొరికినందుకు, సెల్ ఫోనులో ఫోటోలు తీసి, వాటి ద్వారా బెదిరించి ఒక అమ్మాయిపై నాలుగు నెలలపాటు అత్యాచారం జరిపారు పోలీసులు.
ఎన్ని అకృత్యాలు? ఎన్ని దుర్మార్గాలు? ఎన్నెన్ని దారుణాలు?
టెన్నిస్ నేర్చుకోడానికి వెళ్ళిన రుచిక పరిస్తితి ఏమయ్యింది?
ఐజీ పదవిలో వున్న రాక్షసుడు పద్నాలుగేళ్ళ ఆ పాపపై అక్రుత్యానికి ఒడిగట్టాడు. న్యాయం కోసం పోరాడీ పోరాడీ అలసిపోయిన ఆ పసి మనసు ముక్కలైపోయింది. మలినమైన తనువుతో బతకలేక మరణంతో తన కధకు ముగింపు పలికింది.
చదువుకోవాలనే ఆశతో హాస్టల్లో చేరిన ఆయేషాకు జరిగిన అన్యాయం తెలియనిదెవరికి?
మృగంలా ఒక మగాడు ఆమె తనువును చీల్చేస్తుంటే, ఆ చిట్టితల్లి పెట్టిన కేకలు ఏ గాలిలో కలిసిపోయాయో?
ప్రత్యూష చావు వెనుక వున్న రహస్యాలను బయటపెట్టేది ఎవరు?
పల్లెల్లో.. పట్టణాల్లో.. మహిళలపై ఇలాంటి అత్యాచారాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.
అంతమైపోయిన ఆ జీవితాలను చూసి ఈ లోకం ఒక చిన్న కన్నీటి బొట్టు విడుస్తుంది.
రాలిపోయిన ఆ లేలేత కుసుమాల కోసం ఒక నిమిషం మౌనం పాటిస్తోంది.
ఆ తరువాత వాళ్ళ కధలు కాగితాల్లో మిగిలిపోతాయి.
వాళ్లకు జరిగిన అన్యాయం కాలగర్భంలో కలిసిపోతుంది.
ఇంతేనా?
నెలల పిల్లల్ని సైతం ఎవరి చేతుల్లోనూ పెట్టలేని భయం ఎందుకు మనకి?
పిల్లల్ని స్కూలుకి పంపి, వాళ్ళు తిరిగి వచ్చేవరకూ ప్రశాంతంగా ఉండలేని దౌర్భాగ్యం ఏమిటి మనకి?
ఆడపిల్లని కనటమే పాపమా?
అలాగే వుంది పరిస్తితి.
ఆడపిల్లని పెంచటం, పెళ్లి చేయటం కాదు, వాళ్ళని కామాంధుల కళ్ళల్లో పడకుండా కాపాడుకోవటమే కష్టమైన పని నేటి తల్లిదండ్రులకి.
ఇలాగైతే ఆడపిల్లలకి రక్షణ కలిగేదేప్పుడు?
ఈ సమాజంలో వాళ్ళు ధైర్యంగా తిరిగేదేప్పుడు?
అత్యాచారాలు, లైంగిక వేధింపుల పట్ల మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు ఆందోళన చేస్తాయి గాని కాలగమనంలో వారి ఆందోళనలు మరుగునపడిపోతున్నాయి. ఒక కేసులో తీర్పు వచ్చేలోపు మరో కేసు. ఆ కేసును పరిసీలించేలోపు మరోటి. సంఘటనలు జరగటమే తప్ప సమస్యకు అంతం కనిపించటం లేదు. ఏళ్ళ తరబడి కేసులు వాయిదాలు.. యీలోపు సాక్షులను, సాక్ష్యాధారాలను తారుమారు చేయటం.. కేసును తమకు అనుకూలంగా మలచుకోవడం.. పైకోర్టుకు అప్పీలు.. తర్వాత కేసు మాఫీ…
ఇంతకు మించి జరిగేదేమిటి?
వున్న దరిద్రం చాలక అత్యాచారం జరగడానికి స్త్రీ కూడా కారణమని వాదిస్తున్నారు కొందరు ప్రబుద్దులు. స్త్రీలు శరీర భాగాలు కనపడేలా దుస్తులు ధరిస్తే మగాడు ఊరుకుంటాడా? ఆ మధ్య ఒక మగ మహారాజు వేసిన ప్రశ్న ఇది.
అందరు ఆడవాళ్ళు అమాయకులు,  మగాళ్ళంతా దుర్మార్గులు అని నేను వాదించను. అందరు ఆడవాళ్ళూ అమాయకులు కాకపోవచ్చు. అందరు మగాళ్ళూ కీచకులు కాకపోవచ్చు. కానీ సమాజంలో జురుగుతున్న దారుణాలను చూసిన తరువాత ఆడదానికి మగాడి నుంచి ఎదురవుతున్న సమస్యలు చూసిన తరువాత ఇలా మాట్లాడాల్సి వస్తోంది. ఆడదానికి అన్యాయం చేస్తున్న మగాళ్ళ గురించే మనం మాట్లాడాలి.
ఆడది సరైన బట్టలు వేసుకోకపోవటం వల్ల మగాడికి కోరిక పుడుతోందా? ఎంత నీచమైన వాదన ఇది! నెలల పసికందులపై, పదేళ్లలోపు పిల్లలపై కూడా దారుణాలకు ఒడిగడుతున్నారు. మరి వాళ్ళు కూడా ఈ కోవలోకే వస్తారా? పొట్టి దుస్తులు మాత్రమే కాదు, చీర కట్టుకున్న ఆడది కూడా బలవుతోంది. దానికేమంటారో సదరు పెద్దమనిషి!
రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ దుస్తితికి బాధపడకుండా, ఇలాంటి అర్ధం పర్దం లేని కామెంట్లు చేసేవాళ్ళకు వేయాలి ముందు శిక్ష.
మనిషిలో పెరిగిపోతున్న పశు ప్రవ్రుత్తి, మంటగలిసిపోతున్న మానవీయ విలువలు ఈ దారుణాలకు కారణమని తెలిసి కూడా ఆడదానిపై నిందలు మోపి, తమ రాక్షసత్వాన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్న మగ మహారాజులకు నాదో మనవి.
దయ చేసి మీ రాక్షస క్రీడకు పాలబుగ్గల పసివాళ్ళను బలి చేయకండి.
మానవత్వాన్ని మర్చిపోయి లేలేత కుసుమాలను నిర్దాక్షిణ్యంగా నలిపి పారేయకండి.
అంకుల్, అన్నయ్యా, సార్ అంటూ అమాయకంగా పిలిచే ఆ చిట్టి తల్లుల్లకు చితి పేర్చకండి.
పరాయివాళ్ళ పిల్లల పట్ల అలాంటి ఆలోచన కలిగితే... మీ కడుపున పుట్టిన బిడ్డను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.
మహానుభావులు కానక్కర్లేదు, కనీసం మనుషుల్లా ప్రవర్తించండి.

Thursday, July 8, 2010

మనసున్న మారాజు

జనుల మనసెరిగిన రాజు
మమతకు అర్ధం చెప్పిన మనసున్న మారాజు
ప్రజల శ్రేయస్సే పరమావధిగా పాలించిన రారాజు
ప్రతిఫలమాశించక ప్రేమను పంచిన మహారాజు

ఆయన లేకున్నా అయన జ్ఞాపకాలు మనలను విడిచిపోవు.
అయన వెళ్ళిపోయినా ఆయన పంచిన వెలుగులో బతుకుతున్న జీవితాలు ఆయనను మరచిపోవు.

మదిమదిలో కొలువైన మహా మనీషికి వందనం
మరువలేని, మరపురాని మహానుభావునికి అభివందనం